Theaters
తెలుగు మూవీ ఇండస్ట్రీలో ప్రస్తుతం నెలకొన్న థియేటర్ల యుద్ధం’ టాలీవుడ్‌ను మరోసారి కుదిపేస్తోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలకు తెరదించేలా.. మారుతున్న కాలానికి తెర లేపేలా రెండింటి మధ్య జరుగుతున్న ఈ పోరు ఇప్పుడు నిర్మాతలకు, థియేటర్ల యజమానులకు (ఎగ్జిబిటర్లు) మధ్య ఒక పెద్ద అగాధాన్ని సృష్టిస్తోంది.
ఒకప్పుడు సినిమా బాగున్నా బాగోకపోయినా నిర్దేశించిన అద్దె.. నిర్మాత నుంచి థియేటర్ యజమానికి అందేది. కానీ, ఇప్పుడు పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడను ప్రశ్నార్థకం చేసేస్తున్నాయి. దీంతో రెంట్ పద్ధతికి స్వస్తి పలికి, మల్టీప్లెక్స్‌ల లాగానే వసూళ్లలో వాటా (పర్సెంటేజ్ సిస్టమ్) కావాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
హైదరాబాద్‌లోని సుమారు 23 థియేటర్లు(Theaters).. ఇప్పటికే ప్రయోగాత్మకంగా పర్సెంటేజ్ విధానంలోకి మారిపోవడం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. ఇప్పుడు ఇదే సెగ హైదరాబాద్ నుంచి మెల్లగా జిల్లాల్లోని థియేటర్లకు కూడా పాకింది. జిల్లా కేంద్రాల్లోని ఎగ్జిబిటర్లు కూడా తమకు పర్సంటేజ్ కావాలని, రెంట్ విధానం వల్ల తాము ఎక్కువగా నష్టపోతున్నామని గగ్గోలు పెడుతున్నారు.
అయితే, నిర్మాతల మండలి (గిల్డ్) మాత్రం దీనికి ససేమిరా ఒప్పుకోమని చెబుతోంది. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ఆ భారం మొత్తం తమపైన పడుతుందని, ఇది ప్రొడ్యూసర్లను నిలువునా ముంచేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వివాదం కాస్తా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ గిల్డ్‌గా మారిపోవడంతో సినీ ఇండస్ట్రీని హీటెక్కిస్తోంది.
ఈ వివాదం కనుక ఇలాగే కొనసాగితే రాబోయే సమ్మర్ సీజన్ రిలీజ్‌లపై నీలి నీడలు కమ్ముకునే ప్రమాదం ఉంది. మే జూన్ నెలల్లో విడుదల కావాల్సిన భారీ బడ్జెట్ మూవీలకు సింగిల్ స్క్రీన్ థియేటర్లు చాలా అంటే చాలా కీలకం అన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోని గ్రాస్ కలెక్షన్లలో మెజారిటీ వాటా ఈ థియేటర్ల నుంచే వస్తుంది.
ఇప్పుడు చర్చలు విఫలమై ఒకవేళ థియేటర్లు (Theaters)మూతపడితే, ఆ ఎఫెక్ట్ కేవలం వసూళ్లపైనే కాకుండా, సినిమాల ప్రీ-రిలీజ్ బిజినెస్‌పైన కూడా భారీగానే ఉంటుంది. పెద్ద హీరోల సినిమాలు థియేటర్లకు రాకపోతే ఈ సమ్మర్ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద వెలవెలబోవడం ఖాయం అని సినీ క్రిటిక్స్ అంటున్నారు.
అయితే ఈ సమస్యకు త్వరగా సొల్యూషన్ దొరకకపోతే మాత్రం టాలీవుడ్ మరో రెండు నెలల పాటు ఎక్కడికక్కడ స్తంభించిపోయే అవకాశముంది. అద్దెకు మొగ్గు చూపే ప్రొడ్యూసర్లు, వాటా కోరుకునే ఎగ్జిబిటర్లు.. ఇద్దరూ కూడా తమ పట్టు వీడకపోతే నష్టపోయేది మాత్రం సామాన్య ప్రేక్షకులే. మూవీ రిజల్ట్‌తో సంబంధం లేకుండా సాగే అద్దె విధానం మేలా? లేక రిస్క్ పంచుకునే పర్సెంటేజ్ పద్ధతి మేలా? అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ హాట్‌గా సాగుతోంది.
Thali:తాళి కట్టేటప్పుడు 3 ముడులు ఎందుకు వేస్తారు? వాటి పరమార్థం ఏంటి?
