Just LifestyleLatest News

Appreciation : మెచ్చుకోలు లేకపోతే కుంగిపోతున్నారా? మీ రిమోట్ కంట్రోల్ ఎదుటివారి చేతుల్లో ఎందుకు పెడుతున్నారు?

Appreciation : ఇతరులకు నచ్చడం కోసం, వారి అంచనాలను అందుకోవడం కోసం మనం మన ఇష్టాలను మార్చుకుంటాం.

Appreciation

ఇప్పుడున్న ప్రపంచంలో మనిషి చేసే ప్రతి పనికీ ఒక గుర్తింపు , ఒక మెచ్చుకోలు (Appreciation)కావాలి అని కోరుకుంటున్నారు. అది ఇంట్లో వండిన వంట కావొచ్చు, ఆఫీసులో చేసిన ప్రాజెక్ట్ కావొచ్చు, చివరకు సోషల్ మీడియాలో పెట్టిన ఒక ఫోటో కావొచ్చు. ఎవరో ఒకరు వచ్చి భలే చేశావ్ అని అంటేనే ఆ పని పట్ల హ్యాపీగా ఫీలవుతున్నారు.

ఒకవేళ ఎవరూ కనుక పట్టించుకోకపోతే మాత్రం, మనం చేసిన పని వేస్ట్ ఏమో అన్న అనుమానం వారిలో మొదలవుతుంది. సైకాలజీ భాషలో దీనిని ఎక్స్‌టర్నల్ వ్యాలిడేషన్ అంటారు. అంటే మన సంతోషాన్ని, మన నైపుణ్యాన్ని ఇతరుల సర్టిఫికెట్ మీద ఆధారపడేలా చేసుకోవడం. ఇది వినడానికి బాగానే ఉన్నా, లోతుగా ఆలోచిస్తే మాత్రం ఇది మన వ్యక్తిత్వాన్ని మెల్లగా తినేసే ఒక మానసిక బలహీనతగా మారుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు .

ఎప్పుడైనా సరే మనం చేసే పని మంచిదా కాదా అని నిర్ణయించే అధికారం మాత్రం మనకే ఉండాలి. కానీ, ప్రస్తుత కాలంలో మన రిమోట్ కంట్రోల్‌ను తెలీకుండానే మనం ఇతరుల చేతుల్లో పెట్టేస్తున్నాం. ఎవరైనా పొగిడితే ఆకాశమంత ఎత్తుకు ఎగిరిపోయేలా గంతులు వేయడం, ఎవరైనా చిన్న విమర్శ చేసినా, అస్సలు పట్టించుకోయినా పాతాళానికి కుంగిపోవడం చేస్తున్నాం. అయితే ఇదంతా మనల్ని ఒక రకమైన మానసిక బానిసలుగా మారుస్తుంది.

పదిమంది మెచ్చుకుంటేనే నేను గొప్పవాడిని అనుకోవడం అంటే, మీ విలువను మీరు తక్కువ చేసుకుంటున్నట్లే లెక్క అని ముందుగా గుర్తించాలి(Appreciation).ఎందుకంటే ఎదుటివారు పొగిడినప్పుడు కలిగే సంతోషం తాత్కాలికం, కానీ మన పని పట్ల మనకు ఉండే సంతృప్తి మాత్రం శాశ్వతం. లోకం తీరు ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని పొగిడిన వారే రేపు చాలా ఘోరంగా విమర్శించొచ్చు. అలాంటప్పుడు ఇలాంటి వారి మాటల మీద మీ జీవితాన్ని నిర్మించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించాలి.

దీనివల్ల మనం మన అసలైన వ్యక్తిత్వాన్ని కోల్పోవడం అనే అతిపెద్ద నష్టంలో కూరుకుపోతాం. ఇతరులకు నచ్చడం కోసం, వారి అంచనాలను అందుకోవడం కోసం మనం మన ఇష్టాలను మార్చుకుంటాం. మనకు నచ్చని పనులు కూడా కేవలం వాళ్లు బాగుంది అంటారు కదా అనే ఆలోచనతో ముందుకు వెళ్లి పోతాం.

కానీ రాను రాను దీనివల్ల లోపల అసంతృప్తి పేరుకుపోతుంది. పైకి నవ్వుతూ కనిపించినా కూడా లోపల ఏదో వెలితి వేధిస్తూనే ఉంటుంది. మనల్ని మనం ప్రేమించుకోవడం, మనం చేసే పనులను ఇష్టపడటం బానే ఉంటుంది. ఎందుకంటే అది మనచేతిలోనే ఉంటుంది. కానీ ఇతరులు మనం చేసింది ఇష్టపడాలని కోరుకోవడం వల్ల మనసులో, మెదడులో కలిగే ఒత్తిడి సామాన్యమైంది కాదు. ఇది ఇలాంటివారిలో మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది.

నిజమైన విజేత ఎప్పుడూ తన అంతరాత్మ చెప్పే మాటను మాత్రమే వింటాడు. ఒక పని చేసేటప్పుడు తాను దీనికి వంద శాతం న్యాయం చేస్తున్నానా అంటూ తనని తాను ప్రశ్నించుకుంటాడు. నిజానికి అక్కడ కనుక సమాధానం అవును అని వస్తే, బయట ప్రపంచం మీ ముందు చేసే చప్పట్లతో పనే ఉండదు.

Appreciation
Appreciation

మీ విలువ మీ కష్టంలోనే ఉంటుంది. అంతెందుకు మీ నిజాయితీలో, మీ వ్యక్తిత్వంలోనే మీ విలువ ఉంటుంది. ఎవరో వచ్చి సర్టిఫికెట్ ఇచ్చే వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీ మీద మీకు నమ్మకమున్నప్పుడు, మీరు వేసే ప్రతి అడుగులోనూ ఒక క్లారిటీ ఉంటుంది.

ఇతరుల మెచ్చుకోవడం(Appreciation) కోసం కాకుండా, మీ ఎదుగుదల కోసం మీరు పని చేయడం మొదలుపెట్టిన రోజు.. గతంలో ఎప్పుడూ కనిపించని ఒక తెలీని ధైర్యం మీలో పుడుతుంది. లోకం మిమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా కూడా మీరు మీ ప్రయాణాన్ని ఆనందంగా, మనుపటి కంటే బాగా కొనసాగిస్తారు. అందుకే, ఇకపై అయినా మీ సంతోషాన్ని ఇతరుల మాటల్లో వెతకడం ఆపేయడం అలవాటుగా మార్చుకోవాలి.

Live for Yourself: లోకం మెచ్చే బతుకు కాదు.. నీ కోసం నువ్వు జీవించడం మర్చిపోకు

Related Articles

Back to top button