Visakhapatnam:విశాఖపట్నం పర్యాటకానికి ఊపు.. IATO సదస్సుతో కొత్త శకం ప్రారంభం!

Visakhapatnam:40వ ఐఏటీఓ వార్షిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరపున టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పాల్గొని..రాష్ట్ర పర్యాటక అభివృద్ధి అవకాశాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు.

Visakhapatnam

2026లో జరిగే 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ సదస్సుకు పర్యాటకుల గమ్యస్థానమైన విశాఖపట్నం(Visakhapatnam) అతిథ్యం ఇవ్వనుందని రాష్ట్ర పర్యాటక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ప్రకటించారు. ఈ నెల 22 నుండి 24 వరకు ఒడిశాలోని పూరీలో స్వోస్తి ప్రీమియం బీచ్ రిసార్ట్స్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 40వ ఐఏటీఓ వార్షిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరపున టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పాల్గొని..రాష్ట్ర పర్యాటక అభివృద్ధి అవకాశాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు.

ఆయన తన ప్రసంగంలో రెజువెనేట్ ఇన్బాండ్ @ 2030( Rejuvenate Inbound @ 2030) అనే అంశంపై ముఖ్యంగా దృష్టి సారించారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పెట్టుబడిదారులకు అందిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలు, పర్యాటకానికి పారిశ్రామిక హోదా వంటి విషయాలను వివరించారు.

పర్యాటక రంగానికి బంగారు భవిష్యత్ ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. పర్యాటక కేంద్రాల అభివృద్ధి, అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోయే మౌలిక సదుపాయాలు కల్పన, కనెక్టివిటీ విస్తరణ వంటి అంశాలపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టిందన్నారు. త్వరలో ఏపీలో ఏర్పాటుచేయబోయే కొత్త విమానాశ్రయాల ప్రణాళికను కూడా వెల్లడించారు.

Visakhapatnam

కేంద్ర ప్రభుత్వ సహకారంతో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర టూరిజం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. చివరగా, వచ్చే ఏడాది విశాఖపట్నం(Visakhapatnam)లో జరుగనున్న 41వ IATO వార్షిక సదస్సులో అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ సదస్సులో వ్యాపార సెషన్లు, ఇండియన్ టూరిజం ఫెయిర్ వంటి అంశాలపై కూడా చర్చలు జరిగాయి.

అయితే ఈ సదస్సు వలన విశాఖపట్నానికి లభించే ప్రధాన ప్రయోజనాలను ఓసారి చూస్తే..IATO సదస్సు దేశీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నానికి గుర్తింపును తీసుకువస్తుంది. ప్రముఖ టూర్ ఆపరేటర్లు, పెట్టుబడిదారులు పర్యాటక నిపుణుల భాగస్వామ్యంతో ఈ నగరం ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా నిలుస్తుంది.

ఈ సదస్సు విదేశీ మరియు దేశీయ పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో టూర్ ఆపరేటర్లు మరియు హోటల్ గ్రూపులు ఇప్పటికే విశాఖపట్నం(Visakhapatnam)లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. సదస్సు కోసం పర్యాటక ప్రదేశాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తారు. కొత్త ఎయిర్‌పోర్ట్‌లు, రోడ్డు కనెక్టివిటీ, హోటల్‌లు మరియు రిసార్ట్‌లు వంటివి అభివృద్ధి చెందుతాయి.

పర్యాటక రంగం విస్తరించడం, పెట్టుబడులు పెరగడం వల్ల యువతకు అనేక కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా సేవల రంగంలో ఉద్యోగాలు పెరుగుతాయి. పర్యాటకుల రాకపోకలు పెరిగే కొద్దీ, స్థానిక మార్కెట్లు, హస్తకళల దుకాణాలు, రెస్టారెంట్లు వంటివి వృద్ధి చెంది ఆర్థిక ప్రగతికి దోహదపడతాయి.

రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రత్యేక రాయితీలు మరియు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈ సదస్సు వల్ల ఈ విధానాలకు మరింత ఊతం లభిస్తుంది.
సదస్సులో జరిగే వ్యాపార సమావేశాలు , టూరిజం ఫెయిర్‌లు పర్యాటక రంగంలో భాగస్వాముల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తాయి.

మొత్తంగా 41వ IATO సదస్సు విశాఖపట్నంలో పర్యాటక అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి, ఉద్యోగ అవకాశాల సృష్టికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఇది స్థానిక ప్రజలు, వ్యాపారులు, ప్రభుత్వానికి లాభదాయకమైనదనే అభిప్రాయం వినిపిస్తోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Exit mobile version