Mavigun
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కలిస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు పాసయింది. ఉభయ సభల్లోనూ ఆమోదం లభించింది. ఇక రాష్ట్రపతి సంతకం కాగానే చట్టంగా మారుతుంది. అయితే అమరావతికి సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అమరావతిలో చంద్రబాబు, ఆయన బినామీలు, టీడీపీ నేతలు భూములు కొనేసి భారీ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలను మొదటి నుంచీ వైసీపీ గట్టిగానే వినిపించింది. అందుకే 2019లో అధికారంలోకి రాగానే అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానుల విధానాన్ని ఎత్తుకుంది. దీనికి ప్రజల్లో సరైన స్పందన రాకపోవడంతో అసెంబ్లీలో బిల్లును కూడా ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
తర్వాత పలు సందర్భాల్లో మూడు రాజధానులకే తాము కట్టుబడి ఉన్నామంటూ జగన్, వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. మధ్యలో ముఖ్యమంత్రి ఎక్కడ నివాసం ఉంటే అదే రాజధాని అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. దీంతో అమరావతికి జగన్ వ్యతిరేకం అన్న అభిప్రాయాన్ని టీడీపీ నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు.
2024 ఎన్నికల్లో ఇది కూడా ఎక్కువ ప్రభావం చూపించింది. వైసీపీ ఘోరపరాజయానికి రాజధాని అంశం కూడా ఒక కారణంగా విశ్లేషకులు చెబుతుంటారు. అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అంశాన్ని జగన్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదని వైసీపీ నేతలు కూడా అప్పట్లోనే బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి చట్టబద్ధత కల్పించే ఆలోచనను ఆచరణలో పెట్టింది. లోక్ సభలో బిల్లు పెట్టడానికి ఒకరోజు ముందు వైెఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి దీనిపై సుదీర్ఘంగా మాట్లాడారు. అయితే వైసీపీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడంలో జగన్ విఫలమయ్యారని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అమరావతికి వ్యతిరేకం కాదంటూనే మావిగన్(Mavigun) అంటూ కొత్త మాట ఎత్తుకున్నారు. రాజధానికి ప్లాన్ బి అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాన్ని రాజధాని చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. మావిగన్(Mavigun) పేరుతో రాజధాని ప్రకటించాలంటూ చెప్పారు.
దీంతో రాజధాని విషయంలో పార్టీ పరమైన అభిప్రాయాన్ని బలంగా చెప్పడంలో జగన్ విఫలమయ్యారని భావిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు అమరావతిపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసిన జగన్ వీడియోలను టీడీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది.
అమరావతిలో భూదోపిడీకే తాము వ్యతిరేకం తప్ప ఆ ప్రాంతానికి తాము వ్యతిరేకం కాదన్న వాదనను బలంగా వైసీపీ వినిపించలేకపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. లోక్ సభ, రాజ్యసభలో బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేయడం ద్వారా అమరావతికి వైసీపీ వ్యతిరేకం అన్నది మరోసారి రుజువైందని టీడీపీ నేతలు బలంగా ప్రచారం చేస్తున్నారు.
