Kohli
ఐపీఎల్ 19వ సీజన్ లో అంపైరింగ్ పై విమర్శల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలు నిర్ణయాలు వివాదాస్పదమవగా… తాజాగా గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌లో ఓ క్యాచ్ విషయంలో అంపైర్ నిర్ణయం తీవ్ర దుమారాన్ని రేపింది. కోహ్లీ(Kohli) అయితే అంపైర్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ డగౌట్ దగ్గర వాగ్వాదానికి దిగాడు.
దీంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఓపెనర్లు కోహ్లీ, బెథెల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రజత్ పటిదార్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే బంతిని అనుకున్నట్లుగా కనెక్ట్ చేయలేకపోయాడు. చాలా ఎత్తులేచిన బంతి.. బౌండరీ లైన్ వద్దకు వెళ్లింది.
సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న జేసన్ హోల్డర్.. డైవ్ చేస్తూ అద్భుతంగా బంతిని అందుకున్నాడు. అయితే క్యాచ్ పట్టిన తర్వాత అతడి చేతిలోని బంతి.. గ్రౌండ్‌ను తాకినట్టు వీడియోలో కనిపించింది. కానీ అంపైర్ మాత్రం రిప్లేను పరిశీలించకుండా ఔట్ అని ప్రకటించాడు. దీనిపై వివాదం చెలరేగింది. థర్డ్ అంపైర్ ఎందుకు జోక్యం చేసుకోలేదంటూ స్టేడియంలోని పలువురు ఫ్యాన్స్ నినాదాలు చేయడం కనిపించింది. వాస్తవానికి రీ ప్లేల్లో హోల్డర్ క్యాచ్ పట్టిన సమయంలో బంతి నేలను తాకినట్టు కనిపించింది. దీనిని ఫీల్డ్ అంపైర్లు టీవీ అంపైర్ కు నివేదించకపోవడమే ఇక్కడ వివాదానికి కారణమైంది.
అప్పటికే ఔట్ అయి డగౌట్‌లో కూర్చున్న విరాట్ కోహ్లీ(Kohli).. అంపైర్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. బంతిని అందుకున్న తర్వాత తనను తాను కంట్రోల్ చేసుకోకముందే హోల్డర్.. దాన్ని గ్రౌండ్‌కు తగిలించాడని వాదించాడు. దీంతో మైదానంలో కాసేపు గందరగోళం నెలకొంది.
ఆ తర్వాత రీప్లేలు చూడగా.. హోల్డర్ చేతిలో ఉండగానే.. బంతి గ్రౌండ్‌ను తాకినట్లు కనిపించింది. దీనిపై కోహ్లీ చాలా సేపు అంపైర్‌తో మాట్లాడాడు. కానీ అప్పటికే ఫీల్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించడంతో.. రజత్ బౌండరీ లైన్ దాటాల్సి వచ్చింది. కాగా అంపైర్ నిర్ణయంపై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడం రూల్స్ ను అతిక్రమించినట్టే. దీనిపై చర్యలు తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది.
ప్రతి వాదనకూ నిషేధం విధించరు. తీవ్రతను బట్టి శిక్ష నిర్ణయిస్తారు. సాధారణంగా ఇలాంటి ఘటనలకు మ్యాచ్ ఫీజులో 25 నుంచి 50 శాతం వరకు జరిమానా, ఓ డీమెరిట్ పాయింట్ కేటాయిస్తారు.
Gujarat Titans : గుజరాత్ ఆల్ రౌండ్ షో..ఆర్సీబీపై రివెంజ్ విక్టరీ
