Real Estate:స్తంభించిన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..అయోమయంలో కొనుగోలుదారులు..! పరిష్కారమెప్పుడు?
Real Estate: దాదాపు 5 లక్షల ఇళ్లు, ఖాళీ స్థలాల యజమానులు ఇప్పుడు తమ ఆస్తులను అమ్ముకోలేక, కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Real Estate
హైదరాబాద్ మహానగర విస్తరణకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన.. డివిజన్ల పునర్విభజన ప్రక్రియ ఇప్పుడు ఆస్తి యజమానులకు శాపంగా మారింది.
పాలనా సౌలభ్యం పేరుతో 150 డివిజన్లను 300కు పెంచినా సరే..దానికి తగ్గట్టుగా ఆస్తి రికార్డుల బదిలీ (Data Migration) పూర్తికాకపోవడంతో.. సిటీలో రియల్ ఎస్టేట్ (Real Estate) లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో సిటీ చుట్టుపక్కల విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని దాదాపు 5 లక్షల ఇళ్లు, ఖాళీ స్థలాల యజమానులు ఇప్పుడు తమ ఆస్తులను అమ్ముకోలేక, కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సాధారణంగా ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆటోమేటిక్ మ్యుటేషన్ జరగాలి. అంటే పాత యజమాని పేరు తొలగిపోయి కొత్త యజమాని పేరుపై ఆస్తి పన్ను రికార్డులు మారాలి. కానీ డివిజన్ల హద్దులు మారడంతో సాఫ్ట్‌వేర్‌లో పాత సర్కిల్ డీటెయిల్స్, కొత్త డివిజన్ వివరాలు మ్యాచ్ కావడం లేదు.
దీనివల్ల రిజిస్ట్రేషన్ పూర్తవుతున్నా, మ్యుటేషన్ పత్రాలు రావడం లేదు. మ్యుటేషన్ డాక్యుమెంట్ లేనిదే బ్యాంకులు హోమ్ లోన్లు మంజూరు చేయవు. దీనివల్ల ఇల్లు కొందామని అడ్వాన్సు ఇచ్చిన వారు.. లోన్ రాక, ఇటు అడ్వాన్సు వెనక్కి తీసుకోలేక వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
కేవలం అమ్మకాలు, కొనుగోలు కాదు, కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి ఇంటి నంబర్ల జారీ, ఆస్తి పన్ను మదింపు, నిర్మాణ అనుమతులు వంటి సర్వీసులు కూడా నిలిచిపోతున్నాయి. ఉదాహరణకు ఎల్బీనగర్ జోన్ పరిధిలోని ఒక కాలనీ ఇప్పుడు బడంగ్పేట్ డివిజన్‌కు మారింది.
రికార్డులు ఇంకా పాత సర్కిల్లోనే ఉండటంతో, ప్రజలు ఒక ఆఫీసు నుంచి మరో ఆఫీసుకి ఫుట్బాల్లా తిరగాల్సి వస్తోంది. జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీలో కూడా ఇదే గందరగోళం నెలకొంది.

ప్రస్తుతానికి ఈ సమస్యకు తక్షణ పరిష్కారం కనిపించడం లేదు. జీహెచ్ఎంసీ సాఫ్ట్వేర్ అప్డేట్ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండేలా కనిపిస్తుంది. ప్రభుత్వం దీనిపై స్పందించి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంది.
1. సమస్య ఉన్న ప్రాంతాలను ప్రత్యేక యూనిట్లుగా గుర్తించి, ఆస్తి రికార్డుల బదిలీ పూర్తయ్యే వరకు పాత విధానంలోనే మ్యుటేషన్లు జరిగేలా చూడాలి.
2. రిజిస్ట్రేషన్ , మున్సిపల్ శాఖల మధ్య డేటా సమన్వయం కోసం.. ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలి.
3. మ్యుటేషన్ ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా బ్యాంకులు టెంపరరీగా లోన్స్ ఇచ్చేలా ప్రభుత్వం హామీ ఇవ్వాలి.
మొత్తంగా ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చేవరకూ నగరవాసులకు ఈ ఆఫీస్ చుట్టూ తిప్పలు తప్పేలా లేవు. పరిపాలనా లోపాల వల్ల సామాన్యుడి సొమ్ము అడ్వాన్సుల రూపంలో విక్రేతల దగ్గర చిక్కుకుపోవడంపై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. . ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ గందరగోళానికి తెరదించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
Women:మహిళలకు బంపర్ ఆఫర్.. ఉచిత ల్యాప్‌టాప్, ఇంటి నుంచే ఆదాయం




One Comment