YS Sharmila : వైఎస్ షర్మిలకు హైకమాండ్ బిగ్ షాక్..విలీన హామీ ఉన్నా ఎందుకు ఛాన్స్ దక్కలేదు
YS Sharmila : కర్ణాటక కోటా నుంచి తనకు రాజ్యసభ స్థానం దక్కుతుందని గంపెడాశలు పెట్టుకున్న షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్యంగా మొండిచేయి చూపింది
YS Sharmila
రాజకీయాల్లో ఏ సమీకరణాలు ఎటు నుంచి ఎటు మారిపోతుంటాయో ఎవరూ ఊహించలేరు. అందులోనూ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయాలు ఎలా ఉంటాయో ఊహించడం ఎవరికైనా కష్టమే. తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీ పీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) విషయం లోనూ ఇదే ప్రూవ్ అయింది.
కర్ణాటక కోటా నుంచి తనకు రాజ్యసభ స్థానం దక్కుతుందని గంపెడాశలు పెట్టుకున్న షర్మిలకు(YS Sharmila) కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్యంగా మొండిచేయి చూపింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన సమయంలో తనకు ఇచ్చిన హామీని నెరవేర్చమని ఆమె హస్తినకు వెళ్లి మరీ.. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లను కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది.
రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి వైఎస్ షర్మిల(YS Sharmila) రేసులో ఉన్నట్లు గట్టి ప్రచారమే సాగింది. కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో షర్మిలకు ఉన్న మంచి సంబంధాలు, వైఎస్ఆర్ కుమార్తె అనే గుర్తింపు తనకు కలిసి వస్తాయని ఆమె భావించారు.
పార్లమెంట్‌లో ఏపీ గొంతుకను బలంగా వినిపించాలన్నా, ఏపీలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలన్నా తనకు రాజ్యసభ సభ్యత్వం ఎంతో అవసరమన్న విషయాన్ని పదేపదే ఆమె అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. స్వయంగా మల్లిఖార్జున ఖర్గే కూడా ఒకసారి హైదరాబాద్ వేదికగా మాట్లాడుతూ ..షర్మిలకు ఇచ్చిన హామీపై సానుకూలంగా స్పందించడంతో ఆమె కచ్చితంగా సీటు వస్తుందనే ధీమాతోనే ఉన్నారు. కానీ, తాజాగా కాంగ్రెస్ రిలీజ్ చేసిన అధికారిక అభ్యర్థుల జాబితాలో ఆమె పేరు లేకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
అయితే షర్మిలకు చివరి నిమిషంలో ఈ పదవి దక్కకపోవడం వెనుక చాలా రాజకీయ కారణాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో ఆమె అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ ఆశించిన స్థాయిలో పుంజుకోలేకపోవడం, స్థానిక సీనియర్ నాయకులతో షర్మిలకు తలెత్తిన విభేదాలు మైనస్‌గా మారాయని టాక్.

కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి కానీ.. కేవలం వైఎస్ జగన్ మీద ఆరోపణలకే షర్మిల పరిమితమయ్యారంటూ హైకమాండ్‌కు కొన్ని ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. వీటికి తోడు, కర్ణాటక కాంగ్రెస్ స్థానిక నాయకత్వానికి కాకుండా బయటి వ్యక్తులకు సీటు ఇవ్వడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. దీంతో హైకమాండ్ స్థానిక సమీకరణాలకే మొగ్గు చూపింది. దీనివల్ల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్,మీడియా విభాగం చైర్మన్ పవన్ ఖేరా, వంటి నేతలకు ఇప్పుడు ఆ స్థానాలు దక్కాయి.
ప్రస్తుతం బెంగుళూరులోనే ఉన్న వైఎస్ షర్మిల, డీకే శివకుమార్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరై రెండు రోజులుగా అక్కడే ఉన్నారు. అయితే ఇప్పుడు అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంపై అసంతృప్తిని వెళ్లగక్కడం కానీ ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించడం కంటే, ప్రస్తుతానికి ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపైనే పూర్తి దృష్టి సారించాలని ఆమె శ్రేయోభిలాషులు చెప్పినట్లుగా సమాచారం. మరి ఈ పరిణామం ఏపీ కాంగ్రెస్ భవిష్యత్ వ్యూహాలను ఎలా మారుస్తుందనేది పొలిటికల్ స్ట్రీట్‌లో ఆసక్తికరంగా మారింది.
Visakhapatnam Port : విశాఖపట్నం పోర్టుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం..వంద శాతం గ్రీన్ పవర్‌తో రికార్డ్





