Districts: ఈరోజు నుంచి 28 జిల్లాలు అమల్లోకి.. ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో భారీ మార్పులు
Districts: ఈరోజు నుంచి రాష్ట్రంలో సరికొత్త జిల్లాల రూపురేఖలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటివరకు ఏపీలో 26 జిల్లాలు ఉండగా, ఆ సంఖ్య ఇప్పుడు 28కి పెరిగింది.
Districts
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణల దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. కొంతకాలంగా సాగుతున్న జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ముగియడంతో, ఈరోజు నుంచి రాష్ట్రంలో సరికొత్త జిల్లాల(Districts) రూపురేఖలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటివరకు ఏపీలో 26 జిల్లాలు ఉండగా, ఆ సంఖ్య ఇప్పుడు 28కి పెరిగింది.
కొత్తగా ఏర్పడిన పోలవరం ,మార్కాపురం జిల్లాలు ఈరోజు నుంచి అధికారికంగా తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ప్రజలకు పాలనను మరింత దగ్గర చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మార్పుల వల్ల కొత్త జిల్లాల్లోని(Districts) ప్రజలకు జిల్లా కేంద్రం అందుబాటులోకి రావడంతో పాటు అభివృద్ధి పనులు కూడా వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు , ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.
కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా(Districts) బాధ్యతలను ప్రస్తుతం ఉన్న అధికారులకే ఏపీ ప్రభుత్వం అదనంగా అప్పగించింది. పోలవరం జిల్లా కలెక్టర్‌గా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్‌కు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. అలాగే మార్కాపురం జిల్లా కలెక్టర్‌గా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు.
శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలవరం ఎస్పీగా అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్, మార్కాపురం ఎస్పీగా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నియమించబడ్డారు. జాయింట్ కలెక్టర్ల విషయానికి వస్తే, పోలవరం జేసీగా అల్లూరి జేసీ తిరుమణి శ్రీపూజ, మార్కాపురం జేసీగా ప్రకాశం జేసీ రోణంకి గోపాలకృష్ణ వ్యవహరిస్తారు. కొత్తగా శాశ్వత అధికారులు వచ్చే వరకు ఉమ్మడి జిల్లా అధికారులే ఈ ఇన్‌ఛార్జ్ బాధ్యతలను కొనసాగిస్తారని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికోసం ప్రత్యేక కార్యాలయాలను కూడా ప్రభుత్వం ఇప్పటికే నోటిఫై చేసింది.

మరో ముఖ్యమైన మార్పు అన్నమయ్య జిల్లా కేంద్రం విషయంలో జరిగింది. ఇప్పటివరకు రాయచోటి కేంద్రంగా పనిచేసిన అన్నమయ్య జిల్లా కార్యకలాపాలు నేటి నుంచి మదనపల్లెకు మారాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ , ఇతర ముఖ్య అధికారుల కార్యాలయాలన్నీ ఈరోజు నుంచి మదనపల్లె నుండే తమ విధులను నిర్వహిస్తున్నాయి. ఇది ఆ ప్రాంత ప్రజల సుదీర్ఘ కాలపు డిమాండ్ కావడం గమనార్హం.
అలాగే రాష్ట్రంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు కూడా ఈరోజు నుంచే అమల్లోకి వచ్చాయి. అనకాపల్లి జిల్లాలోని అడ్డరోడ్డు జంక్షన్, ప్రకాశం జిల్లాలోని అద్దంకి, అన్నమయ్య జిల్లాలోని పీలేరు, శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర మరియు నంద్యాల జిల్లాలోని బనగానపల్లె ఇప్పుడు కొత్త రెవెన్యూ డివిజన్లుగా అవతరించాయి. ఈ మార్పులతో రెవెన్యూ సంబంధిత పనుల కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
మండలాల సర్దుబాటులో కూడా ఏపీ ప్రభుత్వం చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. పోలవరం జిల్లా పరిధిలోకి రంపచోడవరం , చింతూరు డివిజన్లు వచ్చాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇకపై 11 మండలాలు, ఒకే ఒక డివిజన్ ఉంటున్నాయి. రాజంపేట డివిజన్‌ను తిరిగి కడప జిల్లాలోకి చేర్చగా, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో విలీనం చేశారు.
రాయచోటి డివిజన్ పరిధిలో ఇప్పుడు కేవలం ఆరు మండలాలు మాత్రమే ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లాలోకి మండపేట, రాయవరం , కపిలేశ్వరపురం మండలాలు వచ్చి చేరాయి. సామర్లకోట మండలం ఇకపై పెద్దాపురం డివిజన్ పరిధిలో ఉంటుంది. ఈ మార్పులన్నీ భౌగోళిక పరిస్థితులు, ప్రజల సౌకర్యం కోసం చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఈ కొత్త జిల్లాల ఏర్పాటు , సరిహద్దుల మార్పుల వల్ల పరిపాలనలో గందరగోళం కలగకుండా కూటమి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. డిసెంబర్ 31వ తేదీ నుంచి ఈ మార్పులన్నీ అమల్లోకి రావడంతో కొత్త ఏడాదిలో ఏపీ సరికొత్త పాలనా వ్యవస్థతో ముందుకు సాగబోతోంది. మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా కలెక్టర్ కార్యాలయం అందుబాటులోకి రావడం వల్ల సమస్యల పరిష్కారం త్వరగా జరుగుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది
ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ వల్ల ఉద్యోగుల సర్దుబాటు, ఫైళ్ల బదిలీ ప్రక్రియ కూడా ఇప్పటికే మొదలైంది. సామాన్య ప్రజలకు తమ విన్నపాలు చెప్పుకోవడానికి జిల్లా కేంద్రం దగ్గరవ్వడం అనేది ఒక పెద్ద ఊరటనిచ్చే అంశంగానే చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచిపోతుంది.



