Trisha
తమిళనాడు పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మూవీలు, పాలిటిక్స్ ఒకటిగా కలిసిపోయే విచిత్రమైన వాతావరణం అన్న విషయం తెలిసిందే. దశాబ్దాలుగా సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన తారలు పొలిటికల్ కోట గోడల మీద జెండాలు ఎగరేసిన హిస్టరీ అక్కడుంది.
ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు, ఆ తర్వాత ఇప్పుడు విజయ్ వరకు ఇదే బాటలో నడిచారు. కానీ ఇప్పుడు కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఎక్కడ చూసినా త్రిష(Trisha) పొలిటికల్ ఎంట్రీ మాట వినిపిస్తోంది.
ఒకప్పుడు జయలలిత ఎదుర్కొన్న ఛాలెంజెస్, ఆ తర్వాత సాధించిన తిరుగులేని విజయాన్ని చూసిన వారు.. ఇప్పుడు త్రిష(Trisha) పరిస్థితులను జయలలితకు జరిగిన ఇన్సిడెంట్స్‌కు లింక్ చేస్తూ పెద్ద ఎత్తున విశ్లేషిస్తున్నారు. మధురై వీధుల్లో వెలిసిన పోస్టర్ల నుంచి రాజకీయ నాయకుల ఘాటు వ్యాఖ్యల వరకు ప్రతిదీ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో చిచ్చు రేపుతోంది.
మధురై జిల్లా త్రిష నర్పణి మండ్రం పేరుతో మంగళవారం వెలిసిన బ్యానర్లు ఈ వార్తలకు మరింత ఆజ్యం పోశాయి. తమిళనాడులో ఏ కొత్త రాజకీయం మొదలైనా అది మధురై మట్టి నుంచే పురుడు పోసుకుంటుందనేది అక్కడొక సెంటిమెంట్.
అలాంటి చోట త్రిషను డైరెక్టుగా రాజకీయాల్లోకి రావాలని కోరుతూ ఆమె అభిమానులు ఏర్పాటు చేసిన పోస్టర్ హాట్ టాపిక్‌గా మారింది. దీనికితోడు గతంలో ఒక సరదా ఇంటర్వ్యూలో ఏదో ఒక రోజు సీఎం అవుతానేమో అంటూ ఆమె చేసిన పాత కామెంట్లను నెటిజన్లు మళ్లీ వైరల్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు తన రాజకీయ అరంగేట్రంపై త్రిష ఎలాంటి ప్రకటన చేయకపోయినా, ఆమె మౌనం అర్ధ అంగీకారం అంటూ అదే అతిపెద్ద సమాధానం అని పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ కథలో అసలైన మలుపు.. ఇప్పుడు త్రిష ఎదుర్కొంటున్న వ్యక్తిగత విమర్శలే. రాజకీయ వేదికపై ఆమె పేరును లాగుతూ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్లు, దానికి నిరసనగా టీవీకే వర్గాలు మండిపడటం, ఆపై జరిగిన అరెస్ట్ డ్రామా అంతా తమిళనాడును కుదిపేసింది.
కానీ ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. ఒక మహిళగా త్రిషపై జరుగుతున్న ఇలాంటి వ్యక్తిగత దాడులే ఆమెకు పొలిటికల్ ఎంట్రీకి అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారే అవకాశం ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి.
గతంలో జయలలిత రాజకీయాల్లోకి వచ్చిన ప్రారంభంలో ప్రత్యర్థుల నుంచి ఇంతకంటే దారుణమైన వ్యక్తిగత దూషణలు, కించపరిచే వ్యాఖ్యలను చాలానే ఎదుర్కొన్నారు. కానీ అలాంటి వాటికి బెదిరిపోకుండా, ఆ అవమానాలనే తన ఆయుధాలుగా మార్చుకుని తమిళుల గుండెల్లో అమ్మగా ఎదిగారు.
సరిగ్గా ఇప్పుడు త్రిష చుట్టూ కూడా ఇప్పుడు అలాంటి ఒక సానుభూతి పవనాలు ఏర్పడుతున్నాయి. సెలబ్రెటీలు కూడా సోషల్ మీడియా సాక్షిగా.. ఉదయనిధి వ్యాఖ్యలపై స్పందిస్తూ జయలలిత కాలం నాటి పొలిటికల్ కల్చర్‌నే గుర్తు చేయడం ఈ అనాలసిస్‌కు మరింత బలాన్నిస్తోంది.
నిజానికి రాజకీయ రచ్చలోకి అనవసరంగా ఒక మహిళ పేరును లాగి టార్గెట్ చేయడం వల్ల పరోక్షంగా ప్రజల్లో త్రిష పట్ల అభిమానం, సానుభూతిని రెండింతలు పెరిగేలా చేస్తాయని విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమిళ ఓటర్లు అందులోనూ మరీ ముఖ్యంగా మహిళలు తమ అభిమాన హీరోయిన్‌కు జరిగిన పరాభవాన్ని రాజకీయాల్లో ఆమెకు ఇచ్చే మద్దతు రూపంలో తిప్పికొట్టే అవకాశం ఎంతైనా ఉంటుందని అంటున్నారు.
ఒకవేళ త్రిష కనుక నిజంగానే జయలలిత లాగే ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే, తమిళ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. ఇప్పటివరకు కేవలం సీఎం విజయ్‌తో ఉన్న సాన్నిహిత్యం చుట్టూ తిరిగిన ప్రచారం కాస్తా..త్రిష సొంతంగా ఒక పొలిటికల్ ఇమేజ్‌ను నిర్మించుకునే పరిస్థితులకు దారి తీస్తుంది.
విజయ్ నేతృత్వంలోని టీవీకేకి త్రిష(Trisha) వెన్నుదన్నుగా నిలుస్తుందా లేక తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో ప్రజల్లోకి వెళ్తుందా అనే విషయం పక్కనబెడితే.. ఇలా ఎదురవుతున్న విమర్శలన్నీ కూడా ఆమె పొలిటికల్ గ్రాఫ్‌ను పెంచడానికే ఉపయోగపడుతోంది.
సిల్వర్ స్క్రీన్‌పై రెండు దశాబ్దాలకు నుంచి చెరగని ముద్ర వేస్తున్న త్రిష, ఈ పొలిటికల్ తుపాన్‌ను తనకు అనుకూలంగా మార్చుకుని లీడర్‌గా మారితే మాత్రం.. అది కోలీవుడ్ చరిత్రలోనే మరొక సంచలనం అవుతుంది. మరో జయలలిత సీన్ గ్యారంటీగా రిపీటవుతుంది.
Trisha : త్రిష పొలిటికల్ ఎంట్రీ ?.. మధురైలో పోస్టర్లు అదే కన్ఫమ్ చేస్తున్నాయా?
