Rahane : టీమిండియాలో సీనియర్లకు గౌరవం లేదు.. గౌతమ్ గంభీర్‌కు గట్టిగానే ఇచ్చిపడేసిన రహానే

Rahane : ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే సంచలన వ్యాఖ్యలు చేశాడు. సెలక్టర్లు, హెడ్ కోచ్ గంభీర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసాడు.

Rahane

భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సీనియర్లు ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. వారి పట్ల గంభీర్ వ్యవహారశైలే దీనికి కారణమని చాలా మంది అభిప్రాయం. కోహ్లీ, అశ్విన్, రోహిత్ , పుజారా వంటి కీలక ఆటగాళ్లందరూ గుడ్ బై చెప్పేశారు.

గంభీర్ వచ్చిన తర్వాత సీనియర్లకు గౌరవం లేదని ఇప్పటికే కొంతమంది వ్యాఖ్యానించారు. అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటన తర్వాత ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు. కోహ్లీ, రోహిత్ ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతుండడంతో దీనిపై ఇప్పటి వరకూ మాట్లాడలేదు.

అయితే ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే(Rahane) సంచలన వ్యాఖ్యలు చేశాడు. సెలక్టర్లు, హెడ్ కోచ్ గంభీర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసాడు. లంక టూర్‌కు ముందు సీనియర్లను పక్కన పెట్టడంపై అసహనం వ్యక్తం చేశాడు. భారత క్రికెట్‌లో సీనియర్ ప్లేయర్స్‌ను గౌరవించాలని సూచించాడు.

ఏ జట్టులోనైనా సీనియర్ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నాడు. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్ లో గెలిపించేది సీనియర్ల అనుభవమేనని, యువ ఆటగాళ్లు కాదన్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వంటి కఠినమైన పిచ్‌లపై అనుభవజ్ఞులైన ఆటగాళ్ల అవసరం ఎంతైనా ఉంటుందని రహానే అభిప్రాయపడ్డాడు.

ఈ సందర్భంగా సెలక్టర్ల తీరుపైనా రహానే(Rahane) కీలక వ్యాఖ్యలు చేశాడు. సమాచార లోపంపై విమర్శలు గుప్పించాడు. భారత్ తరఫున ఎంతో క్రికెట్ ఆడిన తనలాంటి సీనియర్ ప్లేయర్‌ను జట్టు నుంచి తప్పించేటప్పుడు సెలెక్టర్లు కనీసం సమాచారం ఇవ్వకపోవడం బాధ కలిగించిందన్నాడు.

దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న సీనియర్ ఆటగాళ్లను వయసుతో సంబంధం లేకుండా జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోవాలని సూచించాడు. రోహిత్ , కోహ్లీ, పుజారా వంటి ప్లేయర్స్ టెస్టుల్లో తమ అనుభవంతో మ్యాచ్‌లు గెలిపించిన సందర్భాలను గుర్తు చేశాడు. అలాగని యువ ఆటగాళ్ల పాత్రను తాను తక్కువ చేసి చూపడం లేదనీ, టెస్టుల్లో మాత్రం కనీసం ఏడుగురు సీనియర్లు, నలుగురు యువ ఆటగాళ్ల కూర్పుతో బరిలోకి దిగాలన్నాడు.

Rahane

పూర్తిగా యువ ఆటగాళ్లతో జట్టును నింపేస్తే ఫలితాలు తారుమారవుతాయంటూ గతేడాది వైట్ వాష్ పరాభవాలను పరోక్షంగా గుర్తు చేశాడు. ఏడాది కాలంగా టీమిండియాకు సీనియర్లు దూరమవడం ఆందోళన కలిగిస్తుందన్నాడు. సీనియర్ ప్లేయర్స్ అందరూ దాదాపు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడం ఏ జట్టుకూ మంచిది కాదన్నాడు. ఇక ఇటీవల కాలంలో క్రికెట్ ఆడి రిటైర్ అయినా మాజీలే సెలక్టర్లుగా ఉండాలని రహానే అభిప్రాయపడ్డాడు.

Vijay Govt : జెన్ జీ, విద్యార్థులకే ప్రాధాన్యత ..విజయ్ ప్రభుత్వం తొలి బడ్జెట్ ఎలా ఉంది?

Exit mobile version