Vaibhav Suryavanshi
ఐపీఎల్ 2026 సీజన్‌లో ..రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనంగా క్రేజ్ సంపాదించుకున్న వైభవ్ సూర్యవంశీ.. సాగించిన పరుగుల విధ్వంసానికి ఇప్పుడు టెంపరరీగా బ్రేక్ పడింది. క్వాలిఫయర్-2 పోరులో గుజరాత్ టైటాన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడంతో..ఆ జట్టు ఫైనల్‌కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
అయితే చిన్నా లేదు పెద్దా లేదు అంతా కూడా ..ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో వైభవ్(Vaibhav Suryavanshi )ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌లకు క్రికెట్ ఫ్యాన్స్ పూర్తిగా ఫిదా అయిపోయారు. దీంతో ఈ కుర్రోడిని వీలైనంత త్వరగా భారత జాతీయ జట్టులోకి సెలక్ట్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.
అభిమానుల అంచనాలకు తగ్గట్టే బీసీసీఐ కూడా వైభవ్ విషయంలో ఇప్పటికే ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వచ్చే నెల జూన్‌లో శ్రీలంక వేదికగా జరగబోయే ముక్కోణపు వన్డే సిరీస్ కోసం భారత్-ఏ జట్టుకు వైభవ్ సూర్యవంశీని(Vaibhav Suryavanshi) సెలక్ట్ చేసింది. ఈ శ్రీలంక పర్యటనలో కనుక వైభవ్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తే..అతి త్వరలోనే అతడు టీమ్ ఇండియా సీనియర్ జట్టులో కూడా అడుగుపెట్టేస్తాడు.
ఈ వన్డే ట్రై సిరీస్‌లో భారత్-ఏ జట్టుతో పాటు ఆతిథ్య శ్రీలంక-ఏ తో మరియు అఫ్గనిస్థాన్-ఏ జట్లు తలపడనున్నాయి. టోర్నీ షెడ్యూల్ ప్రకారం ప్రతి జట్టూ మిగిలిన జట్లతో రెండేసి మ్యాచ్‌ల చొప్పున ఆడుతుంది. ఆ తర్వాత పాయింట్ల పట్టికలో ఫస్ట్ రెండు స్థానాల్లో నిలిచిన జట్లు జూన్ 21న జరిగే ఫైనల్ పోరులో తలపడతాయి.
ఈ ముక్కోణపు సిరీస్‌లో భారత్ టీమ్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 9న ఆతిథ్య శ్రీలంక జట్టుతో ఆడి తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను గమనిస్తే.. జూన్ 9న భారత్ -ఏ , శ్రీలంక -ఏ మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత జూన్ 11న ఆఫ్ఘనిస్తాన్ -ఏ జట్టుతో భారత్ ఏ తలపడుతుంది.
జూన్ 13వ తేదీన శ్రీలంక ఏ, ఆఫ్ఘనిస్తాన్ – ఏ జట్ల మధ్య మ్యాచ్ ఉంటుంది. తిరిగి జూన్ 15న భారత్ ఏ, శ్రీలంక ఏ జట్లు.. జూన్ 17న భారత్ ఏ, ఆఫ్ఘనిస్తాన్ – ఏ జట్లు పోటీపడతాయి. ఇక జూన్ 19న శ్రీలంక- ఏ, ఆఫ్ఘనిస్తాన్ – ఏ మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరగనుండగా, జూన్ 21వ తేదీన గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఈ టోర్నీలోని మ్యాచ్‌లన్నీ దంబుల్లాలోని రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగానే జరగనున్నాయి.
ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) సృష్టించిన రికార్డులు అంత సామాన్యమైనవేమీ కావు. ఈ టోర్నీలో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. 48.50 సగటుతో, ఏకంగా 237.31 స్ట్రైక్‌రేటుతో 776 పరుగులు సాధించి సీనియర్లనే షాక్ కొట్టేలా చేశాడు. అంతర్జాతీయ స్థాయి బౌలర్లను కూడా ముప్పుతిప్పలు పెట్టి పరుగుల వర్షం కురిపించాడు. పీక్ ఫామ్‌లో ఉన్న ఈ బుడ్డోడు రాబోయే శ్రీలంక పర్యటనలో కూడా పరుగుల వరద పారించి, భారత సీనియర్ జట్టు తలుపులు తట్టాలని కోరుకుందాం .
