Hardik Pandya
ఊహించిందే జరుగుతోంది… కమర్షియల్ లీగ్ ఐపీఎల్ లో జట్టు వైఫల్యానికి కెప్టెన్లే బాధ్యత వహించాలన్న విషయం మరోసారి రుజువైంది. ఇప్పటికే లక్నో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పంత్ కెప్టెన్సీకి గుడ్ బై చెబితే… ఫ్రాంచైజీలో ఇమడలేక ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యా(Hardik Pandya) వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యాడు.
జట్టులో ఉండలేనంటూ ఫ్రాంచైజీ యాజమాన్యానికి తేల్చి చెప్పేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. నిజానికి సీజన్ మధ్యలోనే ఈ విషయంపై ముంబై యాజమాన్యంతో పాండ్యా(Hardik Pandya) చర్చించాడట. మానసికంగా సమస్యను ఎదుర్కొంటున్నాననీ, పైగా నడుం నొప్పి కూడా ఇబ్బందిగా మారిందని చెప్పినట్టు తెలుస్తోంది.
అయితే మధ్యలో వైదొలిగితే జట్టు సమతుల్యత దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఫ్రాంచైజీ వేచిచూడమన్నట్టు చెప్పిందట. ఇప్పుడు లీగ్ స్టేజ్ లోనే ముంబై ఇండియన్స్ కథ ముగిసినప్పుడు హార్దిక్ పాండ్యా(Hardik Pandya) కెప్టెన్సీ గురించి వార్తలు వచ్చాయి. జట్టు నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధపడతాడని మాత్రం ఎవ్వరూ అనుకోలేదు.
సరిగ్గా ఐదేళ్ల క్రితం గుజరాత్ ఫ్రాంచైజీ నుంచి పాండ్యా ముంబైకి వచ్చేశాడు. అప్పట్లో అతిపెద్గ డీల్ గా అందరూ మాట్లాడుకున్నారు. గుజరాత్ ను తొలి సీజన్ లోనే ఛాంపియన్ గా నిలిపి, రెండో ఏడాది కూడా ఫైనల్ కు చేర్చిన ఘనత దక్కించుకున్నాడు. దీంతో ముంబైని కూడా అదే స్థాయిలో నడిపిస్తాడని అంతా అనుకున్నారు.
కానీ ఐదేళ్లలో సీన్ మొత్తం రివర్స్ అయింది. మొదట్లో రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ కు పగ్గాలు ఇవ్వడం హిట్ మ్యాన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. జట్టులో కూడా కొందరు ఆటగాళ్లు వ్యతిరేకించినట్టు వార్తలు వచ్చాయి. అటు మైదానంలో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎక్కునయ్యాయి. గత రెండు మూడు సీజన్లలో ఆటతీరు ఏమాత్రం మెరుగుపడలేదు. ఈసారి వ్యక్తిగతంగానూ పాండ్యా ఘోరంగా విఫలమయ్యాడు.
గాయంతో కొన్ని మ్యాచ్ లకు దూరమయ్యాడు. 2024 సీజన్ లో ముంబై ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించలేదు. ప్రస్తుత సీజన్ లోనూ ముంబై అట్టర్ ఫ్లాప్ అయింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. కీలక ఆటగాళ్లు ఎవ్వరూ రాణించకపోవడం , కెప్టెన్ గా పాండ్యా కూడా వైఫల్యం చెందడంతో ముంబైకి నిరాశే మిగిలింది.
ప్రస్తుతానికి హార్దిక్ పాండ్యా(Hardik Pandya) వెళ్లిపోవడంపై ముంబై నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. వచ్చే నెలలో జట్టు ప్రదర్శనపై రివ్యూ ఉంటుందని మాత్రమే ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. కానీ హార్దిక్ జట్టును వీడడం ఖాయమని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
