Just Andhra PradeshLatest News

Voter List : 45 లక్షల ఓట్ల తొలగింపు .. మీ ఓటు హక్కును తిరిగి పొందాలంటే ఇలా చేయండి..

Voter List : ఆగస్టు 30వ తేదీ వరకు మీకు ఓటును తిరిగి పొందడానికి సమయం ఉంది. ఒక డిక్లరేషన్ ఫామ్‌తో పాటు ఫామ్-6 (Form-6) నింపి అధికారులకు సమర్పిస్తే సరిపోతుంది.

Voter List

ఎంతో బాధ్యతగా మీరు ఓటు వేద్దామని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే అలర్ట్ అవ్వండి. ఎందుకంటే ఎన్నికల సంఘం చేపట్టిన ప్రక్షాళనతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద కలకలమే రేగింది. ఏపీ వ్యాప్తంగా సుమారు 45 లక్షల మంది ఓట్లు గాల్లో కలిసిపోయాయి.

ఈ వార్త వినగానే అయ్యో నా ఓటు కూడా పోయిందేమోననే భయం చాలామందిలో పట్టుకుంది. అయితే, మీ పేరు ఈ లిస్ట్‌లో ఓటర్ లిస్టులో (Voter List)లేకపోయినా సరే.. అస్సలు టెన్షన్ పడాల్సిన పనిలేదని ఈసీ చెబుతోంది. ఓటు హక్కును కోల్పోయిన అర్హులకు ఎన్నికల సంఘం మరో మంచి అవకాశాన్ని కల్పించింది. ఒకవేళ మీ ఓటు తొలగించబడి ఉంటే, మీ హక్కును తిరిగి పొందడానికి ఈరోజు నుంచే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.

ఆగస్టు 30వ తేదీ వరకు మీకు ఓటును తిరిగి పొందడానికి సమయం ఉంది. ఒక డిక్లరేషన్ ఫామ్‌తో పాటు ఫామ్-6 (Form-6) నింపి అధికారులకు సమర్పిస్తే సరిపోతుంది. మీ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్టోబర్ 3న రిలీజ్ చేసే ఫైనల్ లిస్ట్‌లో మీ పేరును తిరిగి యాడ్ చేస్తారు.

ప్రస్తుతం ఏ ఊరికి ఆ ఊరి గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఆఫీసులు, ఈఆర్ఓ (ERO) ఆఫీసుల నోటీస్ బోర్డులపై తొలగించిన వారి పేర్లను ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు, ఇంట్లో కూర్చునే సీఈఓ (CEO) వెబ్‌సైట్‌లో మీ పేరు ఉందో లేదో కూడా ఈజీగా చెక్ చేసుకోవచ్చు.

ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా 46,397 మంది బీఎల్‌ఓలు.. జూన్ 15 నుంచి జూలై 24 వరకు ఏపీ వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో గడపగడపకూ తిరిగారు. ఈ సర్వేలో ఊరు వదిలి పర్మినెంట్‌గా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు, అందుబాటులో లేని వారు ఏకంగా 22.30 లక్షల మంది ఉన్నట్లు తేలింది. ఇక మరణించిన వారి పేరుతో ఉన్న 15.22 లక్షల ఓట్లతో పాటు, 2,3 చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న 7.37 లక్షల మంది డూప్లికేట్ ఓట్లను ఐడెంటిఫై చేశారు.

ఈ గ్రౌండ్ లెవెల్ ఆపరేషన్‌లో మొత్తం 4.16 కోట్లకు పైగా ఓటర్లకు గాను, సుమారు 3.71 కోట్ల మంది (89.22%) తమ వివరాలను అందించారు. మిగిలిన 44.89 లక్షల మంది ఓటర్లు అడ్రస్‌లలో లేకపోవడం, ఎన్యూమరేషన్ ఫామ్‌లు ఇవ్వకపోవడం, లేదా ఓటుపై ఆసక్తి చూపించకపోవడం వల్ల ఈ ప్రతిష్టంభన ఏర్పడింది.

Voter List
Voter List

ఈ ప్రాసెస్ మొత్తాన్ని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) వివేక్ యాదవ్ పర్యవేక్షించారు. పొలిటికల్ పార్టీల నుంచి కూడా సుమారు 1.27 లక్షల మంది బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు.

ఏది ఏమయినా.. ఏ కారణం చేతనైనా మీ ఓటు తొలగించబడి ఉంటే, ఆగస్టు 30 లోపు ఫామ్-6 సబ్మిట్ చేయడం మర్చిపోవద్దు. జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు మీ అప్లికేషన్లను క్లియర్ చేసి, అక్టోబర్ 3న పక్కా ఓటర్ల తుది జాబితాను రిలీజ్ చేస్తారు. కాబట్టి లేట్ చేయకుండా వెంటనే మీ ఓటు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.

Nandamuri Tejeswini : సినిమాల్లోకి నందమూరి తేజస్విని ..స్పోర్ట్స్ డ్రామాతో అరంగేట్రం?

Related Articles

Back to top button