America Iran War
అమెరికా, ఇరాన్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది. యుద్ధం ముగిద్దామంటూ ట్రంప్ ప్రకటనలు జారీ చేస్తున్నా ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ట్రంప్ ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతోంది. దీనికి అమెరికా కూడా దీటుగానే కౌంటర్ ఇస్తోంది. తాజాగా ఇరాన్ లోని ఇస్ఫహాన్ నగరంపై బాంబులతో విరుచుకుపడింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్రంప్ ట్రూత్ పోస్టులో షేర్ చేశారు.
ఇస్ఫహాన్ లో భారీగా పేలుడు పదార్ధాలు దాచినట్టు అనుమానంతోనే ఈ దాడి జరిగినట్టు సమాచారం. మరోవైపు అమెరికా ప్రతిపాదించిన డిమాండ్లను ఒప్పుకునేది లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ 15 డిమాండ్లను ఇరాన్ ముందు పెట్టారు. అయితే ఆ ప్రతిపాదనలన్నీ అసమంజసంగా ఉన్నాయని ఇరాన్ మండిపడింది.
కొన్ని ప్రతిపాదనలయితే అతిగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఇరాన్ ఎప్పటికీ ఈ ప్రతిపాదనలు ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చేసింది. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా, ఇరాన్ మధ్య ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగలేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. హార్మూజ్ జలసంధి కోసమే అమెరికా చర్చలకు దిగొచ్చిందని పేర్కొంది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వం తమకు అవసరమే లేదని ఇరాన్ ఖరాఖండిగా చెప్పేసింది.
ట్రంప్ ప్రతిపాదించిన 15 డిమాండ్లలో అణు బాంబుల తయారీని ఇరాన్ పక్కనపెట్టాలన్నది ప్రధానంగా ఉంది. అలాగే హార్మూజ్ జలసంధిని రీ ఓపెన్ చేయాలని ,హిజ్బుల్లా వంటి టెర్రర్ గ్రూపులను పెంచి పోషించొద్దని కండీషన్ పెట్టారు. నెల రోజుల పాటు కాల్పుల విరమణ కూడా పాటించాలని షరతు పెట్టారు.
ఇవేమీ కూడా తాము ఒప్పుకోమని ఇరాన్ ట్రంప్ కు జవాబిచ్చింది. ఈ షరతులకు ఇరాన్ కూడా కొన్ని కౌంటర్ కండీషన్లు పెడుతూ ప్రపోజల్ పంపించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ బేస్‌లను మూసేయడం, ఇరాన్‌పై అన్ని ఆంక్షలను ఎత్తేయడం వంటివి ఈ డిమాండ్లలో ఉన్నాయి. హార్మూజ్‌లో నౌకలపై ట్రాన్సిట్ ఫీజు విధించేందుకు అనుమతివ్వాలని కూడా షరతులు విధించింది.
ఇదిలా ఉంటే ఇరాన్ ఈ స్థాయిలో పోటీనిస్తుందని ఊహించని అమెరికా యుద్ధంలో(America Iran War) గెలిచే పరిస్థితి లేదన్న కారణంతోనే చర్చలకు దిగిందని పలువురు భావిస్తున్నారు. అటు హర్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరవలేకపోయినా సరే యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ తన సిబ్బందికి సూచించినట్లు తెలుస్తోంది. దీనిని బలవంతంగా తెరిపించే ప్రక్రియ 6 వారాల కంటే ఎక్కువ టైం తీసుకుంటుందని అమెరికా భావిస్తోంది.
