Strait Of Hormuz
హర్మూజ్ జలసంధి సమీపంలో భారతీయులు, భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై వరుస దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రాంతంలో యుఎస్-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా వాణిజ్య నౌకలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి.
తాజాగా 28 మంది భారతీయ సిబ్బందితో వెళ్తున్న ఎల్‌పీజీ ట్యాంకర్‌పై హర్మూజ్ జలసంధి(Strait Of Hormuz) సమీపంలో దాడి జరిగింది. మోజాంబిక్ జెండాతో ప్రయాణిస్తున్న ఎల్‌పీజీ ట్యాంకర్ దిశ నౌక ఇరాన్ జలాల్లో దాడికి గురైంది. దాడి జరిగినప్పుడు ఈ నౌకలో 28 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు.
టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారనీ తెలుస్తోంది. అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని టెహ్రాన్ రాయబార కార్యాలయం తెలిపింది. గతంలో జరిగిన క్షిపణి దాడుల్లో ఒక భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల్లో భారతీయ నావికులను నియమించవద్దని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరికలు జారీ చేసింది.
అమెరికా, ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలు కావడంతో హర్మూజ్ జలసంధి అత్యంత ఉద్రిక్తమైన సైనిక ఘర్షణల జోన్‌గా మారింది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఈ చమురు రవాణా మార్గంలో నౌకల రాకపోకలు దాదాపుగా స్తంభించిపోయాయి. సాధారణంగా రోజుకు 125 నుంచి 140 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో, ప్రస్తుతం రోజుకు కేవలం 3 నౌకలు మాత్రమే నడుస్తున్నాయి.
కొన్ని నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నిబంధనలను ఉల్లంఘించాయనే నెపంతో కొన్ని ట్యాంకర్లపై దాడులు చేయగా, అవి భారీగా తగలబడ్డాయి. ఒమన్ తీరానికి సమీపంలో కూడా గుర్తు తెలియని క్షిపణి దాడి కారణంగా ఒక నౌక నిప్పుల్లో చిక్కుకుంది.
యుద్ధం వల్ల హర్మూజ్ జలసంధిలోనే వందలాది నౌకలు, సుమారు 6 వేల మందికి పైగా నావికులు నెలల తరబడి సముద్రంలోనే చిక్కుకుపోయారు. వాణిజ్య నౌకలు ఇప్పట్లో హర్మూజ్ జలసంధి(Strait Of Hormuz) ద్వారా స్వేచ్ఛగా ప్రయాణించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో షిప్పింగ్ కంపెనీలు ఇకపై హర్మూజ్ జలసంధిని నమ్ముకోలేమని తేల్చేసాయి. ఒమన్, యూఏఈ తూర్పు తీరాల్లో కొత్త పోర్టులను నిర్మించి, రోడ్డు మార్గాల ద్వారా సరుకు రవాణా చేసేలా బిలియన్ డాలర్ల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
