Raft foundation
ఒక దేశానికి లేదా ఒక రాష్ట్రానికి రాజధాని అంటే కేవలం భవనాల సముదాయం మాత్రమే కాదు.. అది ఆ ప్రజల ఆశలు, ఆకాంక్షలు ,అలాగే ఆత్మగౌరవానికి ప్రతీక. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఐదేళ్ల స్తబ్ధతను వీడి, మళ్లీ కాంక్రీట్ దశలోకి అడుగుపెట్టిన అమరావతిలో ఒక భారీ ఘట్టం మొదలయింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయిన ‘హైకోర్టు’ శాశ్వత భవన నిర్మాణం కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టే భవనం కాదు ఇది.. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్న ఒక ‘ఐకానిక్’ కట్టడంగా నిలవబోతోంది.
డిసెంబర్ 24న పురపాలక శాఖ మంత్రి నారాయణ రాఫ్ట్ ఫౌండేషన్ పనులు ప్రారంభించడంతో ఈ భారీ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. అసలు ఈ రాఫ్ట్ ఫౌండేషన్(Raft foundation) అంటే ఏమిటో అర్థమయ్యేలా చెప్పాలంటే.. భారీ భవనాలు భూమిలోకి కుంగిపోకుండా, మొత్తం బరువును సమానంగా పంచే ఒక పటిష్టమైన కాంక్రీట్ బెడ్ వంటిది అన్నమాట. ఎందుకంటే అమరావతి వంటి నల్లరేగడి నేలల్లో ఇలాంటి సాంకేతికత వాడటం చాలా చాలా అవసరం. న్యాయ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండాలో, అలాగే దానికి నిలయమైన భవనం కూడా అంతే బలంగా ఉండాలన్నది కూటమిప్రభుత్వం ఆలోచన.
ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ సంస్థ -నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ ఈ భవనానికి డిజైన్ రూపొందించింది. కేవలం ఒక ఆఫీస్‌లాగా కాకుండా, ఒక చారిత్రాత్మక కట్టడం(Raft foundation) లా ఉండేలా ప్లాన్ చేశారు. మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 52 కోర్టు హాళ్లతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, 8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి (Chief Justice) కోర్టు ఉంటుంది. అంటే న్యాయం ఎప్పుడూ ఉన్నత స్థానంలోనే ఉంటుందనే సంకేతాన్ని ఈ డిజైన్ ఇస్తున్నట్లు అన్నమాట.
ఈ భవనం ఎంత బలిష్టంగా ఉండబోతుందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే.. దీని కోసం ఏకంగా 45 వేల టన్నుల స్టీల్‌ను వాడుతున్నారు. సాధారణంగా ఒక భారీ వంతెన కట్టడానికి వాడే దానికంటే ఇది చాలా ఎక్కువ. భవనం భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదన్న ఉద్దేశంతో అత్యుత్తమ నాణ్యత గల మెటీరియల్‌ను వాడుతున్నట్లు కూటమి ప్రభుత్వం చెబుతోంది. 2027 డిసెంబర్ నాటికి ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి, న్యాయమూర్తులు , న్యాయవాదులకు ఒక శాశ్వత చిరునామా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
చాలా మందికి ఇది కేవలం ఒక భవనంలా కనిపించవచ్చు. కానీ అమరావతిలో ఇలాంటి ఐకానిక్ భవనాలు నిర్మాణం( Raft foundation) కావడం వల్ల రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు కూడా పెరుగుతాయి. ఒక పూర్తి స్థాయి రాజధాని రూపురేఖలు కనిపిస్తేనే, ప్రపంచ దేశాల దృష్టి మనపైన పడుతుంది. గతంలో అర్థాంతరంగా నిలిచిపోయిన ఈ కల, ఇప్పుడు మళ్లీ నిజమవుతుండటం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఒక శుభసూచకంగా భావిస్తున్నారు ఏపీ వాసులు. న్యాయ వ్యవస్థకు శాశ్వత గౌరవాన్ని ఇచ్చే ఈ భవనం, అమరావతి మకుటంలో ఒక మణిహారంలా నిలవబోతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
