Bay of Bengal
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వింతగా మారబోతోంది. ఒకవైపు ఎముకలు కొరికే చలి.. పంజా విసురుతుంటే, మరోవైపు బంగాళాఖాతంలో (Bay of Bengal ) అల్పపీడనం బలపడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతం , హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని ఏర్పడిన ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారబోతున్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఇది ప్రధానంగా తమిళనాడు తీరం వైపు పయనిస్తున్నా కూడా, దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ , రాయలసీమ ప్రాంతాలపై కచ్చితంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాలలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. దీనివల్ల కొద్దిరోజులుగా వణికిస్తున్న చలి తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. అయితే, జనవరి 10వ తేదీ శనివారం నుంచి దక్షిణ కోస్తా , రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉన్నా కూడా, తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కురుస్తుంది. వాహనదారులు, ముఖ్యంగా హైవేలపై ప్రయాణించే వారు విపరీతంగా కురిసే మంచు వల్ల దృశ్యమానత (Visibility) తగ్గి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ..దీంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు ఏపీలోని అల్లూరి జిల్లాలోని పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెండు రోజులుగా ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీలకే పడిపోయాయి. మినుములూరులో కేవలం 4 డిగ్రీలు నమోదు అవుతూ ఉండటం అక్కడి చలి తీవ్రతకు అద్దం పడుతోంది. ఉదయం 8 గంటలు దాటినా మంచు తెరలు తొలగకపోవడంతో ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. పర్యాటకులు ఈ అందాలను చూసి మురిసిపోతున్నా, స్థానిక గిరిజనులు మాత్రం చలి మంటల దగ్గరే ఎక్కువ సమయం గడుపుతున్నారు.
వాతావరణం ఇలా పదే పదే మారుతున్నప్పుడు ఆరోగ్యంలో మార్పులు రావొచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు న్యూమోనియా బారిన పడే అవకాశం ఉంది. దీనికోసం ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగడం, సీజన్ లో దొరికే పండ్లను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అయితే చలి నుంచి ఉపశమనం కోసం చాలామంది రాత్రి పూట మంచం కింద నిప్పుల కుంపట్లు పెట్టుకుంటున్నారని అది ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి వల్ల ప్రమాదవశాత్తూ మంటలు అంటుకోవడం లేదా పొగ వల్ల ఊపిరి ఆడకపోవడం వంటివి జరుగుతున్నాయని చెబుతున్నారు. బాడీలో రక్త ప్రసరణ సక్రమంగా ఉండటానికి ఇంట్లోనే చిన్నపాటి వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు.
