Shreyas Iyer
భారత క్రికెట్ జట్టులో చోటు దక్కడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. తీవ్రమైన పోటీ ఉండే టీమిండియాలో ఎప్పటికప్పుడు ప్రతీ ప్లేయర్ తన సత్తా నిరూపించుకోవాల్సిందే. లేకుంటే జట్టు నుంచి ఔటే. కానీ జట్టులో చోటు కోల్పోయిన తర్వాత నిరాశ పడకుండా పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే మాటను సీరియస్ తీసుకుంటే మాత్రం కమ్ బ్యాక్ ఇవ్వొచ్చు.
ప్రస్తుతం దీనికి అద్భుతమైన ఉదాహరణ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer). ఒకప్పుడు టీ20 జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న అతడు.. క్రమశిక్షణా సమస్యల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. సరిగ్గా మూడేళ్ల క్రితం టీ20 ఆడిన శ్రేయాస్ తర్వాత ప్లేస్ మాత్రమే కాదు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కోల్పోయాడు.
దాదాపు రెండేళ్ల పాటు జట్టులో చోటు కూడా లేదు. దీంతో శ్రేయాస్ కెరీర్ ముగిసిందని చాలా మంది అనుకున్నారు. అయితే అతను మాత్రం అలా అనుకోలేదు. తప్పును సరిదిద్దుకున్నాడు. మళ్లీ ఫామ్ అందుకున్నాడు. తన ఆటతోనే అందరికీ సమాధానం చెప్పడమే లక్ష్యంగా సత్తా చాటాడు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్లో రాణించాడు.
అటు ఐపీఎల్ లో సైతం దుమ్మురేపాడు. మూడేళ్ల క్రితం అసలు సెలక్టర్ల దృష్టిలోనే లేని ఆటగాడు ఇప్పుడు ఏకంగా టీ20 జట్టుకు కెప్టెన్ అయ్యాడంటే అతని కమ్ బ్యాక్ ఎంత ప్రత్యేకమైనదో అర్థమవుతోంది.
నిజం చెప్పాలంటే శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer పడిలేచిన కెరటంలా తిరిగి జట్టులోకి అది కూడా కెప్టెన్ గా ఎంపికవడానికి ప్రధాన కారణం ఐపీఎల్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఆడిన ప్రతీ సీజన్ లోనూ 100కు 100 శాతం ప్రదర్శన ఇచ్చాడు. కెప్టెన్ గా కోల్ కతా నైట్ రైడర్స్ కు ఐపీఎల్ టైటిల్ అందించాడు.
గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ ను రన్నరప్ గా నిలిపాడు. ఈ సీజన్ లో వ్యక్తిగతంగానూ తన సూపర్ ఫామ్ కొనసాగించాడు. 2026 సీజన్‌లో 498 పరుగులు సాధించి నిలకడైన ప్రదర్శన కనబరిచాడు. ఒత్తిడిని తట్టుకుని ఆడిన ఇన్నింగ్స్‌లు, కెప్టెన్‌గా జట్లను నడిపించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. దీంతో టీ20 జట్టు సెలక్షన్ జరిగిన ప్రతీసారీ శ్రేయాస్ అయ్యర్ పేరు వినిపిస్తూనే ఉంది.
గత టీ20 ప్రపంచకప్ సమయంలో కూడా శ్రేయాస్ కు చోటు దక్కుతుందని చాలా మంది భావించినా అది జరగలేదు. ఈసారి ఐపీఎల్ సీజన్ ముగియడంతోనే శ్రేయాస్ అయ్యర్ పై సెలక్షన్ కమిటీలో పెద్ద చర్చే జరిగింది. సూర్యకుమార్ పేలవ ఫామ్ తో కొత్త కెప్టెన్ ను నియమించాల్సిందేనన్న ఆలోచనను సెలక్షన్ కమిటీ ఆచరణలో పెట్టింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ టీ20 ప్రణాళికలను దృష్టిలో పెట్టుకున్న సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
గత కొన్నేళ్లుగా నిలకడైన ప్రదర్శనతో పాటు నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్న శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)కు టీ20 జట్టు పగ్గాలు అప్పగిస్తూ కొత్త శకానికి శ్రీకారం చుట్టింది. గత కొన్నేళ్లుగా శ్రేయాస్ వివిధ ఫ్రాంచైజీలను సక్సెస్ ఫుల్ గా నడిపించాడనీ, కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాడని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ చెప్పాడు. ఇక సారథిగా అంతర్జాతీయ స్థాయిలో టీమిండియాను సర్పంచ్ సాబ్ ఎలా నడిపిస్తాడనేది చూడాలి.
Rashi Phalalu : ఈరోజు ఏ రాశి వారికి అదృష్టం పట్టబోతోంది? 12 రాశుల పూర్తి జాతకం ఇక్కడే..
