Copper Vessel
అమ్మమ్మల కాలం నుంచి మన ఇంట్లో రాగి బిందెలు, రాగి గ్లాసులు ఉండటం చూస్తూనే ఉన్నాం. అది కేవలం ఒక ఆచారంగా వస్తుందని మాత్రమే కాదు, దాని వెనుక అద్భుతమైన శాస్త్రీయ కోణం దాగి ఉందని పెద్దలు చెబుతూ ఉంటారు.
ఇప్పుడు మనమంతా ప్లాస్టిక్ బాటిళ్లకు అలవాటు పడిపోయాం. అయితే రాగి పాత్ర(Copper Vessel)లో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల మన శరీరానికి ప్రకృతి సిద్ధమైన ఔషధం లభిస్తుందని ఆయుర్వేదం చెబుతుంది.
ఆయుర్వేదం ప్రకారం రాగికి బాడీలోని వాత, పిత్త, కఫ దోషాలను బ్యాలెన్స్ చేసే శక్తి ఉందట. రాగి పాత్రలో నీటిని కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిల్వ ఉంచినప్పుడు, రాగి తనలోని సూక్ష్మ గుణాలను నీటిలోకి విడుదల చేస్తుంది. ఇది నీటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను సహజంగానే చంపి నీటిని శుద్ధి చేస్తుంది. అందుకే దీనిని నేచురల్ ఫిల్ట్రేషన్ ప్రక్రియగా చెబుతారు.
రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాల్లో జీర్ణక్రియ మెరుగుపడటం ఒకటి. ఇది కడుపులోని అధిక యాసిడ్లను కంట్రోల్ చేసి గ్యాస్, అసిడిటీ , మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా రాగి పాత్రలో పోసిన నీళ్లు ఒక సహజమైన ఫ్యాట్ బర్నర్‌లా పనిచేస్తుంది.
అంతేకాకుండా చర్మ సౌందర్యానికి కూడా రాగి ఎంతో మేలు చేస్తుంది. బాడీలో కొత్త కణాల ఉత్పత్తికి తోడ్పడటం ద్వారా ముడతలను తగ్గించి స్కిన్‌ను యవ్వనంగా ఉంచుతుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరులో రాగి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి థైరాయిడ్ సమస్యలున్నవారు ఈ నీటిని తీసుకోవడం చాలా మంచిదట. అలాగే ఎముకల పుష్టికి, కీళ్ల నొప్పులను తగ్గించడానికి రాగి నీళ్లు తోడ్పడతాయి.
అయితే రాగి పాత్ర(Copper Vessel)లను ఉపయోగిస్తున్నప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలను తప్పకుండా తీసుకోవాలి. రాగి పాత్రలో కేవలం మంచి నీటిని మాత్రమే నిల్వ చేయాలి. పాలు లేదా పుల్లటి పదార్థాలను పోయకూడదు. లెమన్ వాటర్ రాగి పాత్రలో నిల్వ ఉంచి తాగకూడదు.
అలాగే పాత్ర లోపల, బయటా నల్లగా మారకుండా నిమ్మకాయ లేదా చింతపండుతో రోజూ శుభ్రం చేయాలి. రోజుకు రెండు గ్లాసుల రాగి నీరు తాగినా కూడా అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మంచివే కదా అని అతిగా తాగడం కూడా మంచిది కాదని ఆయుర్వేదం చెబుతుంది.
Thalapathy Vijay: కింగ్ మేకర్ పాత్రలో దళపతి విజయ్? తమిళనాడులో కొత్త చరిత్ర సృష్టించబోతున్న టీవీకే..
