Gujarat Titans
ఐపీఎల్ 19వ సీజన్ క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీపై ఓడిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) రెండో అవకాశాన్ని వదులుకోలేదు. రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టింది. బ్యాటింగ్ లో శుభ్‌మన్ గిల్ సెంచరీ ఇన్నింగ్స్ తో చెలరేగిన వేళ 215 పరుగుల టార్గెట్ ను ఆడుతూ పాడుతూ ఛేదించింది. తద్వారా మూడోసారి ఫైనల్ కు చేరిన టైటాన్స్ బెంగళూరుతో టైటిల్ పోరుకు రెడీ అయింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. వీలైనంత భారీస్కోరు ప్రత్యర్థి ముందు ఉంచే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రాజస్థాన్ కు గుజరాత్(Gujarat Titans) బౌలర్లు షాకిచ్చారు. ఆరంభంలోనే వరుస వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. కేవలం 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ (1), జురెల్ (7) పరుగులకే ఔటయ్యారు.
ఈ దశలో జడేజాకు ప్రమోషన్ ఇచ్చి సెకండ్ డౌన్ లో పంపడం కలిసొచ్చింది. ఆరంభంలోనే 2 వికెట్లు పడిపోవడంతో వైభవ్ సూర్యవంశీ కూడా భారీ షాట్లు కొట్టేందుకు కాస్త తటపటాయించాడు. తన సహజశైలికి భిన్నంగా కాస్త నెమ్మదిగా ఆడాడు. అటు జడేజా కూడా హిట్టింగ్ చేసాడు. ఈ క్రమంలో వైభవ్ మరో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వైభవ్ తన కెరీర్ లో అత్యంత నిదానంగా చేసిన హాఫ్ సెంచరీ ఇదే. అయితే జడేజా రిటైర్డ్ హర్ట్ గా 34 పరుగుల దగ్గర పెవిలియన్ కు వెళ్లిపోయాడు. ఇక్కడ నుంచీ రాజస్థాన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. రియాన్ పరాగ్ (11), శనక (3), ఆర్చర్ (7) పరుగులకే ఔటయ్యారు.
ఈ దశలో జడేజా మళ్లీ క్రీజులోకి వచ్చి సూర్యవంశీకి జతకలిసాడు. దీంతో దూకుడు పెంచిన సూర్యవంశీ సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే 96 పరుగుల దగ్గర భారీ షాట్ కు ప్రయత్నించి రబాడ బౌలింగ్ లో వెనుదిరిగాడు. దీంతో వరుసగా రెండో మ్యాచ్ లోనూ సెంచరీ చేజార్చుకున్నాడు. వైభవ్ ఔటైపోవడంతో రాజస్థాన్ 200 చేయడం కష్టంగా కనిపించింది.
చివర్లో ఫెరీరా 11 బంతుల్లోనే 38 (2 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. దీంతో రాజస్థాన్ 214 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ తొలి బంతి నుంచే ధాటిగా ఆడింది. ఈ సీజన్ లో టైటాన్స్(Gujarat Titans) విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఓపెనర్లు సాయి సుదర్శన్, గిల్ మరోసారి అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు.
రాజస్థాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి టాప్ గేర్ లో ఇన్నింగ్స్ నడిపించారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. హాఫ్ సెంచరీ తర్వాత గిల్ మరింత రెచ్చిపోయాడు. సాయి సుదర్శన్ కంటే తానే ఎక్కువ స్ట్రైకింగ్ తీసుకుని భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అటు సాయి సుదర్శన్(58) మరోసారి బ్యాట్ ను వికెట్లపై జారవిడుచుకుని ఔటయ్యాడు.
ఇదిలా ఉంటే గిల్ 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్ 104 (15 ఫోర్లు, 3 సిక్సర్లు) రన్స్ కు ఔటవగా.. తర్వాత బట్లర్, వాషింగ్టన్ సుందర్ గుజరాత్ విజయాన్ని పూర్తి చేశారు. దీంతో ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ మూడోసారి ఫైనల్ కు చేరింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఆర్సీబీతో తలపడుతుంది.
YS Sharmila : రాజ్యసభకు వైఎస్ షర్మిల ?..కీలక టాస్క్ అప్పగించిన రాహుల్
