Bhogapuram Airport
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కలలకు ఎట్టకేలకు రెక్కలు తొడిగే సమయం దగ్గరకు వచ్చేసింది. విశాఖపట్నం తీరంలో కొంగొత్త ప్రగతి శకం ఆరంభం కాబోతోంది. ప్రపంచ దృష్టిని ఆకట్టుకునేలాంటి అద్భుత నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న భోగాపురం మెగా గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్.. ఆగస్టు 1న భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అత్యంత వైభవంగా జాతికి అంకితం కాబోతోంది.
అయితే భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్(Alluri Sitarama Raju International Airport) సిద్ధం కావడమే కాకుండా..ఏపీ పారిశ్రామిక రంగాన్ని, రహదారుల వ్యవస్థను మలుపు తిప్పే రూ.17,883 కోట్ల విలువైన భారీ ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇదే వేదికపై నుంచి జరగబోతున్నాయి. దీంతో ఈ ఒక్క చారిత్రాత్మక ఘట్టం ఉత్తరాంధ్ర రూపురేఖలనే మార్చేయబోతోందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ సందర్బంగా సరికొత్త సెమీకండక్టర్ విప్లవానికి కూడా విశాఖపట్నం వేదిక కాబోతోంది. దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్ (APACT) కంపెనీ పార్ట్‌నర్‌షిప్‌తో ఏఎస్ఐపీ టెక్నాలజీస్ కంపెనీ భీమిలి పరిధిలోని తర్లువాడలో ఏర్పాటు చేయబోతున్న సెమీకండక్టర్ ప్యాకేజింగ్, రూ.468 కోట్లతో టెస్టింగ్ యూనిట్ ఫస్ట్ స్టేజ్ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
వీటితో పాటు రూ.5,550 కోట్లతో చేపట్టనున్న కర్నూలు-4 ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ ప్రాజెక్టుకు, రూ.16 కోట్లతో పెంచలకోన-ఏర్పేడు మధ్య కట్టబోతున్న బ్రిడ్జికి శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు.
మరోవైపు సుమారు 2,203 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో, జీఎంఆర్ కంపెనీ సుమారు రూ.4,750 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ ఎయిర్‌పోర్ట్‌కు మన్యం వీరుడు ..అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.
కాగా బంగాళాఖాతంలో ఈదే ఫ్లయింగ్ ఫిష్ అంటే ఎగిరే చేప ఆకృతిలో తీర్చిదిద్దిన ఈ టెర్మినల్ భవనం ఇంటర్నేషనల్ స్థాయిలో మెరిసిపోతోంది. బోయింగ్, ఎయిర్‌బస్ వంటి బారీ ఫ్లైట్స్ ఎంతో ఈజీగా ల్యాండ్ అవ్వడానికి అనువుగా 3,800 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో కేట్ ఐ-1 రన్‌వేను నిర్మించారు.
ఫస్ట్ స్టేజ్‌లో ఏటా 60 లక్షల మందికి సర్వీసులు అందించేలా, థర్డ్ స్టేజ్ నాటికి ఆ సంఖ్యను ఏకంగా 1.8 కోట్లకు విస్తరించేలా మాస్టర్ ప్లాన్‌ను రెడీ చేశారు. కార్గో ట్రాన్స్‌పోర్ట్ కోసం 25 వేల టన్నుల సామర్థ్యంతో స్పెషల్ టెర్మినల్ కూడా రూపుదిద్దుకుంది.
మరోవైపు ఈ మహత్తర కార్యక్రమానికి సుమారు 3 లక్షల మంది తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మహా సభ పర్యవేక్షణ బాధ్యతలను మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని 13 కీలక కమిటీలకు అప్పగించారు. అలాగే రాష్ట్ర సంస్కృతిని, గిరిజన సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా 13,500 మంది గిరిజన మహిళలు, విద్యార్థినులతో ఒకేసారి ధింసా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఇక ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయాణించడానికి వీలుగా ఒక ప్రత్యేక ఓపెన్ టాప్ రథాన్ని కూడా సిద్ధం చేశారు. అలాగే 7,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.
కాగా ప్రస్తుతం పనిచేస్తున్న పాత విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ (ఐఎన్‌ఎస్ డేగా) నుంచి ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్స్ రాకపోకలను పూర్తిగా నిలిపివేయబోతున్నారు. అలాగే ఎయిర్‌పోర్ట్ కోడ్ ‘VTZ’ ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి భోగాపురానికి(Bhogapuram Airport )ట్రాన్స్‌ఫర్ అవుతుంది.
భోగాపురం(Bhogapuram Airport)నుంచి ఫస్ట్ విమాన సర్వీస్ ఆగస్టు 16న సింగపూర్ నుంచి వచ్చి, తిరిగి 17న అర్ధరాత్రి సింగపూర్‌కు బయలుదేరబోతోంది. ఇకపై పాత ఎయిర్‌పోర్టును కేవలం నాన్-షెడ్యూల్డ్, గవర్నమెంట్, ఆర్మీ, వీఐపీ విమానాల కోసం మాత్రమే ఉపయోగించనున్నారు.
Voter List : 45 లక్షల ఓట్ల తొలగింపు .. మీ ఓటు హక్కును తిరిగి పొందాలంటే ఇలా చేయండి..
