TET
గవర్నమెంట్ స్కూల్స్‌లో పనిచేస్తున్న టీచర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉద్యోగాల కోసం ప్రయత్నించే అభ్యర్థులతో పాటు సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు కూడా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) తప్పనిసరని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో, ఇప్పటికే విధుల్లో ఉన్న టీచర్ల కోసం ప్రత్యేకంగా స్పెషల్ టెట్ పరీక్షలను నిర్వహించడానికి రేవంత్ సర్కార్ నిర్ణయించింది.
తెలంగాణలో ప్రతి సంవత్సరం 2 సార్లు జరిగే సాధారణ టెట్ పరీక్షలకు అదనంగా, కేవలం ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయల కోసం మాత్రమే మరో 2 స్పెషల్ టెట్ పరీక్షలను ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ చేపట్టనుంది. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా జీవో కూడా జారీ చేశారు.
వివిధ ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తులతో పాటు.. విద్యాశాఖ అధికారులు అందించిన రిపోర్టులను పరిశీలించిన తర్వాతే రేవంత్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటివరకు టెట్ అర్హత సాధించని టీచర్లకు ఇదొక అద్భుతమైన అవకాశంగా మారనుంది.
గతంలో 2025 సెప్టెంబరులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చూస్తే.. విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు రాబోయే రెండేళ్లలో టెట్ పాస్ కావడం తప్పనిసరి అని పేర్కొంది. అయితే ఇటీవల ఈ డెడ్‌లైన్‌ను మరో ఏడాది పొడిగించడంతో, ఉపాధ్యాయులు 2028 ఆగస్టు నాటికి ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
ఈ లోపు ఎక్కువ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ స్పెషల్ పరీక్షలను తీసుకువచ్చింది. ఈ ప్రత్యేక టెట్(TET) ఎగ్జామ్స్‌కు సంబంధించిన పూర్తి గైడ్‌లైన్స్, తేదీల వివరాలను అధికారులు త్వరలోనే అఫీషియల్‌గా వెల్లడించబోతున్నారు.
మరోవైపు, ఈ ఏడాది జనవరిలో మొదటి విడత టెట్(TET) ఎగ్జామ్స్ విజయవంతంగా ముగిశాయి. ప్రస్తుత విడత టెట్ పరీక్షలను జూన్ 15 నుంచి నిర్వహించడానికి ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ పరీక్ష కోసం తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 1.37 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా, వారిలో 28 వేల మందికి పైగా ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ సాధారణ పరీక్షలతో సంబంధం లేకుండా.. రాబోయే రోజుల్లో కేవలం టీచర్ల కోసమే స్పెషల్ టెట్ నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం వేరుగా చేపట్టనుంది.
