Kolkata Knight Riders
ఐపీఎల్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) పై అంచనాలు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే ఆ జట్టులో స్టార్ ప్లేయర్స్ కు కొదవ లేదు. లీగ్ మొదలైన ఐదో ఏడాది తొలి టైటిల్ ను ముద్దాడిన కేకేఆర్ ఆ తర్వాత 2014లో మరోసారి ఛాంపియన్ గా నిలిచింది. అయితే రెండోసారి టైటిల్ గెలిచినప్పటి నుంచీ కోల్ కత్తా ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది.
ముచ్చటగా మూడోసారి ట్రోఫీ గెలిచేందుకు ఏకంగా పదేళ్లు పట్టేసింది. పైగా ఆరేళ్లలో నలుగురు కెప్టెన్లు మారారు. జట్టును బాగా నడిపిస్తున్న శ్రేయాస్ అయ్యర్ వంటి వారిని వదిలేసుకోవడం కూడా కేకేఆర్(Kolkata Knight Riders) అవకాశాలను మధ్యలో దెబ్బతీసింది. ప్రస్తుతం గత సీజన్ నుంచీ అజంక్య రహానే కోల్ కత్తాకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. 2025 సీజన్ లో నైట్ రైడర్స్ అట్టర్ ఫ్లాప్ అయింది.
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాతో బరిలోకి దిగి కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేకపోయింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితమవడంతో వేలానికి ముందు భారీ ప్రక్షాళణకు శ్రీకారం చుట్టింది. చాలా మంది ప్లేయర్స్ ను వదిలేసుకుని అందరికంటే ఎక్కువ మనీ పర్స్ (రూ.64.30 కోట్లు) తో వేలంలోకి వెళ్లింది. మినీ వేలంలో కామెరూన్ గ్రీన్ కోసం ఏకంగా రూ.25.20 కోట్లు వెచ్చించింది.
మిగిలిన బడ్జెట్ లో మంచి ప్లేయర్స్ నే తీసుకుంది. డెత్ బౌలింగ్ సమస్యను అధిగమించేందుకు మహేశ్ పతిరణను రూ.18 కోట్లకు తీసుకుంది. అయితే పతిరణ గాయంతో బాధపడుతుండడంతో ఇప్పుడు కేకేఆర్ కు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. మరోవైపు న్యూజిలాండ్ డాషింగ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సిఫెర్ట్ లను మంచి ధరకే దక్కించుకోవడం కూడా కోల్ కత్తాకు కలిసొచ్చింది.
వీరిద్దరి ఎంట్రీతో ఖచ్చితంగా కేకేఆర్ బ్యాటింగ్ బలం మరింత పెరిగిందని చెప్పొచ్చు. ఇటీవల వరల్డ్ కప్ లో వీరిద్దరూ మంచి ఆరంభాలను అందించారు. ఇక వేలంలో పలువురు యువ ఆటగాళ్లను భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకోవడం కూడా కేకేఆర్ కు ప్లస్ పాయింట్.
ప్రస్తుత సీజన్ లో కోల్ కత్తా బలాలను చూస్తే ఆల్ రౌండర్లు కామెరూన్ గ్రీన్, సునీల్ నరైన్, రమణ్ దీప్ సింగ్ లు కీలకమని చెప్పొచ్చు. అదే సమయంలో కొన్ని బలహీనతలున్నాయి. బౌలింగ్ లో పతిరణ , హర్షిత్ రాణా లేకపోవడం పెద్ద ఎదురుదెబ్బ. దీంతో స్వదేశీ పేసర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కేకేఆర్ కు ప్రధాన బలమయ్యే అవకాశముంది.
అన్నింటికీ మించి రహానే కెప్టెన్సీకి ఈ సీజన్ పెద్ద పరీక్ష. గత సీజన్ లో రహానే సారథిగా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. అతని కెప్టెన్సీలో నైట్ రైడర్స్ 14 మ్యాచ్ లలో కేవలం ఐదే గెలిచింది. ప్రస్తుతం కోల్ కత్తాకు(Kolkata Knight Riders) వేరే ఛాయిస్ లేక అతన్నే కొనసాగిస్తుందన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ అభిషేక్ నాయర్, అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ ఆధ్వర్యంలో రహానే కేకేఆర్ ను ఎంతవరకూ విజయవంతంగా నడిపిస్తాడనేది చూడాలి.
