Nara Rohit: ఘనంగా నారా రోహిత్ -శిరీషల వివాహం.. దగ్గరుండి పెళ్లి జరిపించిన ఏపీ సీఎం చంద్రబాబు

Nara Rohit: అక్టోబర్ 30వ తేదీన, రాత్రి 10:35 గంటలకు, పెద్దల ఆశీస్సులతో నారా రోహిత్ -శిరీష ఏడడుగులు నడిచారు.

Nara Rohit

టాలీవుడ్ యువ నటుడు నారా రోహిత్ (Nara Rohit)ఎట్టకేలకు ఒక ఇంటివాడు అయ్యాడు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న రోహిత్, నటి శిరీష (సిరి లేళ్ల)తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరిద్దరూ అక్టోబర్ 30వ తేదీన, రాత్రి 10:35 గంటలకు, పెద్దల ఆశీస్సులతో ఏడడుగులు నడిచారు. ఈ వివాహ వేడుక హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా, ఘనంగా జరిగింది.

Nara Rohit

నారా రోహిత్, శిరీష కలిసి నటించిన ‘ప్రతినిధి 2’ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమకు కుటుంబ సభ్యుల అనుమతి లభించడంతో, గతేడాది అక్టోబర్‌లో వారి నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్న ఈ జంట, ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొత్త జంటకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.

Nara Rohit

ఈ వివాహ వేడుకకు నారా కుటుంబం తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు నారా రోహిత్‌కు పెదనాన్న అయిన నారా చంద్రబాబు నాయుడు గారు, దగ్గరుండి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారు. వివాహ వేడుకలో చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు , ఏపీ మంత్రి నారా లోకేష్ సహా పలువురు ముఖ్యమైన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దివంగత నారా రామ్మూర్తి నాయుడు తనయుడైన రోహిత్‌కు చంద్రబాబు నాయుడు గారు అక్షింతలు వేసి, మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

Nara Rohit

కొడుకులాంటి రోహిత్(Nara Rohit) పెళ్లి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాలో భావోద్వేగభరితమైన పోస్ట్ పంచుకున్నారు.

“మా ఇంటి పెళ్లి సందడి… నా సోదరుడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు దివ్య ఆశీస్సులతో తనయుడు నారా రోహిత్, శిరీషల వివాహ వేడుకను అంగరంగ వైభవంగా చేశాం. నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీస్సులు అందజేశాం. మా రోహిత్ ఒక ఇంటివాడు అవుతున్న శుభ సందర్భం మా కుటుంబానికి ఒక పండుగ. మా నారావారి ఆహ్వానం మన్నించి పెళ్లికి విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు” అంటూ ఆయన తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందేశంతో పాటు వివాహ వేడుకకు సంబంధించిన అందమైన ఫోటోలను కూడా ఆయన పంచుకున్నారు.

రోహిత్ కెరీర్ హైలైట్..నారా రోహిత్ ఈ ఏడాది విడుదలైన ‘భైరవం’, ‘సుందరకాండ’ వంటి చిత్రాలతో విజయాలను అందుకున్నారు. వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టిన రోహిత్‌కు, ఆయన తదుపరి చిత్రాలకు కూడా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version