Cortisol
కొంతమందికి రాత్రి హాయిగా పడుకుందామని బెడ్‌పై వాలినా.. సడన్‌గా అర్థరాత్రి 2 గంటలకో, 3 గంటల ప్రాంతంలోనో మెలకువ వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత ఎంత ట్రై చేసినా కన్ను మూతపడక ఇబ్బంది పడుతుంటారు.
అయితే దీనిని ఉరుకులు పరుగుల జీవితంలో ఇవన్నీ అనుకుని కొంతమంది లైట్ తీసుకుంటారు. మరికొంతమంది అది ఏ పని ఒత్తిడో లేక అలసటో అని పట్టించుకోరు. కానీ, అసలు విలన్ వారి శరీరంలోనే దాగి ఉన్న ఒక హార్మోన్ అని తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారని నిపుణులు అంటున్నారు
రాత్రిళ్లు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్ స్క్రీన్లు చూడటం వల్ల బాడీలో కార్టిసాల్(Cortisol) అనే హార్మోన్ మోతాదుకు మించి పెరిగిపోతుందని, అదే వారి నిద్రను పాడు చేస్తోందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ గట్టిగా హెచ్చరిస్తున్నారు.
కిడ్నీల పైన ఉండే అడ్రినల్ గ్రంథులు కార్టిసాల్‌ను రిలీజ్ చేస్తాయి. దీనికే స్ట్రెస్ హార్మోన్ అనే మరో పేరు కూడా ఉంది. ఇది బాడీ ఒత్తిడిని తట్టుకోవడానికి, బ్లడ్ షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంచడానికి, మెటబాలిజాన్ని నడిపించడానికి, వాపులను తగ్గించి బీపీని కంట్రోల్‌లో పెట్టడానికి సాయపడుతుంది.
అంతెందుకు, మనం ఉదయాన్నే బెడ్ మీద నుంచి ఉత్సాహంగా లేవాలన్నా, రాత్రికి హాయిగా పడుకోవాలన్నా ఈ హార్మోన్ కరెక్ట్ టైమింగ్స్ మెయింటెన్ చేయవలసిందే. సాధారణంగా ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలో అందరినీ ఆక్టివ్‌గా ఉంచడానికి కార్టిసాల్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. రోజంతా పని చేసి రాత్రి అయ్యేసరికి ఇవి బాగా తగ్గిపోయి మినిమమ్ లెవెల్‌కి వచ్చేస్తాయి. దానివల్లే బాడీ రిలాక్స్ అయి హ్యాపీగా నిద్రపోతారు.
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. రాత్రి వేళల్లో ఈ కార్టిసాల్(Cortisol) తగ్గకపోగా, మరింత ఎక్కువైతే బ్రెయిన్ ఎప్పుడూ అలర్ట్ మోడ్‌లోనే ఉండిపోతుంది. దీంతో త్వరగా నిద్ర పట్టకపోవడం లేదా ఒకవేళ నిద్రపోయినా రాత్రి 2 గంటల ప్రాంతంలో పదేపదే మెలకువ రావడం జరుగుతుంది. దీనివల్ల ప్రశాంతమైన నిద్ర కరువై, పగటిపూట నిరంతరం అలసటగా ఉంటుంది.
నైట్ షిఫ్ట్‌లు చేయడం, సరిగ్గా పడుకోకపోవడం వల్ల ఈ కార్టిసాల్ మరింత పెరిగిపోతుందని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ రీసెర్చ్‌లో తేలింది. అయితే ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే మన గుండె, మెదడు, కండరాలు, రోగనిరోధక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటాయి. డిప్రెషన్, యాంగ్జైటీ, హై బీపీ, షుగర్, ఎముకలు బలహీనపడటం వంటి పెద్ద పెద్ద రోగాలు వచ్చిపడతాయి.
దీనిలో చాలామందిని బెల్లీ ఫ్యాట్ లేదా పొట్ట పెరగడం ప్రధాన సమస్య అవుతుంది. దీనికి కూడా ఈ కార్టిసాల్ హార్మోనే ప్రధాన సూత్రధారి. కార్టిసాల్ పెరిగినప్పుడు అడ్రినలిన్ ఎఫెక్ట్ ఎక్కువై ఉప్పు శాతాన్ని బాడీలోనే నిలిపేయడం వల్లే బీపీ, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. పైగా ఈ హార్మోన్ పెరిగితే విపరీతమైన ఆకలి వేసి స్వీట్స్, జంక్ ఫుడ్, నూనె వస్తువులు విపరీతంగా తినాలనిపిస్తుంది.
ఇదంతా కలిసే పొట్ట భాగంలో మొండి కొవ్వుగా రూపాంతరం చెందుతుంది. ఈ కార్టిసాల్(Cortisol) అసమతుల్యతను గుర్తించడం చాలా ఈజీ. ఎప్పుడూ నిద్రలేమి, విపరీతమైన అలసట, ఎంతకీ తగ్గని బరువు, మూడ్ స్వింగ్స్, కోపం, షుగర్, బీపీ తేడాలు రావడం దీని మెయిన్ లక్షణాలు. దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ల్యాబ్‌లలో ఉదయం 8 గంటలకు చేసే బ్లడ్ టెస్ట్, సాయంత్రం లేదా రాత్రిళ్లు చేసే లాలాజల టెస్ట్, 24 గంటల యూరిన్ టెస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఈ రోజుల్లో వర్క్ ప్రెజర్, అస్తవ్యస్తమైన ఫుడ్ హ్యాబిట్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, సరిగ్గా విశ్రాంతి లేకపోవడం వల్ల ఈ సమస్యలు తెచ్చి పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా నైట్ టైమ్‌లో నిద్రపోకుండా ఆన్ చేసే స్మార్ట్‌ఫోన్, టీవీ, కంప్యూటర్ స్క్రీన్ల నుంచి వచ్చే వెలుతురు మెదడును బాగా హీటెక్కిస్తుంది.
నిద్రకు కారకమయ్యే మెలటోనిన్ హార్మోన్‌ను ఇది రాకుండా అడ్డుకుంటుంది. సోషల్ మీడియాలో చూసే కొన్ని రకాల టెన్షన్ కంటెంట్ కూడా కార్టిసాల్(Cortisol)ను పెంచేస్తుంది. శరీరానికి రెస్ట్ ఇవ్వకుండా రాత్రిళ్లు చేసే అతి వ్యాయామాలు కూడా బాడీని నీరస పరిచి, రోగనిరోధక శక్తిని తగ్గించేస్తాయి.
దీని నుంచి బయటపడాలంటే రోజూ ఒకే టైమ్‌కి పడుకోవడం, ఒకే టైమ్‌కు లేవడం అలవాటు చేసుకోవాలి. మైండ్‌ను ప్రశాంతంగా ఉంచుకుంటూ మంచి ఫుడ్ తీసుకోవాలి. టీ, కాఫీ, సిగరెట్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. రాత్రి పూట పడుకునే ముందు స్క్రీన్ చూసే టైమ్‌ను పూర్తిగా తగ్గించేయాలి. ఒకవేళ ఇవన్నీ చేసినా కూడా హార్మోన్ల ఇంబ్యాలెన్స్ తగ్గకపోతే మాత్రం లేట్ చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
RBI : వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం..ఈఎంఐ భారం తగ్గుతుందా లేదా?
