22A lands
ఏపీలో భూ యజమానులను, ముఖ్యంగా రైతులను 22ఏ (22A lands)నిషేధిత భూముల జాబితా సమస్య ఎన్నో ఏళ్లుగా వేధిస్తుంది. ఆ భూమిపై పూర్తి హక్కులు ఉన్నా కూడా, సాంకేతిక కారణాల వల్లో, అధికారుల పొరపాట్ల వల్లో అవి నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయాయి. దీనివల్ల తమ భూమిని తాము అమ్ముకోవాలన్నా, చివరకు బ్యాంకుల్లో రుణాలు పొందాలన్నా పడరాని పాట్లు పడుతున్నారు.
ఈ క్లిష్టమైన సమస్యకు చెక్ చెప్పడానికి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఒక విప్లవాత్మకమైన ఆటో ఐడెంటిఫికేషన్ విధానాన్ని తీసుకురాబోతోంది. దీనికోసమే ఒక నెల రోజుల పాటు ప్రత్యేక మాసోత్సవాలు నిర్వహించి, ఈ భూ సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
నిజానికి 22ఏ(22A lands) జాబితాలో మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితులకు ప్రభుత్వం కేటాయించిన భూములు చాలా ఉన్నాయి. వీటితో పాటు 1954 కంటే ముందు అసైన్ చేసిన భూములు, రైతువారీ పట్టాలు ఉన్న ఈనాం భూములు కూడా పొరపాటున ఈ నిషేధిత లిస్టులోకి చేరిపోయాయి.
దీనికి తోడు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వే సమయంలో అనేక ప్రైవేటు పట్టా భూములు కూడా 22ఏ లోకి వెళ్లడం వల్ల రైతులు దశాబ్దాలుగా అనుభవిస్తున్న హక్కులను కోల్పోయారు. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం, ఇప్పుడు సీసీఎల్‌ఏ (CCLA) స్థాయిలోనే సాఫ్ట్‌వేర్ ద్వారా అటువంటి భూములను గుర్తించి, నేరుగా కలెక్టర్లకు పంపేలా కేంద్రీకృత విధానాన్ని అమలు చేయబోతోంది. దీనివల్ల భూ యజమానులు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, పారదర్శకమైన పరిష్కారం లభిస్తుంది.
తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయం ప్రకారం, ఒకవేళ పట్టా ఈనాం భూమి పొరపాటున నిషేధిత లిస్టులో ఉంటే మాత్రం, ఆటోమేటిక్ విధానం ద్వారా అది కలెక్టర్ లాగిన్‌కు చేరిపోతుంది. సంబంధిత అధికారులు 15 రోజుల్లోగా దానిని పరిశీలించి, సరైన కారణం లేకపోతే మాత్రం వెంటనే జాబితా నుంచి తొలగించాలి.
ఒకసారి కనుక కలెక్టర్ ఆ భూమిని 22ఏ నుంచి తొలగిస్తే, అది వెంటనే వెబ్‌ల్యాండ్ పోర్టల్‌లో , రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లలో అప్‌డేట్ అవుతుంది. దీనివల్ల రైతులు వెంటనే తమ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కానీ ఇతర అవసరాలకు వాడుకోవడానికి కానీ అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా దేవాదాయ, వక్ఫ్ భూముల విషయంలో కూడా ప్రత్యేకమైన లాగిన్లు కల్పించి, క్షేత్రస్థాయి రిపోర్టుల ఆధారంగా వేగంగా నిర్ణయాలు తీసుకునేలా విధివిధానాలను రూపొందించారు.
పట్టణ ప్రాంతాల్లో విలీనమైన గ్రామాలు, గ్రామ కంఠం భూములు , ఇళ్ల పట్టాల సమస్యలపై కూడా కూటమి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రిలీజ్ చేయనుంది. పదేళ్లు దాటిన ఇళ్ల పట్టా భూములను ఫ్రీ హోల్డ్ చేసే నిబంధనలను స్ట్రిక్టుగా అమలు చేయడం ద్వారా వేలాది కుటుంబాలకు మేలు జరగనుంది. కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ సమగ్ర చర్యల వల్ల అక్రమాలకు తావులేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ తమ భూమిపై పూర్తి హక్కులు లభిస్తాయని భావిస్తున్నారు.
