Nidhi Agarwal: వైరల్ అవుతోన్న నిధి అగర్వాల్ లులూ మాల్ ఘటన..సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛకు భద్రత ఎక్కడ?

Nidhi Agarwal :అభిమానం పేరుతో అసభ్యతకు లైసెన్స్ తీసుకుంటున్న ఈ సంస్కృతి మారాల్సిన సమయం వచ్చేసింది.

Nidhi Agarwal

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఏ చిన్న విషయం జరిగినా అది క్షణాల్లో వైరల్ అయిపోతోంది. కానీ కొన్ని సంఘటనలు మాత్రం మన ఆలోచనల్ని మార్చాల్సిన అవసరం ఉందని గట్టిగా గుర్తుచేస్తాయి. తాజాగా హైదరాబాద్‌లోని లులూ మాల్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ఎదురైన చేదు అనుభవం కేవలం ఒక వైరల్ వీడియో మాత్రమే కాదు, మన సమాజంలో ఫ్యాన్ కల్చర్ ఎంత ప్రమాదకరమైన దారిలోకి జారిపోతోందో చూపించే ఒక పెద్ద అలారం.

సెలబ్రిటీ అయినా లేదా ఒక సాధారణ అమ్మాయి అయినా, తన శరీరం మీద హక్కు తనకే ఉంటుందనే ప్రాథమిక విషయాన్ని చాలా మంది మర్చిపోతున్నారు. అభిమానం పేరు చెప్పుకుని ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం ఏ రకంగానూ సమర్థనీయం కాదన్న సంగతి గంగలో కలిపేస్తున్నారు.

తాజాగా లులూ మాల్‌లో ప్రభాస్ , మారుతి కాంబినేషన్లో వస్తున్న ద రాజాసాబ్ సినిమాలోని సహనా సహనా అనే పాటను విడుదల చేయడానికి నిధి అగర్వాల్(Nidhi Agarwal) ముఖ్య అతిథిగా వెళ్లారు. ఈవెంట్ పూర్తయిన తర్వాత ఆమె తన కారు దగ్గరికి వెళ్లే సమయంలో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పింది. సెక్యూరిటీ సిబ్బంది ఆమె(Nidhi Agarwal)ను రక్షించడానికి ప్రయత్నించినా, అక్కడ ఉన్న జనం ఆమెను తాకడానికి, ఆమె మీదకు పడిపోవడానికి ప్రయత్నించారు.

ఆ 40 సెకన్ల వీడియోను గమనిస్తే, మొదట నిధి(Nidhi Agarwal) నవ్వుతూనే అందరినీ పలకరిస్తూ వెళ్లడానికి ట్రై చేశారు. కానీ జనం ఆమె మీదకు విపరీతంగా ఎగబడటంతో ఆమె(Nidhi Agarwal) ముఖంలో భయం, అసహనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె ఎలాగోలా కారులో కూర్చోవడానికి ప్రయత్నిస్తుంటే, చుట్టుపక్కల ఉన్న జనం చేతులు, ఫోన్లు ఆమెకు తగులుతూ పూర్తిగా ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించాయి. దీనిని చూసిన నెటిజన్లు వీళ్లు ఫ్యాన్స్ కాదు, కేవలం వేటాడే వల్చర్స్ అని మండిపడుతున్నారు.

అలాగే నటి విద్యా బాలన్ కోల్కతా ఎయిర్‌పోర్టులో ఎదుర్కొన్న అనుభవం మరో రకం. ఒక వ్యక్తి సెల్ఫీ పేరుతో ఆమెపై చేయి వేయడానికి ప్రయత్నిస్తే, ఆమె నేరుగా “నో.. యు కాంట్” అని ఆపి తన నిరసన వ్యక్తం చేశారు. ఫోటో ఇవ్వడం అంటే శరీరాన్ని తాకడానికి అనుమతి ఇచ్చినట్లు కాదని ఆమె గట్టిగా చెప్పారు.

Nidhi Agarwal

అలాగే దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా పబ్లిక్ ఈవెంట్లలో ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. ఒక ఈవెంట్‌లో కత్రినాను జనం చుట్టుముట్టినప్పుడు నటుడు అక్షయ్ కుమార్ ఒక షీల్డ్‌లా నిలబడి ఆమెను రక్షించాల్సి వచ్చింది. ఇలియానా డిక్రూస్, సోనాక్షి సిన్హా వంటి వారు కూడా రద్దీని అడ్డు పెట్టుకుని కొందరు పురుషులు తమ వెన్నుపైన, భుజాల పైన అవాంఛితంగా టచ్ చేశారని బహిరంగంగానే వాపోయారు.మలయాళ నటి రంజిని ఒక ఫంక్షన్‌లో తనను తాకడానికి వచ్చిన వ్యక్తిని స్టేజ్ మీదనే చెంపదెబ్బ కొట్టి బుద్ధి చెప్పడం ద్వారా తన ఆత్మగౌరవాన్ని చాటుకుంది.

