Barry Marshall:వైద్య లోకాన్ని గడగడలాడించిన డాక్టర్ సాహసం.. నోబెల్ విజేత బారీ మార్షల్ వీరగాథ మీకు తెలుసా?

Barry Marshall: బారీ మార్షల్ , రాబిన్ వారెన్ అనే డాక్టర్లు మాత్రం అల్సర్ బాధితుల కడుపులో.. హెలికోబాక్టర్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా తిష్టవేసి ఉండటాన్ని తమ పరిశోధనల్లో గమనించారు.

Barry Marshall

సాధారణంగా ఏ డాక్టర్ అయినా రోగాన్ని తగ్గించడానికి మందులు ఇస్తారు. అయితే తను కనిపెట్టిన నిజాన్ని ప్రపంచం నమ్మడం లేదని, ఏకంగా బిలియన్ల సంఖ్యలో ఉన్న ప్రాణాంతక బ్యాక్టీరియాను ఒక బీకరు నిండా నింపుకుని, ఏమాత్రం తడబడకుండా తాగేసారు ఓ డాక్టర్. అందుకే ఈ వైద్యుడి సాహస గాథ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

అప్పుడు ఆయన తాగిన ఆ ఒక్క గుక్క బ్యాక్టీరియా.. దశాబ్దాల కాలంగా వైద్య శాస్త్రం నమ్ముతున్న ఒక పెద్ద అబద్ధాన్ని బద్దలు కొట్టింది. అంతేకాదు కోట్ల మంది ప్రాణాలను కాపాడింది. ఆ సాహసి పేరే డాక్టర్ బారీ మార్షల్(Barry Marshall).

1984లో ఆస్ట్రేలియాకు చెందిన యువ వైద్యుడు బారీ మార్షల్.. ఒక విప్లవాత్మకమైన విషయాన్ని గుర్తించారు. అప్పట్లో గ్యాస్ట్రిక్ అల్సర్లు అంటే విపరీతమైన మానసిక ఒత్తిడి ఉన్నవాళ్లకు, కారంగా ఉండే ఆహారం తినేవారికి మాత్రమే వస్తాయని ప్రపంచమంతా నమ్మేది.

కడుపులోని యాసిడ్‌లో ఏ బ్యాక్టీరియా బ్రతకదనేది అప్పట్లో ఒక తిరుగులేని సత్యంగా జనాలు నమ్మేవారు. కానీ బారీ మార్షల్ , రాబిన్ వారెన్ అనే డాక్టర్లు మాత్రం అల్సర్ బాధితుల కడుపులో.. హెలికోబాక్టర్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా తిష్టవేసి ఉండటాన్ని తమ పరిశోధనల్లో గమనించారు.
అందుకే అల్సర్ అనేది ఒక ఇన్ఫెక్షన్ అని, దీన్ని యాంటీబయాటిక్స్‌తో నయం చేయొచ్చని మార్షల్ , రాబిన్ వారెన్ ప్రకటించారు. కానీ వైద్య ప్రపంచం మాత్రం వారిని అవహేళన చేసింది. మీరు నిజమైన డాక్టర్లు కారు.. దశాబ్దాల సైన్స్‌ను సవాలు చేస్తారా?” అంటూ వారి పరిశోధనలను పక్కన పడేశారు.

అయితే తమ మాటను ఎవరూ నమ్మడం లేదని గ్రహించిన మార్షల్, ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎవరికీ చెప్పకుండా, కనీసం తన భార్యకు కూడా ఈ విషయాన్ని ముందే వివరించకుండా, ల్యాబ్‌లో ఉన్న బ్యాక్టీరియా ద్రవాన్ని అతి కష్టం మీద తాగేశారు. దీంతో రోజురోజుకు ఆయనలో మార్పులు రావడం మొదలయ్యాయి.

బారీ మార్షల్(Barry Marshall) బ్యాక్టీరియాను తాగిన ఐదు రోజులకే విపరీతమైన దుర్వాసనతో కూడిన వాంతులు, వికారం మొదలయ్యాయి. పదో రోజున ఎండోస్కోపీ చేయగా ఆయన కడుపు లోపల తీవ్రమైన వాపు , బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు చాలా క్లియర్‌గా కనిపించింది. అలా తనే రోగాన్ని స్వయంగా తెచ్చుకుని, మళ్లీ తనే యాంటీబయాటిక్స్‌తో దాన్ని నయం చేసుకుని ప్రపంచానికి తమ పరిశోధనలో నిజాన్ని చూపించారు. దీంతో అల్సర్ అనేది మానసిక సమస్య కాదని, అది ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అని ప్రపంచమంతా ఒప్పుకుంది.

Barry Marshall

బారీ మార్షల్ అద్భుత ఆవిష్కరణ వల్ల అల్సర్ బాధితులకు చేసే భయంకరమైన సర్జరీల అవసరం 70 శాతం వరకూ తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వాలు , సామాన్య ప్రజల కోట్లాది రూపాయల ధనం ఆదా అయ్యింది. ఒకప్పుడు తన పరిశోధనా పత్రాన్ని అత్యల్ప రేటింగ్‌ ఇచ్చి రిజెక్ట్ చేసి చెత్తబుట్టలో వేసిన అదే వైద్య ప్రపంచం, 2005లో బారీ మార్షల్‌ను నోబెల్ బహుమతితో గౌరవించి తమ తప్పును సరిదిద్దుకుంది.

అధికారికంగా ఉన్న అపోహల కంటే, కళ్లముందున్న నిజాలను నమ్మడమే నిజమైన విజ్ఞానమని బారీ మార్షల్ నిరూపించారు. ఒక వ్యక్తి తను బలంగా నమ్మిన నిజం కోసం చేసిన ప్రాణత్యాగ ప్రయోగం, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అల్సర్ రోగులకు శాశ్వత విముక్తిని ప్రసాదించింది.

Gujarat Titans : చెపాక్ లో చెన్నైకి బిగ్ షాక్..గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీ

Exit mobile version