Cockroaches
చాలా మంది ఇంట్లో అసహ్యకరమైన, ప్రమాదకరమైన బొద్దింకలు(Cockroaches) వేధిస్తుంటాయి. అయితే ఇవి కేవలం మురికి పురుగులు మాత్రమే కాదని.. భూమి మీద డైనోసార్ల కాలం కంటే ముందు నుంచి జీవిస్తున్న అత్యంత పురాతనమైన ప్రాణులు అని శాస్త్రవేత్తలు అంటారు. వీటి మనుగడ సాగించే శక్తి ఎలాంటిదంటే, ఒక అణుబాంబు పేలుడు సంభవించినా కూడా బొద్దింకలు(Cockroaches) బతికే అవకాశం ఉంటుందని చెబుతారు.
ఒక్కసారి బొద్దింకలు(Cockroaches) ఏ ఇంట్లోకి అయినా అడుగుపెట్టాయంటే చాలు.. వీటిని వదిలించుకోవడం యుద్ధం చేసినంత పనే అవుతుంది. చీకటిని, తేమను ఇష్టపడే ఈ బొద్దింకలు చూడటానికి అసహ్యాన్ని కలిగించడమే కాకుండా, టైఫాయిడ్, కలరా, ఆస్తమా వంటి ప్రమాదకర వ్యాధులను కూడా వ్యాప్తి చెందేలా చేస్తాయి.
బొద్దింకల గురించి మరో అత్యంత విచిత్రమైన విషయం ఏంటంటే, వాటి తల నరికేసినా కూడా అవి సుమారు వారం రోజుల పాటు బతికే ఉంటాయి. ఎందుకంటే అవి మనుషుల్లా ముక్కుతో కాకుండా, శరీరంలో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి. అయితే అవి కేవలం నీరు తాగలేక మాత్రమే చనిపోతాయి. అంతేకాదు తమ శ్వాసను సుమారు 40 నిమిషాల పాటు బిగపట్టి ఉంచుకోగలగడం ఈ బొద్దింకల ప్రత్యేకత. అలాగే నీటి అడుగున కూడా అరగంట సేపు ఏమీ కాకుండా ఉండగల ఏకైక జీవులు ఇవి. ఇలాంటి మొండి జీవులు మన వంటింట్లో తిరుగుతున్నాయంటే, మనం తినే ఆహారం ఎంత విషపూరితం అవుతుందో ఆలోచించడానికి కూడా భయమేస్తుంది.
అసలు ఇవి ఇంట్లోకి ఎందుకు వస్తాయంటే.. మనం వదిలేసే ఆహారపు ఆనవాళ్లే కారణం. వంటగదిలో జిడ్డు పట్టిన గోడలతో పాటు, గిన్నెలు కడగకుండా రాత్రంతా సింకులో వదిలేయడం, నేలపై పడిన అన్నం మెతుకులు వీటికి పంచభక్ష్య పరమాన్నాలుగా మారతాయన్న విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా పైపుల దగ్గర ఉండే తేమ, పాత పేపర్లు, కార్డ్ బోర్డ్ పెట్టెల మధ్య ఉండే చీకటి వీటికి నివాసాలుగా మారిపోతాయి. అంతేకాదు మనం చెత్త పడేసే బుట్టలలో మూతలు లేకపోతే, అవి అక్కడే తిష్ట వేసి తమ పిల్లలను చాలా వేగంగా పెంచేసుకుంటాయి.
అయితే బొద్దింకలను నివారించడానికి రసాయనాల కంటే ముందు.. మన వంటింటి చిట్కాలు కొన్ని పాటిస్తే సరిపోతుంది. ఉదాహరణకు, బేకింగ్ సోడాను కొద్దిగా చక్కెరతో కలిపి ఇవి తిరిగే మూలల్లో చల్లాలి. చక్కెర రుచికి బొద్దింకలు దీనిని తినడానికి వస్తాయి, కానీ బేకింగ్ సోడా వాటి పొట్టలోకి వెళ్లి గ్యాస్ నింపి వాటిని చంపేస్తుంది.
అలాగే, బోరిక్ యాసిడ్ పౌడర్‌లో కొంచెం గోధుమ పిండిని, నెయ్యిని కలిపి చిన్న ఉండలుగా చేసి అల్మరాల్లో వేయాలి. ఇది బొద్దింకల పాలిట యముడిలా పనిచేస్తుందని నిపుణులు చెబుతారు. ఇక సహజమైన పద్ధతి కావాలంటే బిర్యానీ ఆకులు కానీ వేపాకులను కానీ దంచి ఆ పొడిని చల్లితే బొద్దింకలు దరిదాపుల్లోకి కూడా రావు.
వంటగది సింకు రంధ్రాల ద్వారా బొద్దింకలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే, వారానికి ఒకసారి వేడి నీళ్లలో వెనిగర్ , నిమ్మరసం కలిపి అందులో పోయాలి. పడక గదిలో , అల్మరాల్లో కిరోసిన్ కానీ పుదీనా నూనె (Peppermint Oil) కానీ రాసిన దూది ఉండలను ఉంచితే ఆ వాసన భరించలేక దూరంగా వెళ్లిపోతాయి. బొద్దింకలు లేని ఇల్లు అంటే కేవలం అందమైన ఇల్లు మాత్రమే కాదని ఆరోగ్యకరమైన ఇల్లు కూడా అని గుర్తించాలి.
Chennai Super Kings : ధోనీ లేకుంటే అంతేనా ?…పాయింట్ల పట్టికలో అట్టడుగున చెన్నై
