Pavala Shyamala
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన విలక్షణ శైలికి, హాస్యభరితమైన యాసను జోడించి వందలాది చిత్రాల్లో నటించి ఆడియన్స్‌ను అలరించిన సీనియర్ నటి పావలా శ్యామల( Pavala Shyamala) (74) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యం , ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆమె..ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
జూలై 28 తెల్లవారుజామున సుమారు 1.52 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో ఆమె ప్రాణాలు విడిచినట్లు ఉస్మానియా డాక్టర్లు ధృవీకరించారు. వందలాది సినిమాల్లో ప్రేక్షకులలో నవ్వులు పూయించిన ఈ నటి ..తన చివరి రోజుల్లో అత్యంత దయనీయ పరిస్థితుల్లో ప్రాణాలు విడిచిందనే చెప్పొచ్చు.
నిజానికి పావలా శ్యామల(Pavala Shyamala) అసలు పేరు నేతి శ్యామల. ఆమె 1951లో ఏపీలోని గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన శ్యామల ఆరోజుల్లోనే పదో తరగతి వరకు కష్టపడి చదువుకున్నారు. ఆ తర్వాత కుటుంబ ఆంక్షలతో వివాహం జరిగినా, కూతురు మాధవి పుట్టిన కొద్దిరోజులకే జరిగిన ఒక యాక్సిడెంట్‌లో ఆమె భర్తను కోల్పోయారు.
అలా చిన్న వయసులోనే ఒంటరిగా మిగిలిపోయిన నేతి శ్యామల, తన కుమార్తెను పోషించుకోవటానికి నాటక రంగాన్ని ఆశ్రయించారు. బంధువుల నుంచి ఎన్నో ఆంక్షలు, అవమానాలు ఎదురైనా సరే వెనకడుగు వేయకుండా దాదాపు 3 దశాబ్దాల పాటు రంగస్థల నాటకాల్లో నటించారు.
అలా పావలా అనే నాటకంలో శ్యామల పోషించిన పాత్ర అత్యంత ప్రజాదరణ పొంది ఇంటి పేరునే మార్చేసింది. ఈ నాటిక తెచ్చిపెట్టిన గుర్తింపుతోనే అందరూ ఆమెను ‘పావలా శ్యామల’ అని పిలవడం ప్రారంభించారు. ఆ పేరే చివరకు ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. ఆ పావలా నాటకానికే ఆమెకు సుమారు 200లకు పైగా అవార్డులు వచ్చాయి.
1984లో వచ్చిన ఛాలెంజ్, శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలతో వెండితెరకు పరిచయమైన ఆమె, 1985లో వచ్చిన బాబాయ్ అబ్బాయ్ చిత్రంతో పూర్తిస్థాయి నటిగా నిలదొక్కుకున్నారు. దర్శకరత్నం కె.విశ్వనాథ్ తెరకెక్కించిన స్వర్ణకమలం మూవీ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత ఖడ్గం, ఆంధ్రావాలా, వర్షం, గోలీమార్, ఇంద్ర, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మత్స్యకారులు, దొంగోడు, పందెం, వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో.. నెగిటివ్ రోల్స్‌తో పాటు హాస్య, సపోర్టింగ్ కేరక్టర్‌లలో తనదైన ముద్ర వేశారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి టాప్ హీరోలందరితోనూ నటించి అలరించారు. 2019లో వచ్చిన మత్తు వదలరా మూవీ.. ఆమె చివరిగా నటించిన సినిమాల్లో ఒకటి.
వెండితెరపై నవ్వులు పూయించిన శ్యామల వ్యక్తిగత జీవితం మాత్రం కన్నీళ్ల మయంగానే సాగింది. ఆమె కుమార్తె మాధవి చిన్నతనంలో మేడపై నుంచి కిందపడి గాయపడటంతో జ్ఞాపకశక్తి కోల్పోయింది. తాను సంపాదించిన ఆస్తిపాస్తులన్ని కూడా కుమార్తె ట్రీట్మెంట్‌కే ఖర్చు చేశారు.
వయసు పైబడటంతో అవకాశాలు తగ్గడంతో పావలా శ్యామల(Pavala Shyamala) తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. కిడ్నీ సమస్యలు, హృద్రోగం, పార్కిన్సన్స్ వంటి వ్యాధులతో బాధపడుతున్న సమయంలో మెగా ఫ్యామిలీ సపోర్టుగా నిలిచింది. చిరంజీవి , పవన్ కళ్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ వంటి వారితో పాటు దిల్ రాజు వంటి మరికొంత సినీ ప్రముఖుల సాయం అందించారు. అలాగే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచింది.
సహజ నటనతో దశాబ్దాల పాటు ఆడియన్స్‌ను మెప్పించిన పావలా శ్యామల మృతి చెందడంతో.. టాలీవుడ్ ప్రముఖులు, సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
Belief : మైండ్ అండ్ రిలేషన్‌షిప్స్..పార్ట్‌నర్స్ మధ్య నమ్మకం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంత ముఖ్యమా?
