Tirumala Brahmotsavam : తిరుమల బ్రహ్మోత్సవాలకు వేళాయే.. మరి 200 ఏళ్ల గొడుగుల కైంకర్యం చరిత్ర గురించి తెలుసా?

Tirumala Brahmotsavam : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వచ్చాయంటే చాలు భక్తుల గోవింద నామస్మరణతో ఏడుకొండలు మారుమోగిపోతాయి.

Tirumala Brahmotsavam

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు సాయంత్రం అంటే సెప్టెంబర్ 15వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 6:21 నుంచి 6:35 నిమిషాల మధ్య మీన లగ్నంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి.. గరుడ పతాకాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేయడంతో బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి.

రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. స్వామివారు 9 రోజుల పాటు 16 వాహనాలపై భక్తులకు కనువిందు చేయనున్నారు.కాగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వచ్చాయంటే చాలు,భక్తుల గోవింద నామస్మరణతో ఏడుకొండలు మారుమోగిపోతాయి.

ఈ వేడుకల్లో అత్యంత ముఖ్యమైనది అలాగే కళ్లారా చూస్తే జన్మధన్యమవుతుందని భావించే ఘట్టం గరుడ సేవ. గరుడ వాహనంపై విశ్వాన్నంతా ఏలే మలయప్ప స్వామి ఊరేగుతుంటే స్వామివారిపై నీడ పరిచే శ్వేతచ్ఛత్రాలను చూసి భక్తులు పులకించిపోతారు. అయితే ఆ పవిత్రమైన గొడుగులకు, తమిళనాడు రాజధాని చెన్నైకి మధ్య రెండు శతాబ్దాలుగా విడదీయరాని బంధం ఉందనే విషయం చాలామందికి తెలీదు.

ఈ అపూర్వ కైంకర్యం వెనుక చెన్నైకి దగ్గరలో ఉండే తిరునిన్రావూర్ భక్తుల అనన్య సామాన్యమైన బంధం దాగి ఉంది. సుమారు 190 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ శ్వేతచ్ఛత్రాల సేవ, తరతరాలుగా ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతోంది.

స్వామివారి గరుడ సేవ సమయంలో వాతావరణంలో జరిగే మార్పులతో ఎండ, వాన వంటివి తగలకుండా ఈ మంగళకరమైన గొడుగులను అలంకరించడం ఎన్నోఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం చెన్నైలోని హిందూ ధర్మార్థ సమితి శ్రీ భాష్యకార కైంకర్య ట్రస్ట్ ఆధ్వర్యంలో .. ఈ బాధ్యతను భగవత్ రామానుజుల సిద్ధాంతాలకు అనుగుణంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.

ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సమయానికి సరిగ్గా 11 ప్రత్యేక గొడుగులను అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో తయారు చేసి తిరుమలకు తీసుకువస్తారు. వీటిని తయారు చేసే కళాకారులు ఉపవాస దీక్షలు చేపట్టి, ప్రతీ నిమిషం గోవింద నామాన్ని స్మరిస్తూ వీటి తయారీని పూర్తి చేస్తారు.

దాదాపు 7 నుంచి 9 అడుగుల వ్యాసంతో రూపొందే ఈ శ్వేతచ్ఛత్రాలకు పటిష్టమైన వెదురు ఫ్రేమ్‌లతో పాటు నాణ్యమైన పాప్లిన్ అనే ప్రత్యేకమైన వస్త్రాన్ని ఉపయోగిస్తారు. ఎరుపు, పసుపు రంగుల లేసులు, వెల్వెట్ క్లాత్, పైన మెరిసిపోయే బంగారు వర్ణపు కలశంతో వీటిని అత్యంత నయన మనోహరంగా తీర్చిదిద్దుతారు.

Tirumala Brahmotsavam

ఇలా తయారైన శ్వేతఛ్ఛత్రాల ఆధ్యాత్మిక యాత్ర చెన్నై వీధుల్లో వేలాది మంది భక్తుల నీరాజనాల మధ్య కోలాహలంగా మొదలవుతుంది. ఈ యాత్ర తిరుమలకు చేరే సమయంలోనే ముందుగా రెండు గొడుగులను తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి సమర్పిస్తారు

మిగిలిన 9 గొడుగులు అలిపిరి కాలినడక మార్గం ద్వారా కొండపైకి చేరుకుంటాయి. తిరుమల మాడ వీధుల్లో ఈ శ్వేతచ్ఛత్రాలను ఊరేగించి, గరుడ సేవకు ముందు రోజు టీటీడీ అధికారులకు అధికారికంగా అందజేస్తారు. అలా చెన్నైలో భక్తుల చేతుల్లో రూపుదిద్దుకుని తిరుమల కొండపైకి చేరే ఈ యాత్ర, బ్రహ్మోత్సవాలలో స్వామివారి సేవకు మరింత సంపూర్ణత్వాన్ని చేకూరుస్తుంది.

Alla Nani : ఆళ్ల నాని ఆకస్మిక మరణంపై నేతల సంతాపాలు.. సొంతూరులోనే అంత్యక్రియలు..

Exit mobile version