Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఎలాంటి ఘోరపరాభవం ఎదురైందో అందరికీ తెలుసు.. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమైన వైఎస్ జగన్ పార్టీ ఆ షాక్ నుంచి చాలా రోజులు కోలుకోలేకపోయింది. మెల్లిగా ఆ పరిస్థితికి కారణమేంటనే దానిపై సమీక్షలు జరుపుకుని మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో ప్రజల తరపున పోరాడే అంశాలపై దృష్టి పెట్టకపోవడంతో వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. రెండు రోజులు తాడేపల్లిలో , మిగిలిన రోజులు బెంగళూరు ప్యాలెస్ లో గడుపుతూ ఎప్పటిలానే పార్టీ శ్రేణులకు, ప్రజలకు దూరంగా ఉండిపోయారు. అప్పుడప్పుడూ వైఎస్సార్సీపీ చేపట్టిన కార్యక్రమాలపై ట్వీట్లు చేయడం తప్పిస్తే జగన్ చేసిందేమీ లేదు.
దీనిపై సొంతపార్టీలోనే విమర్శలు వినిపించాయి. అయితే గత కొన్ని రోజులుగా వైెస్సార్సీపీ ఎత్తుకున్న అంశం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ..పీపీపీ విధానంపై పోరాటం… ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తుందని, దీనిని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ చేపట్టింది. తాజాగా ఏపీ గవర్నర్ ను కలిసి దీనికి సంబంధించిన వినతి పత్రం కూాడా ఇచ్చింది.
అంతేకాదు ప్రజల్లో ఈ అంశం గురించి చర్చ పెట్టగలిగామంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్వహిస్తే వచ్చే సమస్యలు, జరిగే నష్టం అంటూ కొన్ని వివరాలను ప్రజల ముందుకు అది కూడా సోషల్ మీడియా వేదికగా తీసుకెళ్లామని ధీమాగా చెబుతున్నారు.
అక్టోబర్ లో ప్రారంభమైన కోటి సంతకాల సేకరణ కాస్త ఆలస్యమైనా కూడా మెరుగ్గానే చేసామని వ్యాఖ్యానిస్తున్నారు. అటు జగన్ కూడా ప్రతిపక్షనేతగా తొలిసారి బలంగా తన వాయిస్ వినిపించారని వైసీపీ భావిస్తోంది. ఎందుకంటే గతంలో కొన్ని అంశాలు పార్టీపరంగా లేవనెత్తినా జగన్ మాత్రం పెద్దగా స్పందించింది లేదు.
కేవలం ట్వీట్లు చేసి సరిపెట్టారు. అయితే మెడికల్ కాలేజీల పీపీపీ అంశాన్ని మాత్రం సీరియస్ గా తీసుకుని నిరసన గళాన్ని వినిపించారు. ఇకపై ప్రభుత్వ హామీలు అమలు, ఇతర సమస్యలపై ఇదే తరహా దూకుడుతో వెళితే వచ్చే ఎన్నికల సమయానికి బాగా పుంజుకోవచ్చని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే పార్టీకి తమ నోటిదురుసుతో తీవ్ర నష్టం చేసిన నాయకులను సైతం వైసీపీ పక్కన పెడుతోంది. ఇటీవల బోరుగడ్డ అవిల్ ఉదంతమే దీనికి ఉదాహరణ, వైసీపీ నేతగా చెప్పుకుంటూ హడావుడి చేస్తున్న బోరుగడ్డకు, పార్టీతో సంబంధం లేదని ప్రకటించింది. మొత్తం మీద పీపీపీ అంశంతో వైఎస్ జగన్ రీ యాక్టివేట్ అయ్యారంటూ వైసీపీ శ్రేణులు (Andhra Pradesh)ఆనందపడుతున్నాయి.
