Green Card
అమెరికాలో గ్రీన్ కార్డ్ సాధించి శాశ్వతంగా స్థిరపడాలని కలలు కనే వాళ్లకు.. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. వలస చట్టాలను మరింత కఠినతరం చేసే పనిలో భాగంగా ట్రంప్ ఒక సంచలన నిర్ణయాన్ని తెర మీదకు తీసుకు వచ్చారు.
ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం స్టూడెంట్ వీసా, హెచ్-1బీ , ఇతర వీసాలపై అమెరికాలో ఉంటున్న వాళ్లు.. అక్కడ నివసిస్తూనే గ్రీన్ కార్డ్(Green Card )కోసం అప్లై చేసుకునే అవకాశం అంటే అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ వెసులుబాటు ఉండేది.
అయితే ఇకపై ఆ పద్ధతి నడవదని, గ్రీన్ కార్డ్(Green Card )కావాలనుకునే వాళ్లు ముందే అమెరికా వదిలి తమ స్వదేశాలకు వెళ్లిపోవాలని, వారి దేశాల నుంచే అప్లై చేసుకోవాలని కొత్త రూల్ తీసుకొచ్చారు. అయితే చాలా అరుదైన, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే దీనికి కొన్ని మినహాయింపులు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. కానీ..ఈ కొత్త నిబంధన గ్రీన్ కార్డ్ ఆశావహులకు పెద్ద హెడేక్‌గా మారింది.
ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల అమెరికాలో ఉన్న విదేశీయులపై, ముఖ్యంగా భారతీయ ఉద్యోగులు, స్టూడెంట్స్‌పై ఎక్కువ ప్రభావం పడనుంది. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేసే హెచ్-1బీ వీసాదారులు, హయ్యర్ స్టడీస్ కోసం వెళ్లిన విద్యార్ధులు, డిపెండెంట్ వీసాలపై అక్కడ నివసిస్తున్న వాళ్లతో పాటు.. లోకల్ అమెరికన్లను పెళ్లి చేసుకుని గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూసే వాళ్లు కూడా ఈ కొత్త రూల్ పరిధిలోకి వస్తారు.
నిజానికి అమెరికన్ వీసా వ్యవస్థలో ఉన్న లొసుగులను అరికట్టడానికి..అగ్రరాజ్యంలోకి వలసల ప్రవాహాన్ని తగ్గించడానికే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ మార్పులు తెచ్చినట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రతీ ఏటా కుప్పలు తెప్పలుగా వచ్చే అప్లికేషన్లను స్క్రీనింగ్ చేసే భారాన్ని అమెరికా వలస శాఖ అధికారులకు తగ్గుతుందని వారు భావిస్తున్నారు.
అయితే ఈ రూల్ వల్ల అనేక ప్రాక్టికల్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ కోసం ఉద్యోగులు హఠాత్తుగా తమ తమ దేశాలకు వెళ్లాల్సి రావడం వల్ల.. భార్యాభర్తలు, పిల్లలు విడిపోయి కుటుంబాలు వేరువేరుగా ఉండే పరిస్థితులు వస్తాయి.
అంతేకాకుండా, గ్రీన్ కార్డ్ వెయిటింగ్ టైమ్ చాలా ఎక్కువగా పెరిగిపోవడమే కాకుండా, వీసా ఇంటర్వ్యూల కోసం ఎంబసీల చుట్టూ తిరగాల్సి వస్తుంది. దీనివల్ల ప్రయాణ ఖర్చులు పెరిగి భారంగా మారిపోతాయి. అన్నిటికంటే పెద్ద రిస్క్ ఏంటంటే.. ఒకసారి అమెరికా వదిలి వచ్చిన తర్వాత మళ్లీ అక్కడికి రీ-ఎంట్రీ దొరుకుతుందా లేదా అనే గ్యారెంటీ ఉండదు.
ఈ కండిషన్ వల్ల అమెరికాకే ఎక్కువ నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అక్కడ ఎన్నో ఏళ్లుగా కంపెనీలను నడిపిస్తున్న టాలెంటెడ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఎక్స్ పర్ట్స్ తమ ఉద్యోగాలను వదిలేసి కుటుంబాలతో పాటు తమ దేశాలకు తిరిగి వెళ్లిపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది.
ముఖ్యంగా భారతీయులలో చాలా మంది ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ కోసం ఎన్నో ఏళ్లుగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు. ఇప్పుడు ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తే మాత్రం ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన తెలుగువాళ్ల భవిష్యత్తు గందరగోళంలో పడబోతోంది.
Gold Prices : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం ధరలు
