IND vs AFG
ఐపీఎల్ సందడి ముగిసిపోయి వారం రోజులవుతోంది. ఈ తక్కువ సమయంలోనే భారత్ ఆటగాళ్లు అంతర్జాతీయ సిరీస్ కు రెడీ అయ్యారు. ఇప్పటి నుంచి దాదాపు ఏడాది పాటు నాన్ స్టాప్ క్రికెట్ ఆడబోతున్నారు. దీనిలో భాగంగా ఆప్ఘనిస్థాన్(IND vs AFG) తో ఏకైక టెస్ట్ మ్యాచ్ కు టీమిండియా సిద్ధమైంది. రెడ్ బాల్ క్రికెట్ లో గత ఏడాది పేలవ ప్రదర్శన నేపథ్యంలో ఆప్ఘనిస్థాన్ పై భారీ విజయమే లక్ష్యంగా పెట్టుకుంది.
సొంతగడ్డపై ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న భారత్ తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ లో రాణించిన పలువురు ఆటగాళ్లకు ఈ టెస్టులో చోటు దక్కింది. సాయి సుదర్శన్ , నితీశ్ కుమార్ రెడ్డి, పడిక్కల్ మళ్ళీ టెస్ట్ జట్టులోకి వచ్చారు. అలాగే తొలిసారి హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ చోటు దక్కించుకున్నారు. పంత్ ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించి రాహుల్ ను గిల్ కు డిప్యూటీగా నియమించారు.
తుది జట్టును చూస్తే జైస్వాల్, రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా.. మూడో స్థానంలో సాయి సుదర్శన్ బరిలోకి దిగనున్నాడు. ఆ తర్వాత గిల్, పంత్ బ్యాటింగ్ కు రానున్నారు. నితీశ్ కుమార్ రెడ్డి పేస్ ఆల్ రౌండర్ గా ఆడనుండగా.. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. పేసర్లుగా మహ్మద్ సిరాజ్ , ప్రసిద్ధ్ కృష్ణ ఆడనున్నారు.
గత రెండు నెలలుగా టీ20 ఫార్మాట్ కు అలవాటు పడిన భారత క్రికెటర్లు రెడ్ బాల్ ఫార్మాట్ లో ఎలా రాణిస్తారనేది చూడాలి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఈ మ్యాచ్ భాగం కాకపోయినా సరే ఆప్ఘనిస్థాన్ ను చిత్తుగా ఓడించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది.
మరోవైపు ఆప్ఘనిస్థాన్ ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఉపఖండపు పిచ్ లపై బాగా అలవాటు పడిన ఆప్ఘన్ క్రికెటర్లు భారత్ కు గట్టిపోటీనివ్వాలని పట్టుదలగా ఉన్నారు. హష్మతుల్లా షాహిదీ సారథ్యంలోని ఆప్ఘనిస్థాన్ జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లే ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న క్రికెటర్లనే ఈ సిరీస్ కోసం ఎంపిక చేశారు.
భారత్, ఆప్ఘనిస్థాన్(IND vs AFG) 2018లో బెంగళూరు వేదికగా టెస్ట్ మ్యాచ్ లో తలపడ్డాయి. అప్పుడు టీమిండియా ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. కేవలం రెండురోజుల్లోనే మ్యాచ్ ను ముగించింది. అయితే ఈసారి టీమిండియాకు గట్టిపోటీనివ్వాలని ఆప్ఘనిస్థాన్ ఎదురుచూస్తోంది.
Visakhapatnam Port : విశాఖపట్నం పోర్టుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం..వంద శాతం గ్రీన్ పవర్‌తో రికార్డ్
