Pune Murder Case
మహారాష్ట్రలో రీసెంట్‌గా సంచలనం సృష్టించిన పూణే ట్రెక్కర్ కేతన్ అగర్వాల్.. మృతి కేసులో ఎట్టకేలకు చిక్కుముడి వీడింది. ముందు యాక్సిడెంటల్‌గా జరిగిన మరణంగా అందరూ అనుకున్న ఈ ఇన్సిడెంట్.. చివరకు లవర్‌తో కలిసి కాబోయే భర్తను అత్యంత దారుణంగా అంతమొందించిన మర్డర్‌గా తేలింది.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఒక రాయల్ ప్యాలెస్‌లో సుమారు రూ. 17 కోట్ల భారీ బడ్జెట్‌తో పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో, పెళ్లి సంబరాల్లో మునిగిపోయిన 2 కుటుంబాల్లో ఈ ఘాతుకం కోలుకోలేని విషాదాన్ని నింపింది. అసలు ఈ కేతన్ అగర్వాల్ హత్య కేసు ఏంటి? ఇలాంటి దారుణమైన నేరాలు ఎందుకు ఎక్కువగా కనిపిస్తున్నాయి.దీని వెనుక ఉన్న మానసిక కారణాలు ఏంటనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
పూణేకు చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్.. తమ సొంత రియల్ ఎస్టేట్ కంపెనీలో డైరెక్టర్‌గా చేస్తూ మంచి పొజిషన్‌లో ఉన్నాడు. అతనికి సియా గోయల్ అనే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. జూన్ 18న సియా బర్త్ డే కావడంతో, వీరిద్దరూ కలిసి లోహగడ్ కోటకు ట్రెక్కింగ్‌కు ప్లాన్ చేశారు.
కానీ సియాకు ఈ పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదని.. ఆమె అంతకుముందే తన సహోద్యోగి చేతన్ చౌదరితో గాఢమైన ప్రేమలో ఉందన్న విషయాలను ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచింది. చివరకు కేతన్‌ను ఎలాగైనా వదిలించుకోవాలనే ప్లాన్‌తో, సియా గోయల్ తన ప్రియుడిని కూడా ఆ ట్రిప్‌కు రప్పించింది. అక్కడ కోటపై ఒక ప్రదేశంలో ఫొటోలు దిగుతుండగా ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం, కేతన్‌ను ఒక్కసారిగా ఆ లోయలోకి తోసేసింది.
ఆ తర్వాత కేతన్ ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయాడంటూ సియా గోయల్ పోలీసులకు కట్టుకథలు చెప్పి నమ్మించింది. అయితే, ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులు అనుమానం వచ్చి.. సియా ఫోన్ కాల్ డేటా, సెల్ టవర్ లొకేషన్లను పరిశీలించడంతో అసలు నిజాలు బయటపడ్డాయి.
హత్య జరిగిన సమయంలో సియా ప్రియుడు చేతన్ చౌదరి కూడా అక్కడే ఉన్నట్లు టెక్నికల్ ఆధారాల ద్వారా ప్రూవ్ అయింది. పోలీసుల తమదైన శైలిలో విచారించగా ముందుగా పొంతన లేని సమాధానాలు చెప్పిన సియా.. చివరకు తన లవర్‌తో కలిసి చేసిన ఈ ఘోరాన్ని అంగీకరించింది. ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
ఈ కేసును నిశితంగా గమనిస్తే ఇందులో డేంజరస్ మానసిక స్థితి కనిపిస్తుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇష్టం లేకపోతే పెళ్లి లేదా ప్రేమ బంధం నుంచి గౌరవంగా తప్పుకోవాలి. లేదంటే ఇంట్లో వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇష్టం లేకపోతే ఎదుటివారిని చంపేయడం, లేదా తామే చచ్చిపోవడమనే విపరీత ధోరణి పెరుగుతోందని అంటున్నారు.
నిజానికి దీని వెనుక మెయిన్‌గా కమ్యూనికేషన్ గ్యాప్ , పరువు గురించిన భయం దాగి ఉన్నాయి. అందుకే ఇప్పటికీ చాలా కుటుంబాలలోని పిల్లలు తమ మనసులోని మాటను పేరెంట్స్‌కు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఒకవేళ చెబితే సొసైటీ ఏమనుకుంటుందో అనే భయంతో, చివరకు అవతలి వ్యక్తిని శాశ్వతంగా దూరం చేసేస్తే సమస్య తీరిపోతుందని ఆలోచించే స్టేజ్‌లోకి వెళ్లిపోతున్నారు.
మరోవైపు నేటి డిజిటల్ యుగంలో మనుషుల్లో ఓపిక చాలా తగ్గిపోతోంది. క్షణికావేశంలో తీసుకునే డెసిషన్స్ వల్ల వచ్చే పరిణామాలను కొంచెం కూడా అంచనా వేయలేకపోతున్నారు.
అవతలి వ్యక్తిని చంపేస్తే తాము హాయిగా బ్రతకొచ్చనే ఒక భ్రమలో ఘోరాలు చేసేస్తున్నారు కానీ, టెక్నాలజీ యుగంలో ఎలాంటి నేరమైనా సరే ఈజీగా కనిపెడతారన్న కనీస జ్ఞానాన్ని కోల్పోతున్నారు.భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘోరాలన్నీ జరుగుతున్నాయి.
ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో, ప్రాబ్లెమ్ వస్తే దాన్ని ప్రశాంతంగా ఎలా పరిష్కరించుకోవాలో నేటి విద్యావ్యవస్థలో గానీ, కుటుంబాలలో గానీ నేర్పించకపోవడం కూడా పెద్ద లోపంగా మారుతోంది.
ఇలాంటి పరిస్థితులు మారాలంటే కేవలం చట్టాలు, పోలీసులు మాత్రమే సరిపోరు. ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు స్నేహపూర్వక వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అంతే కాదు పరువు ప్రతిష్టల కంటే తమ పిల్లల సంతోషం, వారి మానసిక స్థితి ముఖ్యం అనే విషయాన్ని పెద్దలు కూడా గుర్తించాలి.
Shiv Sena : ఆపరేషన్ టైగర్‌తో షాక్.. ఉద్ధవ్ ఠాక్రే ఏం చేయబోతున్నారు ?
