Punjab Kings : దంచికొట్టిన పంజాబ్ కింగ్స్..చిత్తుగా ఓడిన లక్నో

Punjab Kings : పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆ జట్టు బ్యాటర్లు విధ్వంసం సృష్టించిన వేళ ముల్లాన్ పూర్ లో సిక్సర్ల వర్షం కురిసింది

Punjab Kings

పంజాబ్ కింగ్స్(Punjab Kings) జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆ జట్టు బ్యాటర్లు విధ్వంసం సృష్టించిన వేళ ముల్లాన్ పూర్ లో సిక్సర్ల వర్షం కురిసింది. ఏకంగా 21 సిక్సర్లు బాదేసిన పంజాబ్ 254 పరుగుల భారీస్కోరుతో మ్యాచ్ ను వన్ సైడ్ గా మార్చేసింది. పంజాబ్ బౌలర్లు సైతం ఆకట్టుకోవడంతో లక్నో 200 పరుగులే చేయగలిగింది.

ఫలితంగా ఈ సీజన్ లో ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కన్నోలీ విధ్వంసం అభిమానులకు టీ20 మజాను అందించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోవడం పంజాబ్ కు బాగా కలిసొచ్చింది. ప్రభ్ సిమ్రన్ సింగ్ డకౌటైనా, మరో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య , కూపర్ కన్నోలీ రెచ్చిపోయారు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు.

లక్నో బౌలర్లను ఉతికారేశారు. బంతి ఎలా వేసినా సిక్సర్లు బాదేశారు. వీరిద్దరూ పోటాపోటీగా సిక్సర్లు, బౌండరీలు బాదుతుంటే లక్నో బౌలర్లు కూడా ప్రేక్షకుల్లా మిగిలారు. మార్కరమ్ వేసిన ఓ ఓవర్లో అయితే ఏకంగా 32 పరుగులు బాదింది. దీనిలో ఐదు సిక్సర్లున్నాయి. కేవలం సిక్సర్లు కొట్టడమే లక్ష్యంగా గ్రౌండ్ లోకి వచ్చినట్టు కనిపించింది.

ప్రియాన్ష్ ఆర్య కేవలం 37 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 93 రన్స్ చేశాడు. మరోవైపు కూపర్ కన్నోలీ కూడా రెచ్చిపోయాడు. ముల్లాన్ పూర్ లో సిక్సర్ల ఉప్పెన సృష్టించాడు. కేవలం 46 బంతుల్లో 87 రన్స్ చేసాడు. కూపర్ కన్నోలీ ఇన్నింగ్స్ లో 7 సిక్సర్లున్నాయి. చివర్లో పంజాబ్ కింగ్స్ వరుస వికెట్లు కోల్పోయినా వచ్చిన బ్యాటర్లు వచ్చినట్టే సిక్సర్లు, బౌండరీలు బాదేసి ఔటయ్యారు. ఫలితంగా పంజాబ్ కింగ్స్(Punjab Kings) 20 ఓవర్లలో 254 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 2, సిద్దార్థ్ 2 వికెట్లు తీయగా.. మిగిలిన వారంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

Punjab Kings

ఛేజింగ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు మిఛెల్ మార్ష్ , ఆయుశ్ బదోనీ దూకుడుగా ఆడారు. తొలి వికెట్ కు 6 ఓవర్లలో 61 పరుగులు జోడించింది. బదోనీ 35, మార్ష్ 40 పరుగులకు ఔటవగా.. తర్వాత పంత్, మార్క్ రమ్ ఇన్నింగ్స్ కొనసాగించారు. పూరన్ నిరాశపరిచినా పంత్, మార్కరమ్ ధాటిగా ఆడారు.

అయినా కూడా లక్నో ఏ దశలోనూ విజయం వైపు సాగలేదు. పంత్ 23 బంతుల్లో 43 (4 సిక్సర్లు, 1 ఫోర్ ) పరుగులు చేసాడు. భారీ షాట్లు ఆడే క్రమంలో కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత బ్యాటర్లలో మార్కరమ్ తప్పిస్తే మిగిలిన వారంతా ఫెయిలయ్యారు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులే చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో మార్కో జన్సెన్ 2 వికెట్లు తీసాడు. కాగా ఈ విజయంతో పంజాబ్ కింగ్స్(Punjab Kings) పాయింట్ల పట్టికలో తన టాప్ ప్లేస్ ను మరింత పటిష్టం చేసుకుంది.

KKR : కోల్ కతా గెలిచిందోచ్..రింకూ అద్భుత పోరాటం

Exit mobile version