DC vs GT
ఉత్సాహంగా సాగుతున్న ఐపీఎల్ 19వ సీజన్ కు వరుణుడు బ్రేక్ వేశాడు. వరుసగా రెండు మ్యాచ్ లకు అడ్డంకిగా నిలిచాడు. ఇప్పుడు బుధవారం ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆసక్తికర సమరం జరగబోతోంది. వరుస విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ , ఇప్పటి వరకూ గెలుపు ఖాతా తెరవని గుజరాత్ టైటాన్స్(DC vs GT) తో తలపడబోతోంది. అన్ని విభాగాల్లో మంచి ఫామ్ లో ఉన్న ఢిల్లీ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.
ముఖ్యంగా సమీర్ రిజ్వీ విధ్వంసకర ఫామ్ లో ఉన్నాడు. గత రెండు మ్యాచ్ లలోనే అతనే ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. లక్నోపై కేవలం 47 బంతుల్లో 70 రన్స్ తో నాటౌట్‌గా నిలిచిన సమీర్ రిజ్వీ.. ముంబై ఇండియన్స్ పై మరింత రెచ్చిపోయాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో 51 బంతుల్లో 90 పరుగులు బాదేశాడు. రిజ్వీ బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి.
లక్నోతో మ్యాచ్ లో 4 వికెట్లు కోల్పోయిన తర్వాత అతను ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమనే చెప్పాలి. దీంతో ఢిల్లీ బ్యాటింగ్ లో అత్యంత కీలకంగా మారిపోయిన రిజ్వీ హోంగ్రౌండ్ లో రెచ్చిపోవడం ఖాయం. మిగిలిన బ్యాటింగ్ లైనప్ చూస్తే ఓపెనర్ నిస్సాంక కూడా ఫామ్ అందుకున్నాడు. అయితే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం ఇంకా ఫామ్ లోకి రాలేదు. గత రెండు మ్యాచ్ లలోనూ నిరాశపరిచాడు. 2025 సీజన్ పరుగుల వరద పారించిన రాహుల్ గుజరాత్ పై సత్తా చాటాలని ఎదురుచూస్తున్నాడు.
అలాగే నితీష్ రాణా, డేవిడ్ మిల్లర్ ఇంకా పూర్తిస్థాయి విధ్వంసం చూపించలేదు. కెప్టెన్ అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్, స్టబ్స్ వంటి వారితో బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. అటు బౌలింగ్ లో మిఛెల్ స్టార్క్ లేకున్నా నటరాజన్, ఎంగిడి అదరగొడుతున్నారు. గత రెండు మ్యాచ్ లలో అదిరిపోయే ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా భీకరమైన బ్యాటింగ్ ఉన్న ముంబై లాంటి జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. కుల్దీప్ తో పాటు అక్షర్ పటేల్ కూడా రాణిస్తున్నాడు. దీంతో ఏ విధంగా చూసినా సొంతగడ్డపై ఢిల్లీనే ఫేవరెట్ గా భావిస్తున్నారు.
మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ లో ఇంకా గెలుపు రుచి చూడలేదు. ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడిపోయింది. తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై ఓడిన టైటాన్స్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ పై పరాజయం పాలైంది. నిజానికి రాజస్థాన్ పై గెలుపు అంచుల వరకూ వెళ్లి చేజేతులా ఓడింది.
సాయిసుదర్శన్ మంచి ఆరంభాన్నిచ్చినా కీలక బ్యాటర్లు విఫలమయ్యారు. బట్లర్, గ్లెన్ ఫిలిప్స్, తెవాటియా , షారూఖ్ ఖాన్ వంటి వారంతా చేతులెత్తేశారు. చివర్లో రషీద్ ఖాన్, రబాడ పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ సీజన్ ఆరంభం నుంచీ కూడా గుజరాత్ కు బ్యాటింగ్ వైఫల్యమే మైనస్ గా మారింది. కాగా గత మ్యాచ్ కు మెడనొప్పి కారణంగా దూరమైన కెప్టెన్ గిల్ ఢిల్లీపై రీఎంట్రీ ఇస్తున్నాడు. గిల్ తో పాటు మిగిలిన బ్యాటర్లు రాణిస్తే తప్ప గుజరాత్ గెలుపు ఖాతా తెరవడం కష్టమే.
బౌలింగ్ లో రబాడ, సిరాజ్ , ప్రసిద్ధ కృష్ణ వికెట్లు తీస్తున్నా పరుగులు ఇచ్చేస్తున్నారు. పేస్ ఎటాక్ మరింత కట్టడిగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. స్పిన్నర్ రషీద్ ఖాన్ మ్యాజిక్ కనిపించడం లేదు. కాగా మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న ఢిల్లీ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. దీంతో హైస్కోరింగ్ మ్యాచ్ ఖాయమే.
Rajasthan Royals : దంచికొట్టిన జైస్వాల్, వైభవ్…రాజస్థాన్ చేతిలో ముంబై ఓటమి
