Dubai Diwali Rangoli : దీపావళి స్పెషల్.. 6.5 కిలోల బంగారం, వజ్రాలతో రూ.9 కోట్ల లగ్జరీ రంగోలీ..

Dubai Diwali Rangoli : 6.5 కేజీల బంగారం, వజ్రాలతో రూపొందించిన రూ. 9 కోట్ల లగ్జరీ రంగోలీ విశేషాలు. నటి తమన్నా దుబాయ్‌లో ఆవిష్కరించిన ఈ అద్భుత ప్రదర్శన సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతుందో చూడండి.

Dubai Diwali Rangoli

మామూలుగా మన ఇంటి ముందు రంగోలీ వేయాలి అనగానే టక్కున గుర్తుకొచ్చేది బియ్యపు పిండి, రంగుల పొడులు, మరీ లేదంటే అందమైన పూల రేకులు. భారత దేశంలో పండుగ వచ్చిందంటే గుమ్మం ముందు, వాకిట ముందు ఇలాంటి ముగ్గులే కామన్. కానీ గల్ఫ్ కంట్రీ దుబాయ్‌లో మాత్రం దీపావళి సెలబ్రేషన్స్‌లో ఏకంగా నెక్ట్స్ లెవెల్ లగ్జరీ టచ్ ఇచ్చి అందరికీ మైండ్ బ్లాంక్ చేశారు.

సాధారణ కలర్స్‌కు బదులుగా అచ్చమైన పసిడి ఆభరణాలు, లక్షల విలువ చేసే వజ్రాలతో ఒక భారీ రంగోలీని కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు. దుబాయ్‌లోని ఫేమస్ జ్యువెలరీ సంస్థ డామాస్ సిటీ సెంటర్ డీరాలో ఏర్పాటు చేసిన ఈ వజ్రాల ముగ్గు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.

సుమారు 2 మీటర్ల పొడవు, వెడల్పుతో గ్రిడ్ ఆకారంలో రూపొందించిన ఈ అత్యద్భుతమైన డిజైన్ కోసం ఏకంగా 213 విలువైన ఆభరణాలను ఉపయోగించారు. దీనిలో ఉన్న మొత్తం గోల్డ్ వెయిటే అక్షరాలా 6.5 కిలోలు ఉంది. అంతేకాకుండా 380 క్యారెట్లకు పైగా మెరిసే డైమండ్స్‌ను ఈ కళాఖండంలో పొందుపరిచారు.

జ్యామితీయ ఆకృతులలో గోల్డ్ చైన్స్‌, వజ్రాల నెక్లెస్‌లు అమర్చిన విధానంతో చూసేవాళ్లకు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తోంది. మార్కెట్ లెక్కల ప్రకారం లెక్కిస్తే కేవలం ఈ పసిడి విలువ సుమారు రూ. 9 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కలర్‌ఫుల్ డిజైన్‌ను పూర్తి చేయడానికి 10 మంది నిపుణులు ఏకధాటిగా 16 గంటల పాటు శ్రమించారు.

ఇక ఈ లగ్జరీ రంగోలీని(Dubai Diwali Rangoli)మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా స్వయంగా ప్రారంభించడంతో.. దీనిపై హైప్ నెక్స్ట్ లెవెల్‌కు చేరింది. ఆవిష్కరణ జరిగిన కొద్ది గంటల్లోనే ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో ఈ వీడియోలు మంట పుట్టిస్తుండటంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. భారతీయ ట్రెడిషనల్ ఆర్ట్‌కు దుబాయ్ స్టైల్ విలాసవంతమైన హంగులద్ది చేసిన ఈ అరుదైన ప్రదర్శన నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Pawan Kalyan Divorce : రాజకీయాల్లో కొత్త మెచ్యూరిటీ.. పవన్ విడాకుల అంశంపై వైరి వర్గాలు కూడా సైలెంట్ ..

↑
Exit mobile version