Kidney Stones
ఇప్పుడు అందరిలో మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా తక్కువగా నీరు తాగడం వల్ల.. చాలామంది కిడ్నీలో రాళ్ల (Kidney Stones ) సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యకు ఆయుర్వేదంలో అలాగే గ్రామీణ వైద్యంలో ఒక అద్భుతమైన పరిష్కారం ఉందని నిపుణులు అంటున్నారు. దీనికి ది బెస్ట్ సొల్యూషన్ కొండపిండి ఆకు.
కొండపిండి ఆకుని సంస్కృతంలో పాషాణ భేది అని అంటారు. పాషాణం అంటే రాయి, భేది అంటే పగులగొట్టేది అని అర్థం. అంటే కొండల వంటి రాళ్లను కూడా పిండి చేయగల శక్తి కేవలం ఈ ఆకుకు ఉందని ఆయుర్వేదం చెబుతుంది. ఈ మొక్క ప్రధానంగా కొండ ప్రాంతాలలో , గ్రామాల్లోని పొలాల గట్లపై సహజంగా పెరుగుతుంది. బాడీలోని వ్యర్థాలను (టాక్సిన్స్) బయటకు పంపడంలో , మూత్ర విసర్జనను సాఫీగా చేయడంలో ఇది కీలకంగా పని చేస్తుంది.
ఈ కొండపిండి ఆకును ఆహారంగా తీసుకోవడం చాలా ఈజీ. దీనిని ఆకుకూర పప్పులాగా లేదా వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి వేపుడులా చేసుకుని తినొచ్చు. కొండపిండి ఆకులను శుభ్రంగా కడిగి, సన్నగా తరిగి కూరగా వండుకుని వారానికి మూడు, నాలుగు సార్లు తినాలి. ఇలా తింటే కిడ్నీలో చిన్న చిన్న రాళ్లు యూరిన్ ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.
కేవలం మూత్రపిండాలకే కాకుండా, మూత్రాశయ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి కూడా కొండపిండి ఆకు కూర సాయపడుతుంది. ఆకుకూరగా ఇష్టపడని వారు దీనిని కషాయం రూపంలోనూ తీసుకోవచ్చు. ఆకులన్నిటినీ మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు కలిపి గ్రైండ్ చేసి, ఆ మిశ్రమాన్ని నీటిలో మరిగించి వడకట్టుకుని గోరువెచ్చగా తాగితే మంచి ఫలితాలుంటాయి.
ముఖ్యంగా ఉదయం పూట ఖాళీ కడుపుతో ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల రిజల్ట్ త్వరగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి.. చిన్న సైజు రాళ్లను కరిగించడానికి లేదా బయటకు పంపించడానికి మాత్రమే కొండపిండి ఆకు సహాయం చేయొచ్చు, కానీ పెద్ద సైజు రాళ్లు ఉన్నప్పుడు కానీ తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు కానీ కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి.
కొండపిండి ఆకును ఒక సహాయక చికిత్సగా మాత్రమే భావించాలి. కిడ్నీలో రాళ్లు (Kidney Stones ) లేని వాళ్లు కూడా అప్పుడప్పుడు ఈ కొండపిండి ఆకు కూర ను ఆహారంగా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో రాళ్లు ఏర్పడవట. ప్రకృతి మనకు అందించిన ఈ పల్లెటూరి ఔషధాన్ని వీలయినంత ఎక్కువగా ఉపయోగిస్తే కిడ్నీ ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.
Gold price :స్వల్పంగా తగ్గిన గోల్డ్ ధరలు.. గోల్డ్ ప్యూరిటీ కూడా మీ చేతుల్లోనే ..
