Questioning Nature : కోడింగ్ ఒక్కటే వస్తే సరిపోదా? .. ఆలోచించే విధానం మారకపోతే కష్టమేనా?

Questioning Nature : గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఇప్పుడు కోడర్లతో పాటు మంచి థింకర్స్‌ను, ఫిలాసఫర్లను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి.

Questioning Nature

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మన జీవితాల్లోకి వేగంగా దూసుకొస్తున్న ఈ రోజుల్లో, మనుషులు కేవలం కోడింగ్ చేయడం మాత్రమే కాకుండా.. సరిగ్గా ఆలోచించాలి. అంతేకాదు మంచి-చెడుల మధ్య సరైన తేడాను గుర్తుపట్టడం, అన్నింటికంటే ముఖ్యంగా సరైన ప్రశ్నలు అడగడం నేర్చుకోవడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు.

మన సొసైటీలో టెక్నాలజీని, కోట్లు సంపాదించే వ్యాపారవేత్తలను మాత్రమే పొగుడుతూ ఉంటాం. ఆర్ట్స్, సోషియాలజీ, ఫిలాసఫీ వంటి సబ్జెక్టులు చదివేవారిని, వాటి గురించి ఆలోచించేవారిని కాస్త తక్కువ చేసి చూస్తుంటాం.

కొత్త కొత్త సాఫ్ట్‌వేర్లు, ఆవిష్కరణలు మాత్రమే వరల్డ్‌ను మారుస్తాయని, ధర్నాలు, నిరసనలు, ప్రశ్నించే తత్వం(Questioning Nature) ఇలా అన్నీ కూడా టైమ్ వేస్ట్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, కేవలం కంపెనీలు , కొత్త టెక్నాలజీ మాత్రమే సొసైటీని ముందుకు తీసుకెళ్లవు. మనుషుల మనసులో పుట్టే కొత్త ఆలోచనలు, వారు అడిగే ప్రశ్నలే మన జీవితాలను మార్చే అసలైన పునాదులు అని తెలుసుకోవాలని నిపుణులు అంటున్నారు.

అంతెందుకు ఇటీవల ఢిల్లీలో స్టూడెంట్స్ చేసిన ఆందోళనలను చూసి కొంతమంది..ఒకవైపు వీళ్లేమో రోడ్లెక్కి నిరసనలు చేస్తున్నారు, మరోవైపు ప్రాక్టికల్ గా ఆలోచించేవాళ్లేమో రాకెట్లు ప్రయోగిస్తున్నారని, రోదసిలోకి వెళ్తున్నారని, కొత్త టెక్నాలజీతో ప్రపంచాన్ని ఏలుతున్నారని రకరకాలుగా కామెంట్స్ చేశారు.

కానీ, సొసైటీని కేవలం కొత్త మిషన్లు తయారు చేసేవాళ్లే మార్చారు..వారే మార్చాలి అనుకోవడం పెద్ద పొరపాటు. ఒక విషయాన్ని ప్రశ్నించడమంటే కేవలం ప్రభుత్వానికి ఎదురు తిరగడం మాత్రమే కాదు. అది ఒక కొత్త ఆలోచనకు పునాది. ఏది న్యాయం? సొసైటీలో ఎవరికి ఎలాంటి హక్కులు ఉండాలి? ఏది మారాలి? అని అడిగే ప్రశ్నలే సొసైటీకి అసలైన దిశను చూపిస్తాయి.

అరవై, డెబ్బైల కాలంలో అమెరికాలో స్టూడెంట్స్ చేసిన ఉద్యమాలు, ధర్నాలు మనుషుల ఫ్రీడమ్, సమానత్వం, హక్కుల పట్ల సొసైటీ చూసే కోణాన్నే మార్చేశాయి. ఆ తర్వాత వచ్చిన ఇంటర్నెట్ విప్లవం కూడా ఈ స్వేచ్ఛా ఆలోచనల నుంచే పుట్టుకొచ్చింది. ఈ రోజు మనం చూస్తున్న ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్, సోషల్ మీడియా క్రియేటర్ ఎకానమీ వంటివన్నీ ఆ రోజుల్లో పుట్టిన ఆలోచనల తాలూకా ఫలితాలే.

