Peddi Movie : పెద్ది మూవీ రిలీజ్‌కు లైన్ క్లియర్.. థియేటర్ల వివాదానికి చెక్ పెట్టిన మెగాస్టార్

Peddi Movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీని పాత పద్ధతిలోనే, అంటే కేవలం రెంటల్ విధానంలోనే థియేటర్లలో ప్రదర్శించడానికి ఎగ్జిబిటర్లు చివరకు అంగీకరించారు

Peddi Movie

టాలీవుడ్‌లో కొద్ది రోజులుగా థియేటర్ల యజమానులకు, ప్రొడ్యూసర్లకు మధ్య నడుస్తున్న పర్సంటేజీల గొడవ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి జరిపిన చర్చల వల్ల తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీని(Peddi Movie )పాత పద్ధతిలోనే, అంటే కేవలం రెంటల్ విధానంలోనే థియేటర్లలో ప్రదర్శించడానికి ఎగ్జిబిటర్లు చివరకు అంగీకరించారు. దీంతో ఈ సినిమా సింగిల్ స్క్రీన్లలో రిలీజవ్వడానికి ఉన్న పెద్ద అడ్డంకి పూర్తిగా తొలగిపోయింది.

హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం తెలంగాణ ఎగ్జిబిటర్లు మెగాస్టార్ చిరంజీవితో రెండోసారి సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీటింగ్‌లో ఎగ్జిబిటర్ల అసోసియేషన్ తమ సమస్యలతో పాటు, నిర్ణయాలను కూడా చిరుకి వివరించారు. థియేటర్ల యజమానుల ఇబ్బందులను విన్న మెగాస్టార్.. వారికి అన్ని రకాలుగా ఇండస్ట్రీ తరపున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

చిరంజీవి ఇచ్చిన హామీతో ఎగ్జిబిటర్లు తమ పట్టును వీడి, పర్సంటేజీ విధానాన్ని ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేసుకున్నారు. జూన్ 30 తర్వాత రిలీజయ్యే కొత్త సినిమాలకు మాత్రమే ఈ పర్సంటేజీ విధానాన్ని అమలు చేస్తామని, అప్పటివరకు వచ్చే చిత్రాలకు పాత పద్ధతే వర్తిస్తుందని అసోసియేషన్ చెప్పింది.

ఎగ్జిబిటర్లు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన చిరంజీవి.. ముందు ముందు ఫిలిం ఛాంబర్ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం అందరూ కలిసికట్టుగా నడుచుకోవాలని సూచించారు.

నిజానికి అంతకుముందు తెలంగాణ ఎగ్జిబిటర్లంతా చాలా పట్టుదలగా ఉన్నారు. రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ(Peddi Movie )నుంచే పర్సంటేజ్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని, లేదంటే తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోమని తెగేసి చెప్పారు. ఆ పర్సంటేజ్ ఎంత ఉండాలనేది మాత్రం ప్రొడ్యూసర్లు తమతో కూర్చుని మాట్లాడాలని డిమాండ్ చేశారు.

Peddi Movie

అయితే దీనిపై ప్రొడ్యూసర్ల నుంచి వ్యతిరేకత రావడంతో టాలీవుడ్‌లో వివాదం రాజుకుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ సమస్యను పరిష్కరించడానికి మెగాస్టార్ సోమవారం ఒకసారి, మళ్లీ బుధవారం మరోసారి ఎగ్జిబిటర్లతో సమావేశమై మాట్లాడారు. చివరకు చిరు మాటను గౌరవించి థియేటర్ల ఓనర్లు తగ్గడంతో సమస్య సద్దుమణిగింది.

పెద్ది సినిమా జూన్ 4 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, బొమన్ ఇరానీ వంటి ఫేమస్ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన మ్యూజిక్ ఇప్పటికే సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది.

Peddi : పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు పూర్తి.. చీఫ్‌ గెస్ట్‌గా ఆ హీరో వస్తున్నారా?

Exit mobile version