Cuba
వెనిజులాలో నికోలస్ మదురో అధికారానికి గండి కొట్టిన అగ్రరాజ్యం అమెరికా.. ఇప్పుడు తన తర్వాత వ్యూహాత్మక అడుగును పొరుగునే ఉన్న క్యూబా(Cuba )వైపు వేస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. క్యూబా దేశానికి త్వరలోనే సంకెళ్లు తెంపి పూర్తి విముక్తిని ప్రసాదిస్తామంటూ తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన అంతర్జాతీయ వేదికపై తీవ్ర సంచలనంగా మారింది.
ఈ వ్యాఖ్యలు వెలువడిన కొద్ది గంటలు కాకముందే అమెరికాకు చెందిన భారీ విమాన వాహక యుద్ధ నౌక ..యూఎస్ఎస్ నిమిట్జ్ తన సాయుధ స్ట్రైక్ గ్రూప్‌తో కలిసి ఏకంగా కరీబియన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించడం అక్కడి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ విషయాన్ని అమెరికా మిలిటరీ విభాగానికి చెందిన సౌతెర్న్ కమాండ్ కూడా అఫీషియల్‌గా కన్ఫమ్ చేసింది.
సుమారు 90 అత్యాధునిక ఫైటర్ జెట్లు, మిలిటరీ హెలికాప్టర్లతో పాటు 5 వేల మందికి పైగా సుశిక్షితులైన నౌకాదళ సైనికులతో కూడిన ఈ యుద్ధనౌక మోహరింపుతో వాషింగ్టన్ , హవానా మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్స్‌కు చేరుకున్నాయి. వెనెజులా లాగా క్యూబా(Cuba)లో కూడా అమెరికా మెరుపు ఆపరేషన్ చేయబోతోందా అనే చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదలైంది.
నిజానికి ఈ వ్యూహాత్మక ఉద్రిక్తతలకు కొన్ని రోజుల ముందే పునాది పడిందని చెప్పాలి. క్యూబా మాజీ అధ్యక్షుడు, 94 ఏళ్ల వృద్ధ నేత అయిన రౌల్ క్యాస్ట్రోపై కొన్ని రకాల నేరారోపణలతో కూడిన చార్జ్‌షీట్‌ను.. అమెరికాలోని మియామి ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ ఆమోదించింది. ఈ చారిత్రాత్మక చట్టపరమైన పేపర్స్‌ను.. అమెరికా న్యాయశాఖ అఫీషియల్‌గా బయటపెట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగి క్యూబా(Cuba) విముక్తి అంటూ అనౌన్స్‌మెంట్ చేశారు.
అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె నేతృత్వంలో రౌల్ క్యాస్ట్రోపై తీసుకున్న ఈ నిర్ణయాన్ని ట్రంప్ మనస్ఫూర్తిగా అభినందించారు. క్యూబా అంతర్గతంగా తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని చెబుతూ.. అక్కడ ప్రస్తుతం పాలకులకు కంట్రోల్ తప్పిందని ట్రంప్ కామెంట్లు చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు క్యూబన్ మూలాలు ఉండటం వల్ల ఆ దేశ భౌగోళిక, రాజకీయ పరిస్థితులపై అమెరికాకు పూర్తి పట్టు ఉందని చెప్పిన ట్రంప్..పైగా అక్కడ సీఐఏ నిఘా వర్గాలు కూడా చురుగ్గా పనిచేస్తున్నాయని అన్నారు.
అంతేకాదు మియామిలోని క్యూబా వలస ప్రజలతో పాటు తమ దేశమంతటా ఉన్న క్యూబన్లు ఈ చట్టపరమైన చర్యను స్వాగతిస్తున్నారని, తాము క్యూబా విషయంలో మాత్రం ఒక పెద్ద స్ట్రాటజీతో ఉన్నట్లు ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం క్యూబా ఆర్థికంగా, సామాజికంగా పతనమవుతున్న దేశమని అన్న ట్రంప్.. వారి వద్ద కనీసం ఇంధన వనరులు కూడా లేవని, కేవలం మానవతా దృక్పథంతోనే అక్కడి ప్రజలను ఆదుకోవడానికే తాము ఈ ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
అయితే అగ్రరాజ్యం వేసిన ఈ ముందడుగును క్యూబా ప్రభుత్వం మాత్రం తీవ్రంగా తప్పుబడుతోంది. క్యూబా గౌరవ నేత రౌల్ క్యాస్ట్రోపై అమెరికా కోర్టుల్లో మోపిన కేసులను..ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు మిగెల్ డియాజ్-కానెల్ బెర్ముడెజ్ తీవ్రంగా ఖండించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అమెరికా పాలకులు ఈ ఫేక్ పేపర్లను క్రియేట్ చేశారని ఆరోపించారు.
ఇదంతా క్యూబాపై ప్రత్యక్షంగా సైనిక దాడి చేయడానికి అలాగే క్యూబా సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడానికి అమెరికా వెతుకుతున్న ఒక వంక మాత్రమేనని మిగెల్ డియాజ్ ఆరోపించారు. క్యూబా విప్లవ స్ఫూర్తిని, అక్కడి ప్రజల సంకల్పాన్ని చూసి తట్టుకోలేక, అమెరికా తన అహంకారాన్ని, నిరాశను ఈ విధంగా ప్రదర్శిస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలను గుప్పించారు.
అయితే అమెరికా న్యాయశాఖ రౌల్ క్యాస్ట్రోపై అంతటి భారీ చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి .. దశాబ్దాల క్రితం జరిగిన ఒక అంతర్జాతీయ ఘటనే కారణమని తెలుస్తోంది. సుమారు 20 పేజీలతో కూడిన ఆ నివేదిక ప్రకారం.. 1996 ఫిబ్రవరి 24న క్యూబా సైన్యం రెండు పౌర విమానాలను ఆకాశంలోనే కూల్చేసింది.
అప్పటి ఘటనలో క్యూబా రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన రౌల్ క్యాస్ట్రో, ఎలాంటి హెచ్చరికలు చేయకుండా ఆయుధాలు లేని సాధారణ విమానాలపై దాడికి ఆదేశాలిస్తూ.. అంతర్జాతీయ విమానయాన రక్షణ చట్టాలను మొత్తం ఉల్లంఘించినట్లు
అమెరికా కోర్టు తీర్పు చెప్పింది.
కాగా ఇప్పుడు ఈ పాత కేసును అస్త్రంగా చేసుకున్నడొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు కరీబియన్ సముద్రంలోకి యుద్ధనౌకలను పంపి వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో క్యూబా రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయోనని ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.
Gold Price : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం బంగారం ధర ఎంతుంది?
