Trump Tariffs
భారతీయ ఎగుమతిదారులతో పాటు వాణిజ్య రంగానికి సంబంధించి అమెరికా నుంచి భారీ ఊరట లభించబోతోంది. ఏడాది కాలంగా అమెరికా విధించిన అదనపు సుంకాల (Trump Tariffs) వల్ల నష్టపోయిన భారత కంపెనీలకు సుమారు 93 వేల కోట్ల నుంచి 1.12 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా అమెరికా నుంచి రీఫండ్ వచ్చే అవకాశం ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి.
దీనిపై ప్రముఖ వాణిజ్య అధ్యయన సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (GTRI) ఒక కీలక రిపోర్టును రిలీజ్ చేసింది. అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో.. ఈ నిధుల వాపసు ప్రక్రియకు దారి దొరికినట్లు అయింది.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి జనవరి 20, 2025న బాధ్యతలు చేపట్టిన తర్వాత , అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా కఠినమైన నిర్ణయాలను తీసుకున్నారు. 1977 నాటి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (IEEPA)ను అడ్డం పెట్టుకుని భారత్ సహా కొన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీగా అదనపు పన్నులను విధించిన సంగతి తెలిసిందే.
ఏప్రిల్ 2025 నుంచి- ఫిబ్రవరి 2026 మధ్య కాలంలో అమలులో ఉన్న ఈ టారిఫ్‌ల(Trump Tariffs) వల్ల భారత ఎగుమతిదారులు ఆర్థిక భారానికి గురయ్యారు. ముఖ్యంగా బట్టలు, ఇంజినీరింగ్ వస్తువులు, కెమికల్స్ , ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులపై ఈ ప్రభావం ఎక్కువగా పడింది.
అయితే,డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం.. రాజ్యాంగ విరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు 2026 ఫిబ్రవరి 20న కీలక తీర్పు ఇచ్చింది. దీంతో అదనంగా వసూలు చేసిన సుంకాలను ఇప్పుడు తిరిగి చెల్లించక తప్పని పరిస్థితి అమెరికా ప్రభుత్వానికి ఏర్పడింది.
రీఫండ్ ప్రక్రియ ఎలా సాగుతుందంటే..ఈ నిధులను తిరిగి చెల్లించడానికి అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ (CBP) విభాగం కేప్ (CAPE – Consolidated Administration and Processing of Entries) అనే ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా స్టార్ట్ చేసింది. దీని ద్వారా దిగుమతిదారులు తమ రీఫండ్ క్లెయిమ్‌లను రిజిస్టర్ చేసుకోవచ్చు.
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. అమెరికా చట్టాల ప్రకారం, ఈ రీఫండ్ నేరుగా భారతీయ ఎగుమతిదారులకు అందదు. అమెరికాలో వస్తువులను దిగుమతి చేసుకున్న కంపెనీలకే (Importers) ఈ రీఫండ్ వాపసు వస్తుంది.
రీఫండ్ డైరక్టుగా భారతీయులకు రాకపోయినా, భారత ఎగుమతిదారులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. భారత కంపెనీలు అమెరికాలోని తమ దిగుమతిదారులతో చర్చలు జరిపి, ఆ రీఫండ్ మొత్తంలో కొంత వాటాను పొందేలా ఒప్పందాలను చేసుకోవచ్చు.
గతంలో ఎదురైన నష్టాన్ని భర్తీ చేయడానికి ఇంపోర్టర్స్ భారత కంపెనీలకు కొత్త ఆర్డర్లలో రాయితీలను ఇవ్వడం లేదా ఎక్కువ ఆర్డర్లు ఇచ్చే అవకాశముంటుంది. అదనపు టారిఫ్‌లు తొలగిపోవడంతో పాటు పాత పన్నులు వెనక్కి రావడం వల్ల అమెరికా మార్కెట్‌లో భారతీయ వస్తువుల ధరలు తగ్గి, పోటీ పెరుగుతుంది. దీనివల్ల ఎక్స్‌పోర్ట్స్ మళ్లీ పుంజుకుంటాయి.
మొత్తానికి, ట్రంప్ విధించిన టారిఫ్ బాదుడు నుంచి విముక్తి లభించడమే కాకుండా, భారీ స్థాయిలో నిధులు వెనక్కి రావడమనేది భారత ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా ఎగుమతి రంగంలో ఉన్న ఎంఎస్ఎంఈ (MSME)లకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పొచ్చు.
Thirunama Seva:తిరు నామంతో సాక్షాత్తు శ్రీనివాసుడి దర్శనం.. తిరుమలలో పునః ప్రారంభమైన తిరునామ సేవ
