Phone Tapping : సంతోష్ రావుకు సిట్ నోటీసులు..ఇక మిగిలింది కవిత, కేసీఆరేనా ?
Phone Tapping : తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది
Phone Tapping
తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone tapping Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే హరీశ్ రావు, కేటీఆర్ లను విచారించిన సిట్ దర్యాప్తులో దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష రావుకు సిట్(SIT) నోటీసులు జారీ చేసింది. మంగళవారం మ. 3 గంటలకు జూహ్లీహిల్స్ పీఎస్ లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
సిట్ నోటీసులపై వెంటనే స్పందించిన సంతోష్ రావు విచారణకు హాజరువుతున్నట్టు తెలిపారు. సిట్ అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తానని వెల్లడించారు. గత ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారం తీవ్ర సంచలనమైంది.. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురి రాజకీయ నాయకులు, ప్రముఖులు,అధికారుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు కూడా ఆరోపణలున్నాయి.
అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారులతో ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) చేయించినట్టు కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి 2024 మార్చి 10 నుంచి లోతుగా దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటికే పలువురు నిందితులపై చార్జిషీటు దాఖలు చేసినట్టు స్పెషల్ సిట్ చీఫ్ సజ్జనార్ వెల్లడించారు.
ఇదిలాఉంటే సిట్ తర్వాత నోటీసులు ఎవరికిస్తుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. సిట్ దూకుడు చూస్తుంటే త్వరలోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులివ్వడం ఖాయమని భావిస్తున్నారు. అలాగే కల్వకుంట్ల కవితను కూడా సిట్ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ట్యాపింగ్ చేయించింది ఎవరు ? దీని వెనుక ప్రధాన సూత్రధారి ఎవరు వంటి ప్రశ్నలకు స్పష్టత ఇచ్చే అవకాశముంది. అలాగే విచారణలో హరీశ్ రావు, కేటీఆర్ చెప్పిన విషయాలను ఇప్పటికే పోల్చిచూసినట్టు సమాచారం, ఇప్పుడు సంతోష్ రావు చెప్పే సమాధానాలతో దర్యాప్తు మరింత ఊపందుకోవడం ఖాయమని భావిస్తున్నారు.
గతంలో అధికారులు చెప్పిన అంశాలు, ఇప్పుడు కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావు చెప్పిన సమాధానాలతో ఓ అంచనాకు వచ్చి ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సిట్ విచారణను డైవర్షన్ పాలిటిక్స్ గా కొట్టిపారేస్తున్న బీఆర్ఎస్ నేతలు కోర్టులోనే తేల్చుకోవాలని డిసైడయ్యారు. విచారణ సందర్భంగా మంగళవారం బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ పీఎస్ కు వచ్చే అవకాశముంది.
Real Estate:స్తంభించిన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..అయోమయంలో కొనుగోలుదారులు..! పరిష్కారమెప్పుడు?




One Comment