Gautam Gambhir : గౌతముడి గంభీరమైన విజయం..అతని రూటే సెపరేటు

Gautam Gambhir : భారత క్రికెట్ జట్టు కోచ్ పదవి కత్తి మీద సాము లాంటిది... ఎన్నో అంచనాలుంటాయి.. విజయాలు వస్తుంటే అంతా బాగానే ఉంటుంది..

Gautam Gambhir

భారత క్రికెట్ జట్టు కోచ్ పదవి కత్తి మీద సాము లాంటిది.  ఎన్నో అంచనాలుంటాయి. విజయాలు వస్తుంటే అంతా బాగానే ఉంటుంది. ఒక్క ఓటమి ఎదురైందా ముందు సాధించిన 10 విజయాలను సైతం పక్కన పెట్టేస్తారు. విమర్శలతో ఏకిపారేస్తుంటారు.  అటు ఫ్యాన్స్, ఇటు మాజీలు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తుంటారు.

ఈ ఒత్తిడిని తట్టుకుని జట్టును ముందుకు నడిపించడం అతిపెద్ద సవాల్ గానే చెప్పాలి. రాహుల్ ద్రావిడ్ 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత తన పదవీకాలం ముగియడంతో తప్పుకున్నాడు. అతని స్థానంలో బాధ్యతలు తీసుకున్న గంభీర్(Gautam Gambhir) డిక్టేటర్ లా వ్యవహరించాడు. బీసీసీఐతో కొట్లాడి మరీ తనకిష్టమైన సపోర్ట్ స్టాఫ్ నే తెచ్చుకున్నాడు. తనతో పెద్దగా పొసగని సీనియర్ ప్లేయర్స్ ను జట్టు నుంచి బయటకు పంపించాడు. ఒకవిధంగా సీనియర్ల రిటైర్మెంట్ కు పరోక్షంగా కారణమయ్యాడు. దీనిపై తీవ్ర విమర్శలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు.

బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రయోగాలు, తుది జట్టు ఎంపికలో మార్పులకు శ్రీకారం చుట్టాడు. స్వదేశంలో న్యూజిలాండ్ పై టెస్ట్ సిరీస్ ను 0-3తో కోల్పోయినా, ఆస్ట్రేలియా టూర్ లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సైతం చేజార్చుకున్నా తుది జట్టులోనూ, బ్యాటింగ్ ఆర్డర్ లోనూ ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు.

మాజీలు, విశ్లేషకులు విమర్శలు గుప్పించినా గంభీర్(Gautam Gambhir) మాత్రం తగ్గేదే లేదంటూ ముందుకే సాగాడు. వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టుపైనా కొన్ని విమర్శలు వచ్చినా తనదైన వ్యూహాలతో ఆకట్టుకున్నాడు. కొందరు ఆటగాళ్లను బెంచ్ కే పరిమితం చేయడం, వరుసగా ఫెయిలవుతున్న అభిషేక్ శర్మకు అవకాశాలు ఇస్తూనే ఉండడం కూడా విమర్శలు దారితీసినా గంభీర్ మాత్రం ఎవ్వరినీ పట్టించుకోలేదు.

అమెరికాతో మ్యాచ్ లో తడబడినా మిగిలిన మ్యాచ్ లలో వరుస విజయాలతో సూపర్ 8లోకి వచ్చిన తర్వాత గంభీర్ కు అసలు సిసలు అగ్ని పరీక్ష మొదలైంది. ముఖ్యంగా సౌతాఫ్రికా చేతిలో అనూహ్య ఓటమితో గంభీర్ గతంలో ఎన్నడూ లేనన్ని విమర్శలు చవిచూడాల్సి వచ్చింది. ఐసీసీ టోర్నీ మధ్యలో కూడా బ్యాటింగ్ ఆర్డర్ లో పిచ్చి ప్రయోగాలు చేస్తున్నాడంటూ పలువురు మాజీ ఆటగాళ్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ విమర్శలేవీ కూడా గంభీర్ నిర్ణయాలను మార్చలేకపోయాయి.

Gautam Gambhir

పైగా సౌతాఫ్రికాతో మ్యాచ్ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో కలిసి తీసుకున్న నిర్ణయాలు భారత్ జట్టును మళ్లీ గెలుపు బాటలో నడిపించాయి. అప్పటి వరకూ బెంచ్ కే పరిమితమైన సంజూ శాంసన్ ను తుది జట్టులోకి తీసుకుని ఓపెనర్ గా పంపించాడు. దీని కోసం ఇషాన్ కిషన్ ను మూడో స్థానంలో బ్యాటింగ్ కు దింపాడు.

అదే సమయంలో తిలక్ వర్మ బ్యాటింగ్ స్థానం కూడా మార్చాల్సి వచ్చింది. ఈ ప్రయోగాలు మాత్రం అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. అభిషేక్ శర్మ నిరాశపరుస్తున్నా సంజూ శాంసన్ మాత్రం దుమ్మురేపాడు. అటు ఇషాన్ కిషన్ కూడా కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. ఇక తిలక్ వర్మ గురించి చెప్పేదేముంది… ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేస్తూ భారీ షాట్లు కొట్టడంలో రాటుదేలిపోయాడు. దీంతో గంభీర్ ప్రయోగాలు  మంచి ఫలితాలను అందించాయంటూ కితాబులు దక్కాయి.

అలాగే మ్యాచ్ జరుగుతుండగా బౌలింగ్ మార్పుల విషయంలోనూ గంభీర్ మార్క్ కనిపించింది. వెస్టిండీస్ తో మ్యాచ్ లో బుమ్రాను దింపిన తీరు దీనికి నిదర్శనం. అలాగే ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో బెథల్ వీరవిహారం చేస్తున్నప్పుడు హార్థిక్, బుమ్రాలను బౌలింగ్ కు దింపి సక్సెస్ అయ్యాడు. ఇలా తనపై విమర్శలను పట్టించుకోకుండా తాను అనుకున్న విధంగానే జట్టులో మార్పులు చేసి ఇప్పుడు టీ20 క్రికెట్ లో విశ్వవిజేతగా నిలిపాడు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఈ విజయం ఆటగాళ్ల సమిష్టి కృషితోనే సాధ్యమైందని, తన ఘనత ఏం లేదంటూ గంభీర్ చెప్పడం ఆకట్టుకుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version