YS Jagan
ఏపీ లిక్కర్ స్కామ్ లో విచారణను ఈడీ మరింత వేగవంతం చేసింది. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే చాలా సాక్ష్యాలు సేకరించిన ఈడీ పలువురు వైసీపీ నేతలను అరెస్ట్ చేసింది. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపైనా ఫోకస్ పెట్టింది. అరెస్టయిన నేతల ఇళ్లల్లో సోదాలు జరిగాయి. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న ఈడీ ఈ మొత్తం కుంభకోణంలో అంతిమంగా లబ్ది పొందింది ఎవరనే దానిపై దృష్టి పెట్టింది.
దీని కోసం మరింత లోతుగా దర్యాప్తు జరపాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) కు నోటీసులు జారీ చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది. ఇప్పటి వరకూ జరిగిన విచారణలో నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే జగన్ కు ఈడీ నోటీసులు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
జగన్(YS Jagan) కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే ఈ కేసు విచారణ చివరి దశకు చేరుకున్నట్టేనని భావిస్తున్నారు. ఈ కేసు విచారణకు సంబంధించి సిట్ అధికారులు 350 పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దానిలో జగన్ ను అంతిమ లబ్ధిదారునిగా పేర్కొన్నట్టు వార్తలు వచ్చాయి.
అదే సమయంలో దారి మళ్లించిన కోట్లాది రూపాయల ముడుపులను విదేశాలకు తరలించారన్న ఆరోపణలున్నాయి. దీనిపై సిట్ అధికారులు ఈడీకి లేఖ రాయడంతో విచారణ మొదలైంది. మనీలాండరింగ్ కు పాల్పడి ముడుపుల సొమ్మును విదేశాల్లో దాచారన్న ఆరోపణలపై ఈడీ ఫోకస్ పెట్టింది. సిట్ నుంచి వివరాలను తీసుకున్న ఈడీ నిందితులకు సంబంధించిన ఆస్తులను సీజ్ చేసింది.
రాజ్ కసిరెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి నివాసాల్లోనూ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల ద్వారా సేకరించిన సమాచారం, కీలక పత్రాల ఆధారంగానే ఈడీ తర్వాతి చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపింది. ఇష్టమొచ్చిన బ్రాండ్లను తీసుకొచ్చి నాసిరకం మద్యాన్ని ఎక్కువ ధరకు అమ్మినట్టు ఆరోపణలున్నాయి.
అలా వచ్చిన డబ్బులనే వైసీపీ నేతలు పంచుకున్నట్టు కూడా అభియోగాలున్నాయి. మద్యం సరఫరా చేసే కంపెనీల నుంచి భారీగా కమీషన్లు కూడా వసూలు చేసినట్టు ప్రాథమిక విచారణలో గుర్తించారు. లోతుగా దర్యాప్తు జరిపిన తర్వాత కీలక ఆధారాలు కూడా సేకరించారు. ప్రస్తుతం అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది తేల్చే క్రమంలో వైెఎస్ జగన్ కు నోటీసులిచ్చి విచారించనున్నట్టు తెలుస్తోంది.
YS Sharmila : వైఎస్ షర్మిలకు హైకమాండ్ బిగ్ షాక్..విలీన హామీ ఉన్నా ఎందుకు ఛాన్స్ దక్కలేదు
