Sammakka Sarakka Jatara
దక్షిణ భారత కుంభమేళాగా, ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీకగా విరాజిల్లుతున్న మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర(Sammakka Sarakka Jatara) ఈరోజు (బుధవారం, జనవరి 28, 2026) అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పిల్లాపాపలు, సకుటుంబ సమేతంగా వస్తున్న భక్తులతో ఊళ్లకు ఊళ్లే కదిలి మేడారం చేరుకోవడంతో అడవి అంతా జనారణ్యంగా మారింది.
రెండేళ్లకోసారి జరిగే ఈ అద్భుత ఘట్టం కోసం కోట్లాది మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు జరిగే ఈ మహాజాతర(Sammakka Sarakka Jatara)లో తొలి ఘట్టం అత్యంత కీలకం. సాయంత్రం వేళ డప్పు చప్పుళ్లు, ఆదివాసీల శివసత్తుల పూనకాలు, జయజయధ్వానాల మధ్య సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి కొలువుదీరబోతున్నారు.
జాతరలో మొదటి రోజు.. బుధవారం సాయంత్రం పూజారులు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకువస్తారు. ఇదే సమయంలో మహబూబాబాద్ జిల్లా పూనుగుండ్ల నుంచి బయలుదేరిన సమ్మక్క భర్త పగిడిద్దరాజు, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు జంపన్నవాగు చేరుకుని, అక్కడి నుంచి గద్దెలపైకి చేరుకుంటారు.
పగిడిద్దరాజును పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేయడం ఇక్కడ ఒక ప్రత్యేక ఆచారంగా కొనసాగుతుంది. దీని కోసం మంత్రి సీతక్క ప్రభుత్వం తరపున స్వయంగా పట్టు వస్త్రాలను పెనక వంశీయులకు అందించారు. గద్దెలను ఎక్కించే సమయంలో పూజారులు నిర్వహించే పూజలు, ఆచారం ప్రకారం జరిగే కార్యక్రమాలు భక్తులకు కనువిందు చేయబోతున్నాయి.
జాతర ఏర్పాట్లను మంత్రి సీతక్క దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పగిడిద్దరాజు కొలువుదీరిన మూడు జిల్లాల సరిహద్దు ప్రాంతాన్ని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని సీతక్క హామీ ఇచ్చారు. ఎండోమెంట్ హాల్ కోసం, అర్చీల నిర్మాణం కోసం ఇప్పటికే 50 లక్షల రూపాయలు కేటాయించామని చెప్పిన ఆమె.. గద్దెలను ఎక్కించే కార్యక్రమం ఆరు నుంచి ఏడు గంటల మధ్య పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.
మరోవైపు మేడారం పరిసరాలన్నీ విద్యుద్దీప కాంతులతో మెరిసిపోతుండగా, అడవి తల్లి ఒడిలో దేవతలు కొలువుతీరడం ఒక అద్భుత దృశ్యమని భక్తులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఈసారి మేడారం జాతరలో సాంకేతికత ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ పోలీసులు మొదటిసారిగా ఏఐ (Artificial Intelligence)ను ఉపయోగిస్తున్నారు.
రద్దీని కంట్రోల్ చేయడం, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ మాత్రమే కాకుండా, జాతరలో తప్పిపోయిన చిన్నారులను, వృద్ధులను గుర్తించడానికి ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ను కూడా వాడుతున్నారు. సుమారు 21 ప్రభుత్వ శాఖల సమన్వయంతో, 42 వేల మంది అధికారులు, 5 వేల మంది వైద్య సిబ్బంది కంటెన్యూగా భక్తులకు సేవలు అందిస్తున్నారు. కోటిన్నర మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో తాగునీరు, పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడా లోటు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
బుధవారం సారలమ్మ గద్దెపైకి వచ్చిన తర్వాత, జాతరలో అత్యంత కీలక ఘట్టం గురువారం రోజు జరుగుతుంది. అదే ‘సమ్మక్క ఆగమనం’. చిలుకల గుట్టపై నుంచి కుంకుమ భరణి రూపంలో సమ్మక్కను పూజారి కొక్కెర కృష్ణయ్య తీసుకువస్తారు. ఆ సమయంలో ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గౌరవ సూచకగా గాల్లోకి కాల్పులు జరిపి దేవతకు స్వాగతం పలుకుతారు.
అలాగే శుక్రవారం రోజు భక్తులు తమ మొక్కులు చెల్లించుకుని ఎత్తు బంగారం (బెల్లం) సమర్పిస్తారు. ఇక శనివారం దేవతల వన ప్రవేశంతో ఈ మహత్తర వేడుక ముగుస్తుంది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్రల నుంచి కూడా భక్తులు లక్షలాది మంది తరలివస్తున్నారు.