అంతేకాదు, భారత దేశంలో ఒకప్పుడు కుల వివక్షకు, జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు కనుక జరగకపోయి ఉంటే.. ఈరోజు కోట్లాది మందికి చదువుకునే ఛాన్స్ గానీ, జాబ్స్ చేసే హక్కు గానీ దక్కేవి కావు. ఆనాటి పోరాటాల వల్ల వారందరికీ సొసైటీలో గుర్తింపు రావడమే కాదు.. ఈరోజు ఆర్థిక వ్యవస్థలో కూడా వారు ఒక పెద్ద భాగంగా మారారు.

సొసైటీలో ఒక ఆలోచన తెచ్చే మార్పు.. ఒక్క రోజులోనే బయటకు కనిపించదు. అది చాలా మెల్లగా మన అలవాట్లలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాతే కంపెనీలు, చట్టాలు ఆ మార్పుకు తగ్గట్టుగా మారతాయి. ఈరోజు ఆఫీసుల్లో మనం వింటున్న వర్క్-లైఫ్ బ్యాలెన్స్, వీకెండ్ హాలీడేస్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (CSR) వంటి మంచి మంచి విషయాలన్నీ దశాబ్దాల క్రితం మన పాత తరాలు చేసిన పోరాటాలు, ఆలోచనల నుంచే వచ్చాయి.

ఇప్పటి విద్యా విధానంలో కేవలం జాబ్స్ చేయడం, డబ్బులు సంపాదించడం మాత్రమే జీవితం అన్నట్లుగా నేర్పుతున్నారు. దానివల్ల తెలివైన ఎంప్లాయిస్ తయారవుతున్నారు కానీ, ఎదుటివారి బాధను అర్థం చేసుకునే దయ, మానవత్వం మాత్రం తగ్గిపోతున్నాయి.

Questioning Nature

అయితే ఇప్పుడు పరిస్థితులు మళ్లీ మారుతున్నాయి. ఏఐ (AI) రాకతో పెద్ద పెద్ద టెక్ కంపెనీలకు కొత్త ప్రాబ్లెమ్స్ మొదలయ్యాయి. ఒక ఏఐ సిస్టమ్ ఎలా ఆలోచించాలనే విషయాలతో పాటు సరిగ్గా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనప్పుడు అది మోరల్‌గా ఎలా స్పందించాలనే విషయాలను తెలుసుకోవడానికి గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఇప్పుడు కోడర్లతో పాటు మంచి థింకర్స్‌ను, ఫిలాసఫర్లను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి.

చివరకు ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ గోల్డ్‌మన్ శాక్స్ అధినేత కూడా ఇంజనీర్లు ఫిలాసఫీ చదవాలి, అప్పుడే వారు ఇంకా మంచి ప్రోగ్రామర్లు కాగలరని చెప్పారు.

నిజానికి ఈ ప్రపంచం ముందడుగు వేయాలంటే కేవలం బిజినెస్, కోడింగ్ చేసేవాళ్లు ఉంటే సరిపోదు. అలా అని కేవలం కూర్చుని ఆలోచించేవాళ్లే ఉన్నా కూడా కుదరదు. ఈ ఇద్దరూ ఒకరికొకరు తోడుగా ఉండాలి.

ఎందుకంటే వ్యాపారవేత్తలు కొత్త సిస్టమ్స్‌ను, రోడ్లను, కంపెనీలను నిర్మిస్తే.. ఆలోచనాపరులు వాటికోసం ఒక మంచి లక్ష్యాన్ని, దారిని చూపిస్తారు.అంటే వీరిలో ఒకరు మనం ఈ పని చేయగలమా అని అడిగితే.. మరొకరు మనం ఈ పని చేయడం అసలు కరెక్టేనా అని ప్రశ్నిస్తారు. అందుకే ఈ రెండూ కలిస్తేనే ఏ సొసైటీ అయినా కరెక్ట్ మార్గంలో ముందుకు వెళ్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర కలల ఎయిర్‌పోర్ట్ రెడీ .. బాబు, పవన్, లోకేష్ భావోద్వేగ కామెంట్స్..

Exit mobile version