Diet
ప్రస్తుతం చాలామంది మారిన లైఫ్ స్టైల్ వల్ల.. థైరాయిడ్, డయాబెటిస్, ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక సమస్య కోసం చేసే డైట్ మరొక జబ్బుకు అడ్డంకిగా మారుతుండటంతో అసలు ఏం తినాలో అర్థం కాక ..నీరసించిపోతున్నారు. ఇలా థైరాయిడ్, డయాబెటిస్, ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసేలా ఒక హెల్దీ కామన్ డైట్(Diet) పాటిస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.
థైరాయిడ్, షుగర్, ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు ఫుడ్ విషయంలో అయోమయం కలగడం సహజం. అయితే,ఈ నాలుగింటికీ ఉన్న ఒకే ఒక్క ఉమ్మడి శత్రువు ..ఇన్ఫ్లమేషన్ అంటే శరీరంలో వాపు అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్. వీటిని ముందు అదుపు చేస్తే అన్ని సమస్యలు దారికి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
వీటికోసం ముందుగా.. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే మైదా, తెల్ల అన్నం, పంచదార వంటి వాటితో పాటు ప్రాసెస్డ్ ఆయిల్స్‌ను పూర్తిగా వదిలేయాలి . ఇవి లివర్‌లో కొవ్వును పెంచడంతో పాటు..రక్తంలో షుగర్‌ను , కొలెస్ట్రాల్‌ను రెట్టింపు చేస్తాయి. అలాగే థైరాయిడ్ కూడా ఉన్నవారు సోయా ఉత్పత్తులతో పాటు పచ్చిగా ఉన్న క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి గోయిట్రోజెనిక్ ఆహారాలకు మాత్రం దూరంగా ఉండాలి. వీటిని ఉడికించి తింటే పర్వాలేదు కానీ, పచ్చిగా తింటే థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి ఆటంకాన్ని కలిగిస్తాయి.
ఇక ఏం తినాలో అనే విషయానికి వస్తే, వీరు మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ కూడా పీచు పదార్థాలకు (Fiber) ఇవ్వాలి. పొట్టు తీయని తృణధాన్యాలు, చిరుధాన్యాలు (మిల్లెట్స్) షుగర్‌ను కంట్రోల్ చేయడంతో పాటు బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను బయటకు పంపించేస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు ప్రోటీన్ కోసం మొలకెత్తిన గింజలు, గుడ్డు తెల్లసొన, పప్పు ధాన్యాలను తీసుకోవాలి. ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలు గుండె ఆరోగ్యానికి, థైరాయిడ్ పనితీరుకు చాలా హెల్ప్ చేస్తాయి. వంటల్లో రిఫైన్డ్ ఆయిల్స్ పక్కన పెట్టి, గానుగ నూనెలు , ఆలివ్ ఆయిల్‌ను తక్కువ పరిమాణంలో మాత్రమే వాడాలి.
థైరాయిడ్ ఉన్నవారు అయోడిన్, సెలీనియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కానీ అయోడిన్ ఉప్పు పరిమితంగానే ఉండాలి ఎందుకంటే బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్ తగ్గాలంటే రాత్రి పూట భోజనం చాలా తేలికగా ఉండాలి. అలాగే పండ్లలో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, డయాబెటిస్ ఉన్నవాళ్లు తీపి అనిపించే ఏ పండ్లను కూడా తినకూడదు. స్వీట్‌నెస్ తక్కువగా ఉండే జామ, ఆపిల్ వంటి పండ్లను మాత్రమే పరిమితంగా తీసుకోవాలి.
కూరగాయల్లో చేదుగా ఉండే కాకరకాయ, పొట్లకాయ, బీరకాయ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇవి లివర్‌ను శుద్ధి చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అన్నిటికంటే ముఖ్యం.. నీరు ఎక్కువగా తాగడంతో పాటు , రోజుకు కనీసం 30 నిమిషాల నడకను అలవాటుగా మార్చుకోవాలి. ఇది మెటబాలిజమ్‌ను (Metabolism) వేగవంతం చేసి హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. ఆహారం మానేసి వీక్ అవ్వడం కంటే, సరైన ఆహారాన్ని సరైన మోతాదులో ఎంచుకోవడమే అసలైన ట్రీట్మెంట్(Diet) అని నిపుణులు సూచిస్తున్నారు.