అభిమానం అనే ట్యాగ్‌తో స్టార్లపై ఒత్తిడి తీసుకురావడం మరో దారుణం. ప్రియాంక చోప్రా షూటింగ్ సమయంలో ఒక వ్యక్తి ఆమె చేయి పట్టుకుని వదలకపోతే, ఆమె తన ఆత్మరక్షణ కోసం అతన్ని కొట్టాల్సి వచ్చింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ప్రమోషన్స్ సమయంలో కొందరు వ్యక్తులు తన బాడీకి తాకేలా ప్రవర్తించడంతో వరుణ్ ధావన్ జోక్యం చేసుకుని వారిని బయటకు పంపాల్సి వచ్చింది. ఇది కేవలం హీరోయిన్లకే కాదు, సూపర్ స్టార్లకు కూడా ఎదురవుతున్న సమస్యే. ముంబై ఎయిర్‌పోర్టులో షారుక్ ఖాన్ లేదా సల్మాన్ ఖాన్ వంటి వారు కూడా జనం తోపులాటలో బ్యాలెన్స్ కోల్పోయే స్థాయికి వెళ్లడం మనం చూస్తున్నాం.

మన ఫ్యాన్ కల్చర్ లో ఒక ప్రమాదకరమైన ప్యాటర్న్ కనిపిస్తోంది. 2024లో హైద్రాబాద్ సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ సమయంలో, అల్లు అర్జున్ వచ్చిన వెంటనే గుంపు అదుపుతప్పి ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఆ తొక్కిసలాటలో రెవతి అనే మహిళ నొక్కుకుపోయి చనిపోయింది, ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఇప్పటికీ చికిత్స పొందుతున్నాడు.

ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. అభిమానం అంటే దూరం నుంచి సెల్ఫీ అడగడం లేదా హాయ్ చెప్పడం. కానీ బలవంతంగా తాకడం, బట్టలు లాగడం, బాడీకి తగిలేంత దగ్గరికి రావడం మాత్రం కచ్చితంగా నేరం కిందికే వస్తుంది. ఇది లీగల్ గా అసాల్ట్ లేదా వేధింపుల కేటగిరీలోకి వస్తుంది. ఫ్యాన్ అన్న పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆ నేరం చెరిగిపోదు.

ఈ ఘటనలో కేవలం జనాన్ని మాత్రమే తప్పుపడితే సరిపోదు, ఆర్గనైజర్ల బాధ్యతారాహిత్యం కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. లులూ మాల్ లోపల లాబీ చాలా చిన్నది. అటువంటి ప్రదేశంలో ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ టీమ్‌ను, నిధి అగర్వాల్ ను రప్పించినప్పుడు ఎంత క్రౌడ్ వస్తుందో ముందే ఊహించాల్సిన బాధ్యత మేనేజ్‌మెంట్‌ది.

సరైన బారికేడ్లు, క్లియర్ ఎంట్రీ ,ఎగ్జిట్ దారులు లేకపోతే ఆ జనసందోహం ఒక్క నిమిషంలో హింసాత్మక గుంపుగా మారిపోతుంది. కేవలం వైరల్ వీడియోలు వస్తాయి, పబ్లిసిటీ దక్కుతుంది అనే ఆలోచనతో సెలబ్రిటీల ప్రాణాలను, గౌరవాలను రిస్కులో పెట్టడం ఆర్గనైజర్ల తప్పు. సేఫ్టీ ప్లాన్ లేకుండా స్టార్స్ ని లోపలికి లాగి, బయటకి వచ్చేటప్పుడు రక్షించలేకపోవడం ఒక సిస్టమిక్ ఫెయిల్యూర్ అనే చెప్పొచ్చు.

సెలబ్రిటీలు కూడా మనలాంటి మనుషులే అనే వాక్యాన్ని మనం చాలా సీరియస్ గా అర్థం చేసుకోవాలి. సెలబ్రిటీ కాబట్టి ఆమె(Nidhi Agarwal) బాడీ మీద మీకు హక్కు వస్తుంది అనుకోవడం చాలా ప్రమాదకరమైన ఆలోచన. హీరోయిన్లు, హీరోలు అనేది కేవలం వారి వృత్తి మాత్రమే. వారికి కూడా వ్యక్తిగత స్పేస్, భయం, అసౌకర్యం ఉంటాయి. అభిమానం అంటే దూరం నుంచి క్లాప్స్ కొట్టడం, సినిమా టికెట్ కొని చూడటం. అంతే తప్ప బాడీకి అతుక్కుపోవడం కాదు.

చివరగా, నిధి (Nidhi Agarwal)ఘటనలో లేదా కనికా కపూర్ ఘటనలో వీడియోల్లో కనిపిస్తున్న వ్యక్తులపై కఠినమైన లీగల్ కేసులు పెడితేనే ఇతరులకు భయం వస్తుంది. అభిమానం అనేది దూరం నుంచి చూసి మురిసిపోయేలా ఉండాలి కానీ, ఎదుటివారిని భయపెట్టేలా ఉండకూడదు. ఈ విషయంలో మనం ఇప్పుడు మారకపోతే, మన ఫ్యాన్ కల్చర్ కేవలం ఉన్మాదంగా మాత్రమే మిగిలిపోతుంది. మీడియా కూడా ఇలాంటి వీడియోలను వైరల్ క్రౌడ్ అంటూ గ్లామరైజ్ చేయకుండా, ఇది హరాస్మెంట్ అని సూటిగా చెప్పాలి. అభిమానం పేరుతో అసభ్యతకు లైసెన్స్ తీసుకుంటున్న ఈ సంస్కృతి మారాల్సిన సమయం వచ్చేసింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version