Chennai Super Kings : ధోనీ లేకుంటే అంతేనా ?…పాయింట్ల పట్టికలో అట్టడుగున చెన్నై
Chennai Super Kings : ఐపీఎల్ 19వ సీజన్ రెండో వారంలోకి అడుగుపెట్టింది. మినీ వేలంలో పలు జట్ల కూర్పు మారడంతో తొలి వారంలో కొన్ని ఊహించని ఫలితాలు వచ్చాయి
Chennai Super Kings
ఐపీఎల్ 19వ సీజన్ రెండో వారంలోకి అడుగుపెట్టింది. మినీ వేలంలో పలు జట్ల కూర్పు మారడంతో తొలి వారంలో కొన్ని ఊహించని ఫలితాలు వచ్చాయి. పలు జట్లలో స్టార్ ప్లేయర్స్ ఇంకా పూర్తిగా కుదురుకోలేదు. అయితే ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) వరుస పరాజయాలతో నిరాశపరుస్తోంది.
నిజానికి చెన్నై జట్టుపై ప్రతీసారీ భారీ అంచనాలుంటాయి. ఎందుకంటే సీనియర్, యువ ఆటగాళ్లతో పలు సందర్భాల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన చరిత్ర సీఎస్కే(Chennai Super Kings) సొంతం. ముఖ్యంగా 18 సీజన్ల నుంచి కూల్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీనే చెన్నై సక్సెస్ మంత్ర. యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో ధోనీకి సాటి మరెవ్వరూ లేరు.
అదే సమయంలో గత కొన్ని సీజన్లుగా ధోనీ వారసుడు ఎవరనేది మాత్రం తెలియడం లేదు. కెప్టెన్సీలో జడేజాను పరీక్షించినా విఫలమయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా ఇంకా తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. ఈ కారణంగానే ప్రస్తుత సీజన్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ధోనీపై అతిగా ఆధారపడడం, అతనికి సరైన వారసుడిని గుర్తించడంలో విఫలమవడం చెన్నై ఫ్రాంచైజీ చేసిన తప్పిదంగా పలువురు విశ్లేషిస్తున్నారు.
గత సీజన్ మధ్యలో రుతురాజ్ గాయంతో తప్పుకున్నప్పుడు ధోనీనే సారథిగా బాధ్యతలు తీసుకున్నాడు. అంటే జట్టులో ధోనీ తర్వాత ఎవరూ లేరనేది అర్థమవుతోంది. వయసు మీద పడడం, ఫిట్ నెస్ సమస్యలతో మహి కూడా అనుకున్న మ్యాజిక్ చేయలేకపోవడంతో గత సీజన్ లో సీఎస్కే అట్టడుగు స్థానానికి పరిమితమైంది.
ప్రస్తుత సీజన్ లో సంజూ శాంసన్ ను ట్రేడింగ్ లో తెచ్చుకుని జడేజా, సామ్ కరన్ లను వదిలేసింది. సంజూ కూడా రాణించడం లేదు. అటు జట్టులో మిగిలిన కీలక ఆటగాళ్లు కూడా విఫలమవుతున్నారు. అదే సమయంలో ధోనీ కూడా గాయంతో దూరమవడం చెన్నైకి అతిపెద్ద సమస్యగా మారింది.

ఆడిన మూడు మ్యాచ్ లలో ఓడిపోవడంతో ధోనీ లేకుంటే చెన్నై పని ఇంతేనా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుత సీజన్ తర్వాత ధోనీ రిటైరవుతాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో సీఎస్కే ఫ్యూచర్ సంగతేంటి ? ఎల్లకాలం ధోనీ జట్టులో ఉండడు. ఒకవేళ ఉన్నా మెంటార్ గానో,ఇతర బాధ్యతల్లో ఉంటాడు తప్ప మైదానంలో ఉండేది ఆటగాళ్లే.
మరి చెన్నై మేనేజ్ మెంట్ ఆ దిశగా పూర్తిస్థాయిలో ఆలోచించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ధోనీని భర్తీ చేసే ఆటగాడిని వెతకలేకపోయిందని పలువురు చెబుతున్నారు. వచ్చే సీజన్ లో సంజూ శాంసన్ ను చెన్నై ఫ్యూచర్ కెప్టెన్ గా భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ధోనీ స్థానాన్ని సంజూ ఎంతవరకూ భర్తీ చేస్తాడనేది చూడాలి.





