Article 370
దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపు తిప్పిన ఆర్టికల్ 370 (Article 370) రద్దుకు నేటితో ఆరేళ్లు. 2019 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పుడు దేశ చరిత్రలో శాశ్వత ముద్ర వేసింది. ఈ కీలక ఘట్టాన్ని గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రజలకు ప్రత్యేకంగా మెసేజ్ ఇచ్చారు.
ఒక రాజ్యాంగపరమైన తప్పిదానికి శాశ్వత పరిష్కారంగా నిలిచిన రోజు ఇది. దేశ సమగ్రతకు కొత్త దిక్సూచి వేసిన రోజు. కాశ్మీర్ యువతను హింస నుంచి విముక్తి చేసి, అభివృద్ధి మార్గంలో నడిపించేందుకు మైలురాయి వేస్తున్న రోజు. 370 రద్దుతో ప్రతి భారత పౌరుడి హక్కులు అక్కడి వారికి కూడా వర్తించేటట్లు మారింది అని పవన్ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే.. భారత్ తీసుకున్న ఈ గట్టి అడుగుపై ఇప్పటికీ పాకిస్తాన్‌కి విరుగుడు దొరకలేదు. మొదట్నుంచీ కాశ్మీర్ విషయంలో నాలుగు మాటలు ఎక్కువే మాట్లాడే పాకిస్తాన్, 370 రద్దు తర్వాత ఇప్పటికీ చర్చా వేదికల నుంచి అంతర్జాతీయ ఫోరాల వరకూ వ్యతిరేక స్వరమే వినిపిస్తూ వస్తోంది. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఇది అంతర్గత వ్యవహారం.. కశ్మీర్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే మా లక్ష్యం అంటూ స్పష్టంగా చెప్పేస్తోంది.
ఈ సందర్బంగా.. ఆర్టికల్ 370(Article 370) రద్దుతో భారత్‌కి కలిగిన లాభాలను చర్చించుకుంటే..జమ్మూ కశ్మీర్ ప్రజలకు దేశంలోని ఇతర రాష్ట్రాలవారితో సమానమైన హక్కులు లభించాయి. అన్ని భారత రాజ్యాంగ చట్టాలు కాశ్మీర్‌లో వర్తించాయి. కేంద్ర నిధులు, అభివృద్ధి పథకాలు కాశ్మీర్‌కు మరింత స్పష్టంగా చేరే మార్గం కనిపించింది. ఉగ్రవాదంపై కట్టుదిట్టైన ఆపరేషన్లకు బలమైన చట్టపరమైన ఆధారాలు దొరికాయి. అలాగే విదేశీ పెట్టుబడులకు అవకాశం కలిగి మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతం అయ్యాయి.
ప్రస్తుతం కేంద్రం కశ్మీర్ అభివృద్ధిలో ముందంజ వేస్తోంది. రాష్ట్ర హోదా పునరుద్ధరణపై చర్చలు జరుగుతున్నాయి. అవసరమైన సమయంలో స్పష్టత ఇస్తాం అనే సంకేతాలను పంపిస్తోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం కేంద్రంపై నమ్మకం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. అయినా కూడా ప్రజలు మాత్రం ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్‌లో మార్పు మొదలైంది అనే అభిప్రాయంతో ఉన్నారు.